WHIP KALAVA : ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:28 AM
పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ పనులు చేపడుతున్నట్లు విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. బస్టాండ్‌లో రూ.50 లక్షలతో చేపట్టిన విస్తరణ పనులకు శనివారం ఆయన భూమిపూజ చేశారు.
రాయదుర్గం, జనవరి 31(ఆంధ్రజ్యోతి): పట్టణంలో పెరుగుతున్న ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం ఆర్టీసీ బస్టాండ్ విస్తరణ పనులు చేపడుతున్నట్లు విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. బస్టాండ్‌లో రూ.50 లక్షలతో చేపట్టిన విస్తరణ పనులకు శనివారం ఆయన భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండులో కొత్తగా ప్లాట్‌ఫారాలతో పాటు దెబ్బతిన్న ఆర్టీసీ బస్టాండ్ భవనాన్ని పునఃనిర్మిస్తామన్నారు. ప్రస్తుతం పాత బస్టాండ్ నుంచి నడుస్తున్న ఆర్టీసీ బస్సులు అన్నిటినీ ఇక్కడి నుంచే బయలు దేరటానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ప్రైవేటు బస్సులు కూడా ఇక్కడికి సమీపంలో నుంచే బయలుదేరే విధంగా చూసుకోగలిగితే పట్టణంలో సాధ్యమైనంత వరకు ట్రాఫిక్ అంతరాయాలు తగ్గుతాయన్నారు. అంతర్రాష్ట సర్వీసుల విషయంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర ఆర్టీసీ అధికారులు గతంలోనే రెండు, మూడుసార్లు కూర్చొని వాటి విషయంలో చర్చించారన్నారు. ఆర్టీసీ ఎండీ దృష్టికి కూడా సమస్యను తీసుకెళ్లామన్నారు. తగిన ప్రతిపాదనలతో ఇద్దరు మధ్య చర్చలు జరుగుతున్నాయని త్వరలోనే పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు.
అప్పులు పాలన నుంచి సంక్షేమ పాలనకు..
బొమ్మనహాళ్(ఆంధ్రజ్యోతి): అప్పులు చేసి ఖజానాను ఖాళీ చేసిన గత పాలన నుంచి పేదల సంక్షేమాన్నే లక్ష్యంగా పెట్టుకున్న పాలనకు రాష్ట్రం మారిందని ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అన్నారు. శనివారం మండలంలోని ఉప్పరహాళ్ గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధివారులకు పింఛన్లు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ పింఛనుదారులు సీఎం చంద్రబాబు పెద్ద కొడుకుగా భావిస్తున్నారన్నారు. ఆయన నాయకత్వంలో పని చేస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. గ్రామంలో గంగమ్మ అనే మహిళ కదలటానికి కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు చంద్రబాబు వచ్చి రూ.15 వేలు, ఇదే కుటుంబంలో మరొకరికి రూ.4 వేలు అందించారన్నారు. తహసీల్దార్ మునివేలు, డిప్యూటీ ఎంపీడీఓ రమణ, టీబీ ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన కేశవరెడ్డి, ఎంపీపీ ముల్లంగి నాగమణినారాయణస్వామి పాల్గొన్నారు.
ఉగాది నాటికి 500 పక్కాగృహాలను సిద్ధం చేయండి
రాయదుర్గం(ఆంధ్రజ్యోతి): నిర్మాణదశలో ఉన్న పక్కాగృహాలను ఉగాదిలోపు పూర్తి చేయాలని అధికారులను విప్ కాలవ శ్రీనివాసులు ఆదేశించారు. ఉగాది పండుగ రోజు భారీ ఎత్తున గృహప్రవేశాలు చేయాలన్న సీఎం సంకల్పానికి అనుగుణంగా సిద్ధం కావాలన్నారు. రాయదుర్గం ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో శనివారం ఆయన గృహనిర్మాణశాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజ సమక్షంలో నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు ఎంపీడీఓలు, సచివాలయ ఉద్యోగులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులకు ఆయన పక్కాగృహాల నిర్మాణంపై దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉగాది నాటికి కనీసం 500 ఇళ్లను ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ దివాకర్‌రెడ్డి, గృహనిర్మాణశాఖ డీఈ, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.