13,168 పంచాయతీలకు 3 దశల్లో ఎన్నికలు.. 23 పట్టణ సంస్థలకూ నోటిఫికేషన్13,168 పంచాయతీలకు 3 దశల్లో ఎన్నికలు.. 23 పట్టణ సంస్థలకూ నోటిఫికేషన్
ABN , Publish Date - Nov 13 , 2026 | 01:50 AM
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. 13,168 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల పోరుకు తెరలేచింది. మొత్తం 13,354 పంచాయతీలు ఉండగా..
మొదటి విడతలో 4180 గ్రామాలకు ఎన్నికలు
రెండో దశలో 4715.. చివరగా 4273
తొలిదశకు నేడు నోటిఫికేషన్
16, 19 తేదీల్లో మిగతావాటికి..
26, 29, 2 తేదీల్లో పోలింగ్.. కౌంటింగ్, ఫలితాలు
4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలకు16వ తేదీ వరకు నామినేషన్లు
26న పోలింగ్.. 30న ఫలితాలు
అమరావతి, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమైంది. 13,168 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల పోరుకు తెరలేచింది. మొత్తం 13,354 పంచాయతీలు ఉండగా.. కోర్టు కేసులు, వివిధ కారణాల వల్ల 186 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడం లేదు. మిగతావాటికి మూడు విడతల్లో ఎన్నికలు జరిపేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. శుక్రవారం మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు చేపట్టేందుకు నోటిఫికేషన్ జారీచేయనుంది. 4180 పంచాయతీల్లో సర్పంచ్‌లకు, 42,006 వార్డులకు ఈ నెల 26న పోలింగ్ నిర్వహిస్తారు.
రెండో విడతలో 4715 పంచాయతీల్లో సర్పంచ్‌లకు, 47,048 వార్డుల ఎన్నికలకు ఈ నెల 16న నోటిఫికేషన్ జారీచేసి.. 29న పోలింగ్ జరుపుతారు. తుది విడతలో 4273 సర్పంచ్‌లకు, 42,794 వార్డులకు ఈ నెల 19న నోటిఫికేషన్ జారీచేసి డిసెంబరు 2న ఎన్నికలు నిర్వహిస్తారు. పోలింగ్ జరిగిన రోజుల్లోనే ఓట్లు లెక్కించి తుది ఫలితాలు ప్రకటిస్తారు. అలాగే మిగిలి ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థల నగారా కూడా మోగింది. ఇప్పటికే 100 పట్టణ స్థానిక సంస్థలు, జిల్లా, మండల పరిషత్ ఎన్నికలను పూర్తిచేసిన ఎస్‌ఈసీ.. మిగిలి ఉన్న నాలుగు కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీల ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ జారీచేసింది.
దీంతో గ్రామాలతో పాటు ఆయా పట్టణ ప్రాంతాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పునేఠా గురువారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు, డీఐజీలు, ఐజీలు, డీజీపీ కార్యాలయ అధికారులు, ఎన్నికల, వ్యయ పరిశీలకులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసేందుకు అవసరమైన చోట అదనపు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు ఆయన సూచించారు. అవసరాన్ని బట్టి జిల్లా కేంద్రాల్లోనూ నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అభ్యర్థులకు భద్రత, పోలీసు ఎస్కార్ట్ కల్పించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాలు, స్ట్రాంగ్‌రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, అవసరమైన చోట వీడియో రికార్డింగ్ ఏర్పాట్లు.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలన్నారు.
కచ్చితంగా మార్గదర్శకాల అమలు..
నామినేషన్ల స్వీకరణ, రిటర్నింగ్ అధికారుల నియామకం, సీసీటీవీ నిఘా, వీడియోగ్రఫీ, ఎన్నికల విధుల నిర్వహణపై నిర్దేశించిన మార్గదర్శకాలను అధికారులు కచ్చితంగా అమలు చేయాలని వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్‌ఈసీ కార్యదర్శి మల్లికార్జున సూచించారు. ‘మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కోసం 2 నుంచి 4 పంచాయతీలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేయాలి.
ఈ క్లస్టర్‌కు ఒక నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి, ఒక ప్రధానమైన లేదా అనువైన గ్రామ పంచాయతీలో రిటర్నింగ్ అధికారి అందుబాటులో ఉండేలా చూడాలి. ఈ మేరకు కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. 10 వేల కంటే తక్కువ జనాభా ఉన్న రెండు నుంచి నాలుగు పంచాయతీలకు ఒక క్లస్టర్‌గా నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. 10 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా ఒక రిటర్నింగ్ అధికారిని నియమించాలి’ అని పేర్కొన్నారు.
23 పట్టణ ఎన్నికల షెడ్యుల్ ఇది..
శనివారం 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటీసు జారీచేస్తారు. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 16. మర్నాడు వాటిని పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు 19 వరకు గడువు ఉంటుంది. అదే రోజు పోటీలో నిలిచే తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. 26న పోలింగ్ నిర్వహిస్తారు. అవసరమైతే మర్నాడు రీపోలింగ్ జరుపుతారు.
30న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికలు జరిగే నాలుగు కార్పొరేషన్లు.. శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి. 19 మున్సిపాలిటీలు.. ఆమదాలవలస, రాజాం, పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, బాపట్ల, నరసరావుపేట, పొదిలి, కందుకూరు, కావలి, గూడూరు, అల్లూరు, శ్రీకాళహస్తి, బి.కొత్తకోట. వీటికి డిప్యూటీ మేయర్లు, వైస్‌చైర్‌పర్సన్ల ఎన్నికలను డిసెంబరు 5 లేదా 6 తేదీల్లో నిర్వహించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
ఏకగ్రీవ పంచాయతీలకు భారీ నజరానా
15 నుంచి 50 లక్షల వరకు ప్రోత్సాహకం
పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించేందుకు భారీ నజరానా ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. అయితే సర్పంచ్‌తో పాటు అన్ని వార్డుల సభ్యులూ ఏకగ్రీవంగా ఎన్నికవ్వాల్సి ఉంటుంది. జనాభా ప్రాతిపదికన పంచాయతీకి రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకం అందిస్తారు. గతంలో 2వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.5 లక్షలు.. 2001-5000 మధ్య జనాభా ఉన్న వాటికి రూ.10 లక్షలు.. 5001-10,000 జనాభా ఉన్న గ్రామాలకు రూ.15 లక్షలు.. 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున ప్రోత్సాహకం అందించేవారు. తాజాగా ఈ మొత్తాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 5 వేల వరకు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 5001-10,000 జనాభా ఉన్న గ్రామాలకు రూ.25లక్షలు, 10 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు ఇవ్వనున్నారు.
సర్పంచ్ పదవితో పాటు గ్రామ పంచాయతీలోని అన్ని వార్డులకూ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగినట్లు సంబంధిత ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించినప్పుడే ఈ ప్రోత్సాహకానికి అర్హత లభిస్తుంది. నిధులు విడుదల చేస్తారు. ప్రోత్సాహకంగా అందించే మొత్తాన్ని సంబంధిత గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులు, ప్రజాసంక్షేమ కార్యక్రమాలకే వినియోగించాలి. ఆర్థిక, అకౌంటింగ్, ఆడిట్ నిబంధనలను పాటించాల్సిందే. బడ్జెట్ కేటాయింపులు, ఆర్థిక శాఖ నిబంధనలకు లోబడి నిధులు విడుదల చేస్తారు.
ఈ వార్తలనూ చదవండి:
విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2026 ప్రారంభం
ఏపీకి పెట్టుబడుల వరద.. తొలిరోజే రూ.1.57 లక్షల కోట్ల ఒప్పందాలు