అద్భుతంగా అమరావతి
ABN , Publish Date - May 14 , 2026 | 05:29 AM
వచ్చే ఇరవై ఏళ్లలో రాజధాని అమరావతి ప్రపంచంలోనే మేటి నగరంగా నిలుస్తుంది.పెట్టుబడులు, పారిశ్రామికవేత్తల రాకతో అద్భుత నగరంగా ఫ్యూచర్ సిటీ అవతరిస్తుంది.
20 ఏళ్లలో ప్రపంచంలోనే మేటి నగరం అవుతుంది: చంద్రబాబు
విద్య, వైద్య రంగాల్లో ఆంధ్రప్రదేశ్ తిరుగులేని స్థానంలో ఉండాలి. ప్రపంచంలోని ప్రతీ ముగ్గురు డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందిలో ఒకరు అమరావతి నుంచే తయారుకావాలి. వైద్యరంగాన్ని టెక్నాలజీతో అనుసంధానించే స్కిల్, ఇన్నోవేషన్, రీసెర్చ్ ప్రక్రియలన్నీ ఒకే చోట ఉండేలా ఏర్పాటవుతున్న ‘బైసర్’ ఒక వినూత్న ప్రయోగం.
- సీఎం చంద్రబాబు
రాజధాని ప్రాంతంలో కిమ్స్ ‘బైసర్’కు శంకుస్థాపన
గుంటూరు(రాజధాని), మే 13(ఆంధ్రజ్యోతి): ‘వచ్చే ఇరవై ఏళ్లలో రాజధాని అమరావతి ప్రపంచంలోనే మేటి నగరంగా నిలుస్తుంది.పెట్టుబడులు, పారిశ్రామికవేత్తల రాకతో అద్భుత నగరంగా ఫ్యూచర్ సిటీ అవతరిస్తుంది. భవిష్యత్తులో హైదరాబాద్‌ను మించిన మెరుగైన హైదరాబాద్ ప్లస్ సిటీగా సిద్ధమవుతుంది’ అని సీఎం చంద్రబాబు చెప్పారు. రాజధాని అమరావతి పరిధిలోని నిడమర్రులో బుధవారం బొల్లినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (బైసర్), మెడికల్ కాలేజీ, కార్పొరేట్ ఆస్పత్రి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం సభలో ప్రసంగించారు. ప్రపంచంలో ఐదు చోట్ల మాత్రమే ఉన్న క్వాంటమ్ కంప్యూటర్ ఇప్పుడు అమరావతికి వస్తోందన్నారు. గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు రాష్ట్రంలో విధ్వంసం జరిగిందన్నారు. అలాంటి అరాచక పాలన తన జీవితంలో చూడలేదని చెప్పారు. తాను యువత భవిష్యత్ మాత్రమే చూస్తానని, వారికి ఉద్యోగాలు ఇవ్వాలనేది తన ఆలోచన అని పేర్కొన్నారు. సభలో ఆయన ఇంకా ఏమన్నారంటే..
ఏడాదిలో బైసర్ ప్రారంభం కావాలి
‘రాజధాని అభివృద్ధి పారిశ్రామిక వేత్తల రాకతోనే సాధ్యం. వారిని ప్రోత్సహించేందుకు పరిశ్రమలకు, సంస్థల ఏర్పాటుకు అనుమతులన్నీ ఆటోపైలట్ మోడ్‌లో ఇచ్చే బాధ్యత మాది. నిర్మాణాలు పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత పారిశ్రామికవేత్తలది. టెక్నాలజీ, ఏఐ ఆధారిత వైద్యరంగానిదే భవిష్యత్తు. రాబోయే రోజుల్లో దానికి మంచి అవకాశం ఉంది. ఆ అవకాశం బైసర్ ద్వారా రాష్ట్ర యువతకు వచ్చింది. వచ్చే ఏడాది ఇదే రోజునాటికి బైసర్ ప్రారంభం కావాలి. 2027లో ఇదే రోజున అమరావతిలో కిమ్స్ ఆస్పత్రి ప్రారంభం కావాలి. 2028 ఆగస్టు 15నాటికి గూగుల్ డేటా సెంటర్, 2028 డిసెంబరు లోపల ఆర్సెల్లార్ మిట్టల్ ఫేజ్ 1 పూర్తి చేయాలని ఆ సంస్థలకు కూడా చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ ప్రాజెక్టులు పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు అమరావతిలో ఏర్పాటవుతున్న బైసర్ ద్వారా మరో లక్ష మందికి ఉపాధి లభిస్తుంది. అది బోనస్ అవుతుంది.
