పోలీసులంటే భయం కాదు.. బాధ్యత
ABN , Publish Date - Sep 30 , 2026 | 06:06 AM
పోలీసులంటే ప్రజల్లో భయం కూడదని, బాధ్యత అనే భావన కలిగించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాజ్యాంగానికి విధేయులుగా ఉంటూ, నిష్పక్షపాతంగా సేవలు అందించాలని నూతన కానిస్టేబుళ్లకు పిలుపునిచ్చారు.
శాంతిభద్రతలు సక్రమంగా ఉంటేనే రాష్ట్ర ప్రగతి: అచ్చెన్న
శ్రీకాకుళం, విజయనగరం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): పోలీసులంటే ప్రజల్లో భయం కూడదని, బాధ్యత అనే భావన కలిగించాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాజ్యాంగానికి విధేయులుగా ఉంటూ, నిష్పక్షపాతంగా సేవలు అందించాలని నూతన కానిస్టేబుళ్లకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం రూరల్ మండలం తండ్యాంవలసలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం (డీపీటీసీ)లో మంగళవారం 142 మంది సివిల్ పోలీసు కానిస్టేబుళ్ల (2025-26, 6వ బ్యాచ్) శిక్షణ ముగింపు సందర్భంగా ‘పాసింగ్ అవుట్ పరేడ్’ అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథి అచ్చెన్న కవాతును పరిశీలించి, గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు సక్రమంగా ఉంటేనే పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చి ప్రగతి వేగంగా సాగుతుందని పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వంలోనే కొలువులు: కొండపల్లి
కూటమి ప్రభుత్వంలోనే వేల సంఖ్యలో పోలీసు నియామకాలు చేపట్టినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. తొమ్మిది నెలలు శిక్షణ పొందిన 198 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ మంగళవారం విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా మంత్రి కొండపల్లి.. పోలీసుశాఖ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లకు జ్ఞాపికలు అందజేశారు. గత ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా మొండిచేయి చూపించిందన్నారు. తమ ప్రభుత్వంలో 6వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.
ఈ వార్తలనూ చదవండి..
హై బీమ్ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు
వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం