నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి
ABN , Publish Date - Oct 03 , 2026 | 03:43 AM
‘‘నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నేనేం చేయగలనో నన్ను గైడ్ చేయండి.’’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ సీఎం చంద్రబాబును కోరారు.
రాష్ట్రానికేం చేయగలనో గైడ్ చేయండి: అనంత్ అంబానీ
ఏపీలో లక్ష కోట్ల పెట్టుబడి పెడతాం
ఐఎస్‌బీలాగా ఐఎస్ఏ ఎదుగుతుంది
రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ
మదనపల్లె, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): ‘‘నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నేనేం చేయగలనో నన్ను గైడ్ చేయండి.’’ అని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ సీఎం చంద్రబాబును కోరారు. మదనపల్లెలో శుక్రవారం ‘రాయలసీమ రైజింగ్, హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ఏ)’ శంకుస్థాపనలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాయలసీమ హార్టికల్చర్ హబ్ దేశ అభివృద్ధిలో కీలకంగా మారుతుందన్నారు. ఐఎస్‌బీ తరహాలోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఎదుగుతుందన్నారు. దీనిద్వారా అన్నదాతలు తమ కమతాలకు సీఈవోలుగా మారతారన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ స్వప్నాన్ని తన లాంటి యువత అంతా కలిసి సాకారం చేసి చూపిస్తామని వ్యాఖ్యానించారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లోనే దేశం జీవిస్తుంది. సర్వోదయ-అంత్యోదయ అంటూ గాంధీజీ పిలుపునిచ్చారు. ‘జై కిసాన్-జై జవాన్’ అంటూ లాల్ బహుదూర్ శాస్త్రి, ‘జై విజ్ఞాన్’ అంటూ వాజ్‌పేయి, ‘జై అనుసంధాన్’ అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ నాలుగు నినాదాల కలయికతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ పనిచేస్తుంది. పంటలకు చీడపీడలు సోకకుండా, ఏఐ, డ్రోన్లు, రోబోటిక్స్ సాంకేతికతతో కచ్చితమైన వ్యవసాయం చేసేలా సహకరిస్తుంది. మదనపల్లె టమోటా రైతులకు ఎప్పుడు, ఎక్కడ తమ ఉత్పత్తులు విక్రయించాలో చెప్పి, రిలయన్స్ గ్రీన్ బిజినెస్ ద్వారా శక్తిమంతులుగా మారుస్తాం. మన ఇంధనం స్వచ్ఛంగా ఉండాలి. మన పశువులు ఆరోగ్యంగా ఉండాలి.. అనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మా తాత ధీరుభాయ్ అంబానీ కలలను సాకారం చేసేలా కృషి చేస్తున్నాం’’ అని తెలిపారు. రైతు ఇంటి ముందుకే వెళ్లి సహకారం అందించేలా ఐఎ్‌సఏతో కలిసి జియో పనిచేస్తుందని చెప్పారు. గుజరాత్ జామ్ నగర్‌లో బయో ఎనర్జీ అభివృద్ధి కోసం ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తెలుగుతో ప్రారంభం.. ముగింపు!
అనంత్ అంబానీ.. తన ప్రసంగాన్ని ‘అందరికీ నమస్కారం’ అంటూ తెలుగులో ప్రారంభించారు. మధ్యలో ‘నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి.’ అనడంతో సభలో ఆనందాశ్ఛర్యాలు వెల్లివిరిశాయి. ‘అందరికీ ధన్యవాదాలు.’ అంటూ తెలుగులోనే తన ప్రసంగాన్ని ముగించారు. అనంత్ ప్రసంగం ముగిశాక సీఎం సంతోషంతో ఆలింగనం చేసుకున్నారు. అనంతరం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ సైతం అనంత్‌ను అభినందించి ప్రశంసించారు. అనంతరం చంద్రబాబు కారెక్కుతున్న సమయంలో అనంత్ ఆయన వద్దకు వచ్చి పాదాలకు నమస్కరించారు.
3 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం
ఏపీకి రూ.60 వేల కోట్ల ఆదాయం
రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు రిలయెన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ప్రకటించారు. సాంకేతిక సాగుకు దన్నుగా నిలుస్తామన్నారు. రూ.లక్ష కోట్లను కంప్రెస్డ్ బయోగ్యాస్(సీబీజీ) ప్లాంట్ల ఏర్పాటుకు వినియోగిస్తామన్నారు. తద్వారా 3 లక్షల ఉద్యోగాలను సృష్టించనున్నట్టు తెలిపారు. దీంతో రాష్ట్రానికి కూడా రూ.60 వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రిలయెన్స్ పనిచేస్తుందని, హార్టికల్చర్ హబ్ ద్వారా రైతులకు తోడ్పాటునందిస్తామని చెప్పారు. ‘పాతికేళ్ల కిందట ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ను చంద్రబాబు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ రోజు దేశ రైతాంగానికి ఐఎస్‌ఏని అందించారు.’’ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నందుకు రిలయెన్స్ గర్విస్తోందన్నారు.
ఈ వార్తలనూ చదవండి..
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు