లోకేశ్ స్ఫూర్తితోనే సైకిళ్ల పంపిణీ
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:25 AM
రాష్ట ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్ఫూర్తితోనే విద్యార్థులకు ప్రేమతో సైకిళ్లను అందజేస్తున్నామని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు.
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు
1500 మంది విద్యార్థులకు ‘అమిలినేని విద్యాచక్రం’
కళ్యాణదుర్గం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్ఫూర్తితోనే విద్యార్థులకు ప్రేమతో సైకిళ్లను అందజేస్తున్నామని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 9, 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులకు 1500 సైకిళ్లను ‘అమిలినేని విద్యాచక్రం’ పేరిట సోమవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఆర్‌సీ కంపెనీ చైర్మన్ ముత్తినేని రాజగోపాల్, ఎండీ అమిలినేని యశ్వంత్, సభ్యులు దేవినేని వెంకటేశ్, మహిధర్‌రెడ్డి, ముత్తినేని రాహుల్, దేవినేని అవినాశ్, ధర్మతేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ వైసీపీ పాలకులు విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి లోకేశ్ ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా, విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారని తెలిపారు.
ప్రభుత్వ బడుల్లో మెరుగైన వసతులు ఉండటంతో అడ్మిషన్లకు పోటీ పడుతున్నారని ఈ ఘనత అంతా ఆయనకే దక్కుతుందని కొనియాడారు. లోకేశ్‌ను స్ఫూర్తిగా తీసుకుని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రభుత్వ బడుల్లో చదివే 9, 10వ తరగతి, ఇంటర్ చదివే 7,300 మంది విద్యార్థులకు రూ.5.50 కోట్లు ఖర్చుచేసి ‘అమిలినేని విద్యాచక్రం’ పేరుతో సైకిళ్లను పంపిణీ చేశామని తెలిపారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టంచేశారు. ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి కోసం తాను, ఎస్‌ఆర్‌సీ ట్రస్ట్ సభ్యులు సైనికుల్లాగా పనిచేస్తున్నట్టు తెలిపారు.
వెనకబడిన ఈ ప్రాంతములో విద్యార్థులు కాలినడకన పాఠశాలకు 3 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వస్తున్నారని, వారి కష్టాన్ని కళ్లారా చూసి, సైకిళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. విద్యకు దూరం అడ్డంకి కాకుండా, ప్రతి విద్యార్థి సమయానికి, సురక్షితంగా పాఠశాలకు చేరుకోవాలనే సంకల్పంతోనే వేలాది మంది విద్యార్థులకు సైకిళ్లు అందించే మహత్తర కార్యక్రమానికి నడుంబిగించామని వెల్లడించారు. ఎస్‌ఆర్‌సీ ట్రస్ట్‌లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి కష్టం ఇందులో దాగి ఉందని అన్నారు. త్వరలోనే 500 మంది డిగ్రీ విద్యార్థులకు కూడా సైకిళ్ల పంపిణీని ప్రారంభిస్తామని సురేంద్రబాబు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి...
పింఛనుదారులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 1న ఉదయం 6:30 నుంచే పింఛన్ల పంపిణీ
పీఎం కిసాన్ 24వ విడత.. రైతులు ఈ 3 పనులు పూర్తి చేయాల్సిందే..