అంబటి అరెస్ట్
ABN , Publish Date - Feb 01 , 2026 | 03:30 AM
వైసీపీ నేత అంబటి రాంబాబు అడ్డగోలుగా రెచ్చిపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై బూతులతో విరుచుకుపడ్డారు. పోలీసుల సమక్షంలోనే చెలరేగిపోయారు.
బూతుల రాంబాబు బరితెగింపు.. రాయలేని భాషలో సీఎంపై బూతులు
కల్తీ నెయ్యి ఫ్లెక్సీ వివాదంలో తొలుత అడ్డగోలుగా రెచ్చిపోయిన అంబటి
రాంబాబు తీరుతో రోజంతా రగిలిన గుంటూరు
అడ్డుకోబోయిన మహిళలను మరింత రెచ్చగొట్టేలా పోలీసుల సమక్షంలోనే దూషణల పర్వం
క్షమాపణ చెప్పాలంటూ అంబటి ఇంటి వద్దకు పెద్దఎత్తున టీడీపీ కార్యకర్తలు, మహిళలు
అక్కడ మరోసారి చంద్రబాబుపై అవాకులు
టీడీపీ తమ్ముళ్లపై చెలరేగిపోయిన వైనం
రౌడీషీటర్లతో దాడిచేయించి, తరిమిన అంబటి
దీంతో మరింతగా రగిలిపోయిన టీడీపీ శ్రేణులు
అంబటి ఇల్లు, కార్యాలయంపై దాడి.. విధ్వంసం
అంబటిని అరెస్టు చేసి వజ్ర వాహనంలో తరలింపు
పలు సెక్షన్ల కింద కేసుల నమోదు
ఆ తర్వాత కొద్దిసేపటికి అంబటి ఆఫీస్ కిటికీ, రెండు కార్లకు నిప్పు పెట్టిన ఆందోళనకారులు
రాష్ట్రవ్యాప్తంగా అంబటి దిష్టిబొమ్మల దహనం
గుంటూరు, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత అంబటి రాంబాబు అడ్డగోలుగా రెచ్చిపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై బూతులతో విరుచుకుపడ్డారు. పోలీసుల సమక్షంలోనే చెలరేగిపోయారు. సీఎం చంద్రబాబుపై చేసిన బూతు వ్యాఖ్యలపై ప్రశ్నించడానికి ప్రయత్నించిన తెలుగుదేశం మహిళా కార్యకర్తలపైనా అంబటి నోరుపారేసుకున్నారు. ‘దమ్ముంటే అరెస్టు చేసుకోండి..’ అంటూ పోలీసులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో శనివారం గుంటూరు నగరం దాదాపు ఎనిమిది గంటలపాటు హైటెన్షన్‌తో అట్టుడికిపోయింది. అంబటి అరెస్టుతో చివరకు ఆ అంశం శాంతించగా, రాష్ట్రవ్యాప్తంగా పలు పోలీ్‌సస్టేషన్లలో టీడీపీ కార్యకర్తలు అంబటిపై ఫిర్యాదు చేశారు. అసలేం జరిగిందంటే... టీటీడీలో కల్తీ నెయ్యి ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు వెలిశాయి. గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు చిల్లీస్ దాబా వద్ద కూడా అలాంటి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అంబటి రాంబాబు శుక్రవారం ఆ ఫ్లెక్సీ వద్దకు వెళ్లి మీడియాతో మాట్లాడుతూ, 24 గంటల్లో దానిని తొలగించాలని, లేదంటే తానే తీసివేస్తానంటూ హెచ్చరించారు. చెప్పినట్లుగానే శనివారం మరోసారి ఆ ఫ్లెక్సీ వద్దకు వచ్చి, దానిని తొలగించాలని అక్కడ ఉన్నవారికి చెప్పి.. గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేయడానికి వెళ్లారు.
రాంబాబు ఫ్లెక్సీ వద్దకు వచ్చారని తెలుసుకున్న తెలుగుదేశం కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. తిరిగొచ్చి రాంబాబు ఒకవేళ ఫ్లెక్సీ చించితే అడ్డుకోవాలని పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, మహిళలు అక్కడకు చేరుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అంబటి తన కారులో ఫ్లెక్సీ వద్దకు వచ్చారు. అక్కడ ఉన్న ఓ టీడీపీ మహిళ గురించి అనుచితంగా మాట్లాడారు. దీంతో మహిళలంతా ఆయనకు ఎదురు తిరిగారు. అప్పటివరకు కారులో ఉన్న అంబటి ఆవేశంతో ఊగిపోతూ.. కారు కిటికీలోంచి తల బయటకు పెట్టి.. పోలీసులు వింటుండగానే.. లం.కొ. అంటూ రాయలేని భాషలో చంద్రబాబుపై అసభ్యకరమైన పదజాలం ప్రయోగించారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహంతో రగిలిపోయిన తెలుగు తమ్ముళ్లు.. అంబటి కారును అడ్డుకోబోగా.. పోలీసులు వారించారు. రాంబాబును అక్కడినుంచి పంపించివేశారు.
అంబటి అరెస్టు.. హైడ్రామా..
చంద్రబాబును దూషించడమే కాకుండా ఇంటి వద్ద నడిరోడ్డుపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి బహిరంగంగా సవాల్ విసరడాన్ని టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. అంబటి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో మహిళలు ఆయన ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో తెలుగు యువత నాయకులు శివ నాగమల్లేశ్వరరావు (మల్లి), కనపర్తి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మాధవి భర్త రామచంద్రరావు తమ అనుచరులతో అంబటి కార్యాలయంలోకి దూసుకు వెళ్లారు. అప్పటివరకు అంబటికి అండగా ఉన్న వైసీపీ కార్యకర్తలు తలోదిక్కు పారిపోయారు. అంబటి రాంబాబు ఇంటిలోకి వెళుతున్న తెలుగుదేశం కార్యకర్తలపై అక్కడే ఉన్న వైసీపీకి చెందిన రౌడీ షీటర్లు దాడికి పాల్పడ్డారు. ఇంటి సమీపంలో ఉన్న వైసీపీ కార్యాలయంలో ఉన్న అంబటిపై కొందరు టీడీపీ కార్యకర్తలు దాడికి యత్నించారు. అక్కడే బందోబస్తు విధుల్లో ఉన్న సీఐలు, ఎస్సైలు వారందరినీ అదుపులోకి తీసుకొని బయటకు నెట్టుకొచ్చారు. పెద్ద సంఖ్యలో పోలీసులు అంబటి ఉన్న గది వద్ద మోహరించి తెలుగుదేశం శ్రేణులను అడ్డుకున్నారు. ఇంతలో కార్యకర్తలు అంబటి కార్యాలయంలోని మిగిలిన రెండు గదుల్లో ఉన్న ఫర్నిచర్, ఫొటోలు అద్దాలు ధ్వంసం చేశారు. ఆ తర్వాత కార్యాలయం ఎదురుగా ఉన్న అంబటి ఇంటిపై దాడి చేశారు. ఇంటి అద్దాలు, పూల కుండీలు ధ్వంసం చేశారు. పరిస్థితిని ముందే పసిగట్టిన అంబటి తన కుటుంబ సభ్యులను వేరే ప్రాంతానికి తరలించారు. ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన పోలీసు అధికారులు, పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను అంబటి ఇంటి వద్దకు తరలించారు.
అంబటి క్షమాపణ చెప్పాల్సిందేనంటూ మరోసారి టీడీపీ కార్యకర్తలు అక్కడకు పెద్దఎత్తున చేరుకున్నారు. మరోసారి ఆయన కార్యాలయం, ఇంటిపై దాడి చేశారు. ముఖ్యమంత్రిని దూషించిన అంబటిని ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో రాత్రి 10.30 గంటల వరకు అంబటి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఈ సమయంలో అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేసి షీల్డ్‌లు పట్టుకున్న పోలీసుల వలయం మధ్య తీసుకొచ్చి వజ్ర వాహనం ఎక్కించి.. తరలించారు. ఆ సమయంలో కోడుగుడ్లు, రాళ్లతో ఆందోళనకారులు దాడి చేశారు. పకడ్బందీ రక్షణ మధ్య అంబటిని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆ తర్వాత ఆందోళనకారులు అంబటి కార్యాలయం కిటికీకి, అంబటికి, ఆయన అనుచరుడికి చెందిన రెండు కార్లకు నిప్పుపెట్టారు.
అంబటి ఇంటి వద్ద రౌడీషీటర్ల హడావుడి..
చంద్రబాబును దూషించిన మీడియా వైరల్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం పెల్లు బుకింది. తెలుగు మహిళలు గుంటూరు నగరంలోని అంబటి రాంబాబు ఇంటి వద్దకు చేరుకుని నిరసనకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆయన ఇంటి వద్దకు వైసీపీ శ్రేణులతో పాటు రౌడీషీటర్లు చేరుకున్నారు. వారు తెలుగు మహిళల వెంటపడి తరిమికొట్టారు. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అంబటి ఇంటి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా, పోలీసులు వారి ని అక్కడ అడ్డుకున్నారు. ఇంటి వద్ద నడిరోడ్డుపై మరోసారి రెచ్చిపోయిన అంబటి.. అక్కడే మీడియాతో మాట్లాడుతూ, మరోసారి చంద్రబాబును ఉద్దేశించి ఇస్టానుసారంగా మాట్లాడారు. ‘‘చంద్రబాబును నేను తిట్టలేదు. నన్ను చంపడానికి కర్రలు, రాడ్లతో టీడీపీ కార్యకర్తలు, మహిళలు రావడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలో క్షణికావేశంలో అలా మాట్లాడా ల్సి వచ్చింది. నన్ను తిడుతున్న మహిళలను నేను కూడా ఒక మనిషిగా తిట్టకూడదా? చంద్రబాబుకు, లోకేశ్‌కు, ఆయన నడిపిస్తున్న రెడ్ బుక్‌కు నా ఇంట్లో కుక్క కూడా భయపడదు. దమ్ముంటే అరెస్టు చేసుకోండి. అరెస్టుకు సిద్ధంగా ఉన్నా... బెయిల్ కూడా తీసుకోను... జైల్లో ఉంటా... నీ సంగతి తెలుస్తా.. ఐ డోంట్ కేర్... నేను పారిపోను. ఇంట్లోనే ఉంటా... ఇది తెగింపు కాదు పిల్లిని కట్టేసి కొడితే పులిలా మారుతుంది. ప్రస్తుతం నేను కూడా అలానే...’’ అంటూ తనను పులిలా అభివర్ణించుకున్నారు..
ఈ వార్తలు కూడా చదవండి
ఈ-పంటలో రైతులే నమోదు చేసుకోవచ్చు