Share News

నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:21 AM

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా సాధారణ పరిశీలకులకు సూచించారు.

నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి

  • ‘స్థానికం’ పరిశీలకులుగా 28 మంది ఐఏఎస్‌లు

  • రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా

అమరావతి, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా సాధారణ పరిశీలకులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లాకు ఒక అధికారి చొప్పున 28 మంది ఐఏఎస్‌ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఎన్నికల నిర్వహణకు సంబంధించి పరిశీలకులకు ఆయన పలు సూచనలు చేశారు.

ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే ఘటనలపై అప్రమత్తంగా ఉంటూ, నిబంధనల అమలుకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పోల్‌ మేనేజ్‌మెంట్‌ యాప్‌ను రూపొందించిందని అనిల్‌చంద్రపునేఠా తెలిపారు. ఈ యాప్‌ ద్వారా ఓటర్ల నిర్వహణ, పోలింగ్‌ కేంద్రాల వివరాలు, ఎన్నికల నిర్వహణ విధానాలు తదితర సమాచారాన్ని అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.


ఎన్నికల సమయంలో శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటూ పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అత్యంత కీలకమైనవని పేర్కొన్న కమిషనర్‌, ప్రతి ఓటరు ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తన ఓటు హక్కును వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

మీ ఛాయిస్‌ ఎవరు?

మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 16 , 2026 | 05:21 AM