క్రిప్టో కరెన్సీ పేరిట 10 కోట్ల టోకరా
ABN , Publish Date - Oct 12 , 2026 | 05:21 AM
క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే రెండేళ్లలో రెట్టింపు అవుతాయని నమ్మించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వందలాది మందిని మోసం చేసిన కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు.
ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్టు
తెలంగాణ, ఏపీల్లో 500 మంది బాధితులు!
ఆదిలాబాద్ టౌన్, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే రెండేళ్లలో రెట్టింపు అవుతాయని నమ్మించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వందలాది మందిని మోసం చేసిన కేసులో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ఐటీసీ గ్లోబల్ పేరుతో పోంజీ, మల్టీలెవల్ మార్కెటింగ్ తరహాలో స్కీం నిర్వహించి రూ.10 కోట్లకు పైగా వసూలు చేసినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నామని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలు వెల్లడించారు. జిల్లాలోని తలమడుగు మండలం రుయ్యాడికి చెందిన జువ్వక నర్సింలు 2023లో ఐటీసీ గ్లోబల్ ప్రతినిధుల మాటలు నమ్మి రూ.7.50 లక్షలు పెట్టుబడి పెట్టారు.
రెండేళ్లు గడిచినా డబ్బులు తిరిగి రాకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఏపీలోని విశాఖపట్నానికి చెందిన సంస్థ వ్యవస్థాపకుడు పొలమారశెట్టి రత్నరాజు, పశ్చిమ గోదావరికి చెందిన సహ వ్యవస్థాపకుడు దొండపాటి లక్ష్మణరావు అలియాస్ లాజర్‌సను అరెస్టు చేశారు. మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. నిందితులు సీటీఐసీఎల్‌యూబీ.ఓఆర్‌జీ పేరుతో వెబ్‌సైట్ ఏర్పాటు చేసి రూ.వెయ్యి నుంచి రూ.3 లక్షల వరకు వివిధ పెట్టుబడి ప్యాకేజీలను అందుబాటులో ఉంచినట్లు పోలీసులు గుర్తించారు. రెండేళ్లలో పెట్టుబడి రెట్టింపు అవుతుందని, కొత్త సభ్యులను చేర్పిస్తే వారి పెట్టుబడులపై 25 శాతం వరకు కమీషన్ వస్తుందని ఆశ చూపి మరింత మందిని పథకంలో చేర్చుకున్నట్లు విచారణలో తేలింది.
రెండు రాష్ట్రాల్లో సుమారు 500 మంది వరకు బాధితులు ఉండవచ్చని, మొత్తం రూ.10 కోట్లకు పైగా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. నిందితులకు ప్రస్తుతం యూఎస్-డీఎక్స్, డీఈఎక్స్‌ఏ పేర్లతో కొనసాగుతున్న క్రిప్టో ప్లాట్‌ఫామ్‌లతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణ చేపట్టారు. జహీరాబాద్, రాజమండ్రి ప్రాంతాల్లో నిందితులకు సంబంధించిన ఆస్తుల వివరాలు సేకరించడంతో పాటు వారి సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక లావాదేవీలను విశ్లేషిస్తూ మిగిలిన నిందితుల పాత్ర, బాధితుల సంఖ్య, మొత్తం ఎంత నగదు కొల్లగొట్టారనే విషయాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పెట్టుబడి పెట్టే ముందు సంస్థ చట్టబద్ధత, విశ్వసనీయతను పరిశీలించాలని, సైబర్ ఆర్థిక మోసానికి గురైతే వెంటనే 1930కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఎస్పీ సూచించారు.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్