Amaravathi: అమరావతి అన్‌స్టాపబుల్.. ప్రపంచంలోనే బెస్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం!
ABN , Publish Date - Jan 10 , 2026 | 08:56 PM
అమరావతిని ప్రపంచం మెచ్చే 'ప్రజా రాజధాని'గా తిరిగి అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. రెండేళ్లలో అమరావతి రూపుదిద్దుకుని విజయవాడ–గుంటూరు–మంగళగిరితో కలిసి గ్లోబల్ సిటీగా, 2047 నాటికి స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని చేరుకుంటుందని అన్నారు.
విజయవాడ, జనవరి 10: అమరావతి రాజధాని అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి ధీమా వ్యక్తం చేశారు. 'ప్రపంచం మెచ్చే అమరావతిని మళ్లీ నిర్మాణం చేస్తాం.. ఎవరూ ఆపలేరు' అని స్పష్టం చేశారు. అమరావతిని 'ప్రజా రాజధాని'గా పేర్కొంటూ, నదీ పరివాహక ప్రాంతంలోనే నగరాలు అభివృద్ధి చెందుతాయని.. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, చెన్నై, ఢిల్లీ, లండన్ వంటి నగరాలు నదుల ఒడ్డునే ఉన్నాయని చంద్రబాబు చెప్పారు.
కొంతమందికి ఇది అర్థం కాదన్న సీఎం చంద్రబాబు.. అసూయలకు, విమర్శలకు హద్దులు ఉండవని వైసీపీ అధ్యక్షుడు జగన్ మీద పరోక్ష విమర్శలు చేశారు. 'మొన్న ఆపారు.. ఏమయ్యారో మీరే చూశారు' అంటూ గత వైసీపీ ప్రభుత్వంలో అమరావతిని ఆపిన ప్రయత్నాలను ఒక కుట్రగా చంద్రబాబు పేర్కొన్నారు. చరిత్ర తెలియని వారు రాజకీయాల్లో ఉండటం దురదృష్టమని వ్యాఖ్యానించారు.
విజన్ & టైమ్‌లైన్:
అమరావతిని దేవతల రాజధాని నుంచి ప్రజా రాజధానిగా మార్చామని, శంకుస్థాపన నాటి నుంచి ఆలయాలు, మసీదులు, చర్చిల నుంచి పవిత్ర మట్టి, జలాలు తెచ్చి పునీతం చేశామని గుర్తుచేశారు. మరో రెండేళ్లలో అమరావతికి రూపు రావడం, విజయవాడ-గుంటూరు-మంగళగిరి-అమరావతి కలిపి దేశంలోనే గ్లోబల్ సిటీగా మార్చడం లక్ష్యంగా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు.
స్వర్ణాంధ్ర & వికసిత్ భారత్:
ప్రధాని మోదీ వికసిత్ భారత్ కోసం పని చేస్తుంటే, తన సంకల్పం స్వర్ణాంధ్రప్రదేశ్- 2047 నాటికి ప్రపంచంలో మొదటి స్థానంలో ఏపీ ఉంటుందని ఆయన ధీమా చాటారు. 'ఇది అన్‌స్టాపబుల్.. ఎవరూ అడ్డుకోలేరు' అని చంద్రబాబు ఉద్ఘాటించారు. విజయవాడలో జరుగుతున్న సిద్ధార్థ అకాడమీ విద్యాసంస్థల స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న చంద్రబాబు .. అమరావతి, రాష్ట్రాభివృద్ధి గురించి విద్యార్థులకు వివరించారు.
ఇవీ చదవండి:
నదీగర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియని వ్యక్తి జగన్: సీఎం చంద్రబాబు
రాజధానిపై బురదజల్లే ప్రయత్నం... సజ్జలపై మంత్రి నారాయణ ఫైర్