పాలు కలుషితం అవడానికి కారణం ఏంటో చెప్పిన డీఎస్పీ దేవకుమార్..
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:02 PM
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై విచారణ అధికారి కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ విచారణ చేపట్టారు. పాల వ్యాపారి అడ్డాల గణేష్ నిర్వహిస్తున్న వరలక్ష్మి డెయిరీని సీజ్ చేశారు..
అమరావతి, ఫిబ్రవరి 24: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై విచారణ అధికారి కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ విచారణ చేపట్టారు. పాల వ్యాపారి అడ్డాల గణేష్ నిర్వహిస్తున్న వరలక్ష్మి డెయిరీని సీజ్ చేశారు. డీఎస్పీ దేవకుమార్ ఎబీఎన్‌తో మాట్లాడుతూ.. పాల వ్యాపారి గణేష్‌పై క్రైమ్ నెంబర్ 90/2026 కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుడిపై 105, 275 బీఎన్ఎస్ సెక్షన్లు నమోదు చేశామని వెల్లడించారు. పాల వ్యాపారి గణేష్ వరలక్ష్మి మిల్క్ డెయిరీని అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నాడని అన్నారు. ఆర్థిక ఇబ్బందులు, లాభాపేక్షతో పాలల్లో నీళ్లు కలిపి ప్రజలకు పోసేవాడని చెప్పారు.
ఈ నెల 14వ తేదీన పాలు తక్కువగా సేకరించడం వల్ల పాలు చిక్కగా కనిపించేందుకు యూరియా, డిటర్జెంట్ పొడి, నూనె వంటి పదార్థాలు కలిపి కల్తీ చేశాడన్నారు. కల్తీ చేసిన పాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం వల్ల కూలెంట్ ఆయిల్ లీకై పాలు కలుషితమయ్యాయని తెలిపారు. అందువల్లే పాలు చేదుగా ఉన్నాయన్నారు.
ఐదుకు చేరిన మృతుల సంఖ్య..
కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఆదివారం వరకు ఇద్దరు మృతి చెందగా.. సోమవారం మరో ముగ్గురు చనిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాధాకృష్ణమూర్తి, ఎన్ శేషగిరిరావు, తాడి రమణి మృతి చెందారు. మరికొంతమంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ వీర పాండ్యన్ స్పందించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి ఖర్చులను ఏపీ ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారు వైద్యులను వెంటనే సంప్రదించాలని వీర పాండ్యన్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
రూ.7.18కోట్ల విలువైన ఫ్లాట్ కొనుగోలు చేసిన సూర్య కుమార్ యాదవ్ భార్య
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్లీ ఇండియా, పాక్ మ్యాచ్