అమరావతిని ఇక టచ్ చేయలేరు
ABN , Publish Date - Apr 02 , 2026 | 05:14 AM
అమరావతి ప్రజా రాజధాని. ఇక దీన్ని ఎవరూ ఒక ఇంచి కూడా కదపలేరు. రాజధాని ప్రగతిని అడ్డుకోలేరు.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.
రాజధాని ప్రగతిని ఎవరూ అడ్డుకోలేరు
బిల్లుకు లోక్‌సభ ఆమోదం ఓ చరిత్ర
ఆ ఐదేళ్లూ అమరావతిపై విధ్వంసక దాడి
శ్మశానమన్నారు.. ఎడారి అన్నారు
అవమానించారు.. విషం చిమ్మారు
చివరకు ప్రజల అభీష్టమే నెగ్గింది
వైసీపీ తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు
తీవ్రవాదులకంటే ప్రమాదకారులు వీళ్లు
కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగల సమర్థులు
ఇది ఒక పార్టీ అంటే ఎవరైనా నమ్ముతారా?
నెల్లూరు జిల్లా వింజమూరు ప్రజావేదికలో సీఎం చంద్రబాబు మండిపాటు
లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ల పంపిణీ
నేతన్నల ఉచిత విద్యుత్‌కు శ్రీకారం
ప్రతి వ్యక్తికీ ఒక అడ్రస్ ఉండాలి. అలాగే, ప్రతి రాష్ట్రానికీ ఒక రాజధాని ఉండాలి. అలాంటి రాజధానిని గత ప్రభుత్వం ధ్వంసం చేసింది. రకరకాల పేర్లతో అవమానపరిచింది. ఎడారి అని, శ్మశానమని, ముంపు ప్రాంతం అని వైసీపీ నేతలు ఎగతాళి చేశారు. విషం చిమ్మారు. కుయుక్తులు పన్నారు. అమరావతి రాజధానిని అడ్డుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ, చివరికి రాష్ట్ర ప్రజల అభీష్టమే ఫలించింది. ప్రజా రాజధాని ఆవిష్కృతమైంది.
- సీఎం చంద్రబాబు
నెల్లూరు, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): ‘అమరావతి ప్రజా రాజధాని. ఇక దీన్ని ఎవరూ ఒక ఇంచి కూడా కదపలేరు. రాజధాని ప్రగతిని అడ్డుకోలేరు.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించిన నేపథ్యంలో నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన ప్రజావేదిక సభలో ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఇది ఓ చరిత్రగా నిలిచిపోతుందని అన్నారు. ‘‘ ఈ రోజు లోక్‌సభలో అమరావతి బిల్లు ఆమోదం పొందింది. రేపు (గురువారం) రాజ్యసభకు వెళుతుంది. ఆంధ్రుల కల నెరవేరే సమయం ఎంతోదూరం లేదు’’ అని చంద్రబాబు అన్నారు. ఇన్ని దశాబ్దాల కాలంలో వైసీపీ లాంటి విధ్వంస నాయకత్వాన్ని తాను చూడలేదని తెలిపారు. ‘‘నాడు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు. మూడు ముక్కలాట తరహాలో రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని కుట్ర పన్నారు. అమరావతిపై తీర్మానం కోసం నిర్వహించిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి కూడా రాకుండా దాక్కున్నారు. దీనిని ఎలా రాజకీయ పార్టీ అనాలో ప్రజలే ఆలోచించుకోవాలి. ఆ పార్టీ గురించి మాట్లాడాలంటేనే సిగ్గుపడేలా ఆ పార్టీ నాయకత్వం ప్రవర్తిస్తోంది’’ అని మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
తీవ్రవాదులకంటే ప్రమాదకరం
‘‘వైసీపీ నాయకులు తీవ్రవాదుల కంటే ప్రమాదకరం. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పగలరు. ఒకప్పుడు తీవ్రవాదులు ఉండేవారు. వారిది హిట్ అండ్ రన్ పద్ధతి. సమాజంలో పదవుల్లో ఉన్నవారిని, డబ్బున్న వారిని బెదిరిస్తారు. అడిగినంత ఇవ్వకపోతే హతమార్చుతారు. 30ఏళ్ల క్రితం సీఎం హోదాలో ఉన్న నాపై అలిపిరి వద్ద హత్యాయత్నం చేశారు. ఈ పార్టీ (వైసీపీ) దానికంటే ప్రమాదకరం’’.
ఆంధ్రులకు దక్కిన గౌరవం ఇది
బిల్లుకు ఆమోదంపై ‘ఎక్స్’లో చంద్రబాబు స్పందన
ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని సీఎం చంద్రబాబు అన్నారు. లోక్‌సభలో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఆమోదం పొందడం ఆంధ్రులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని ‘ఎక్స్’లో తెలిపారు. ‘స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయి. అమరావతి ఇక అజేయం.. అజరామరం. బిల్లుకు సహకరించిన కేంద్రానికి, ప్రధాని మోదీకి, అమిత్‌షాకు హృదయపూర్వక ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.