ROLLA : రొళ్ల.. ప్రత్యేకాధికారి చేతిలోకేనా..?
ABN , Publish Date - Jan 06 , 2026 | 11:45 PM
రొళ్ల మండలం ప్రత్యేక అధికారి చేతులోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వైసీపీలో నెలకొన్న వర్గపోరుతో ఈ పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ పెట్టకపోవడంతో నియోజకవర్గంలో అన్ని ఎంపీపీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది.
టీడీపీ నాయకుల మౌనం
మడకశిరటౌన, జనవరి 6(ఆంధ్రజ్యోతి): రొళ్ల మండలం ప్రత్యేక అధికారి చేతులోకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వైసీపీలో నెలకొన్న వర్గపోరుతో ఈ పరిస్థితి నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ పెట్టకపోవడంతో నియోజకవర్గంలో అన్ని ఎంపీపీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇప్పటికే అగళి మండల ఎంపీపీ టీడీపీలోకి చేరడంతో ఆ మండలం తెలుగుదేశం పార్టీ వశమైంది. 2024 అక్టోబరు 29న రొళ్ల ఎంపీపీ కవిత, ఇద్దరు వైస్ ఎంపీపీలు నాగరాజు, రత్నమ్మలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానం నెగ్గడంతో వారు పదవులు కోల్పోయారు. మండలంలో 11 మంది ఎంపీటీసీ సభ్యులు ఉండగా అందులో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. ఏడుగురు వైసీపీ ఎంపీటీసీలు విజయం సాధించగా వారి బలంతో ఆ పార్టీ ఎంపీపీ స్థానాన్ని దక్కించుకొంది. ఇటీవల వైసీపీలో ఆధిపత్యపోరు తారస్థాయికి చేరడంతో ఒక వర్గం ఎంపీపీ, వైస్ ఎంపీపీలను దించాలన్న లక్ష్యంతో అవిశ్వాస తీర్మానానికి నోటీసులు అందించారు. పార్టీ పెద్దల దృష్టికి వెళ్లగా ఎంపీ మిథునరెడ్డి జోక్యం చేసుకొని ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం ఇప్పట్లో వద్దని వారికి చెప్పినట్లు సమాచారం. స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఎంపీటీసీలు వైసీపీలోనే కొనసాగారు. ఈవిషయం జిల్లా అధ్యక్షురాలి దృష్టికి వెళ్లగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఓ మండలానికి చెందిన నాయకుడు పట్టుబట్టి ఎంపీపీపై అవిశ్వాసం పెట్టించినట్లు నియోజకవర్గంలో చర్చ సాగింది. అధిష్టానం, స్థానిక నాయకులు వద్దన్నా ఒక వర్గానికి చెందిన నాయకులు పట్టుబట్టి అధిష్టానం అవిశ్వాస తీర్మానానికి వెళ్లవద్దని ఎంపీపీగా కవిత కొనసాగాలని చెప్పినా వారు లెక్కచేయలేదని చర్చ సాగుతోంది. చివరి సమయంలో అవిశ్వాస తీర్మానానికి సభ్యులు హాజరుకారని, అదేపార్టీలో కొందరు సూచన ప్రాయంగా తెలిపారు. అయినా వారు అధిష్టానం మాటలు లెక్కచేయకుండా వెళ్లారంటూ కొందరు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ మాత్రం ఏం జరుగుతుందో చూద్దామంటూ వేచి చూసే ధోరణిలో ఉందని, అందులో జోక్యం చేసుకోవడం లేదని అంటున్నారు. అధికారులు ప్రత్యేక అధికార పాలన వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, కేవలం 9 నెలలు ఉండటం వల్ల ఎంపీపీ ఎంపిక జరగకపోవచ్చని బలమైన ప్రచారం సాగుతోంది. అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు ఏ నిర్ణయం తీసుకొంటారో విషయం తెలుసుకొనేందుకు వైసీపీ నేతలు తహతహ లాడుతున్నారు. వైసీపీలో సమన్వయం లేకపోవడంతో సొంత పార్టీ ఎంపీపీపై అవిశ్వాసం పెట్టి దించడంతో తిరిగి ఎంపీపీ కోసం పోటీ నెలకొన్నా ఏకాభిప్రాయం రాకపోవడంతో త్వరలో రొళ్ల మండల పాలన ప్రత్యేక అధికారి చేతికి వెళుతుందనే ప్రచారం సాగుతోంది.