యువత విదేశీ భాషలు నేర్చుకోవాలి
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వైద్యులతో పాటు నర్సులు, పారామెడికల్ సిబ్బంది, టెక్నీషియన్ల అవసరం చాలా ఉంది. డాక్టర్లు కూడా ఏఐ నేర్చుకోవాలి. మ్యాన్‌పవర్ లేక జపాన్, జర్మనీ లాంటి దేశాలు మనవైపు చూస్తున్నాయి. ఏ దేశంలో డిమాండ్ ఉంటే ఆ దేశాలకు వెళ్లి పనిచేసేలా మన యువత విదేశీ భాషలు నేర్చుకోవాలి. దేశంలో తయారయ్యే అనుబంధ వైద్య సేవకుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు అమరావతిలోనే తయారవ్వాలి.
దేశంలోనే తొలి క్వాంటమ్ హబ్‌గా ఏపీ
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రాబోతోంది. డిసెంబర్ నాటికి మన దేశంలో మొదటి క్వాంటమ్ కంప్యూటర్‌కి చిరునామాగా ఏపీ తయారవుతుంది. రెండేళ్లలో ప్రపంచానికి క్వాంటమ్ కంప్యూటర్లు మన అమరావతి నుంచి సరఫరా చేస్తాం. ఇప్పటికే క్వాంటమ్ రిఫరెన్సు ఫెసిలిటీ అమరావతిలో ఏర్పాటయింది. త్వరలో 150 క్యూబిట్స్ సామర్థ్యంతో క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధం అవుతోంది. గత పాలకులు ప్రజలపై రూ. 32 వేల కోట్ల విద్యుత్ భారం వేశారు. ఇప్పుడు విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గించాం. యూనిట్ 2.49కే వస్తోంది. ఇక ముందు రూ.1.30కే కరెంటు ఇచ్చేలా రూ. 1.20 తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సంజీవని ద్వారా ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సహాయం అందుతుంది. ‘నేచర్ ఫార్మింగ్’ వైపు వెళుతున్నాం. అమరావతిలో వైద్య ేసవల కోసం దేశ, విదేశాల నుంచి వచ్చే వారికి విమానాశ్రయం, హోటళ్లు లాంటి సదుపాయాలు ఉండాలి.
రైతులకు అండగా ఉంటాం
అమరావతి ఎంత అభివృద్ధి చెందితే రైతులకు అంత మంచి జరుగుతుంది. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అండగా ఉంటాం. రెండో దశలో భూసమీకరణ ద్వారా భవిష్యత్ నగరంగా నిర్మిస్తాం. 190 కిమీ ఔటర్ రింగ్ రోడ్డు వేస్తాం. దేశంలోనే అంత పెద్ద ఔటర్ రింగ్‌రోడ్డు ఉన్న రాష్ట్రం మరొకటి ఉండదు. 20 ఏళ్లలో ప్రపంచంలోనే మేటి నగరంగా అమరావతి తయారవుతుంది.

కిమ్స్‌లో గదులకు రైతుల పేర్లు: కిమ్స్ చైర్మన్
రాజధానికి భూములిచ్చిన రైతుల త్యాగం చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయేలా ప్రత్యేక కార్యక్రమానికి కిమ్స్ ముందుకు వచ్చింది. బైసర్ భూమి పూజ కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి చైర్మన్, ఎండీ బొల్లినేని భాస్కర్‌రావు మాట్లాడుతూ, అమరావతి రాజధానికి భూములు ఇచ్చిన రైతుల గౌరవార్థం ఆస్పత్రిలోని ప్రతి బ్లాక్‌లో గదులకు వారి పేర్లు పెడతామని తెలిపారు. బైసర్ నిర్మించే 25 ఎకరాలు ఇచ్చిన రైతుల పేర్లు, లేక వారి వంశావళిని తెలియజేస్తే అక్కడ చదువుకునే విద్యార్థులు, భవిష్యత్ తరాలకు తెలిసేలా ఆ రైతుల పేర్లను గదులకు పెడతామన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దూరదృష్టి సీఎం చంద్రబాబుది అని అన్నారు. ఆయనపై ఉన్న నమ్మకంతోనే రాజధాని కోసం రైతులు అన్ని ఎకరాల భూములు ఇచ్చారని అన్నారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి పయ్యావుల కేశవ్, అమలాపురం ఎంపీ గంటా హరీశ్, బొల్లినేని శీనయ్య, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పాల్గొన్నారు.
ఇదీ బైసర్
మెడికల్ కాలేజీ, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి లక్ష మందికి నైపుణ్య శిక్షణ అందిస్తారు. 500 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తారు. 250 మెడికల్ సీట్లు, 1,000 నాన్ మెడికల్ సీట్లతో పాటు మరో 1,000 మంది ట్రైనీలు తయారవుతారు. డెంటల్, ఫిజియో థెరపీ వంటి వాటిలో సుమారు 5,000 మందిని నియమించుకునే అవకాశం ఉంది.