Share News

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే

ABN , Publish Date - Apr 08 , 2026 | 04:29 AM

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై వైసీపీ దాడికి ప్రయత్నించడాన్ని పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా స్వేచ్ఛను అణచివేయాలని చూడడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే

  • రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం

  • రాధాకృష్ణ ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తికాదు

  • జగన్‌ మావిగన్‌ వ్యాఖ్యలపై ప్రజల దృష్టి మళ్లించడానికే...

  • శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ‘కూటమి’ ఊరుకోదు

  • వైసీపీపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల ఆగ్రహం

  • దాడికి యత్నించిన వారిపై టీ-ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రధాన కార్యాలయంపై వైసీపీ దాడికి ప్రయత్నించడాన్ని పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా స్వేచ్ఛను అణచివేయాలని చూడడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు.

ప్రశ్నిస్తే దాడులా..: కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు

‘ఆంధ్రజ్యోతి కార్యాలయంపై రౌడీ మూకల దాడి అత్యంత దారుణం. ప్రశ్నిస్తే దాడులా? విశ్లేషిస్తే దౌర్జన్యాలా? నిజాలు మాట్లాడితే భౌతిక దాడులకు దిగడం వైసీపీ బలహీనతకు సంకేతం. ఈ అరాచక సంస్కృతిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఫోర్త్‌ ఎస్టేట్‌గా పిలిచే మీడియాపై దాడులు భవిష్యత్తులో రాజకీయ పార్టీల జవాబుదారీతనాన్ని ప్రశ్నార్థకం చేస్తాయి. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలే స్వయంగా రోడ్లపైకి వచ్చి దాడులను ప్రోత్సహించడం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం.

దాడులు అప్రజాస్వామికం: కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ

జగన్‌ వైఫల్యాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగడం ఆ పార్టీ రౌడీయిజానికి, అరాచకత్వానికి నిదర్శనం. వీకెండ్‌ కామెంట్‌ బై ఆర్కే విశ్లేషణను తట్టుకోలేక మీడియా సంస్థలపై దాడులు చేయడం అప్రజాస్వామికం. పత్రికా స్వేచ్ఛను హరించడమే. దశాబ్దాలుగా కేసులు, బెదిరింపుకు భయపడకుండా ఆంధ్రజ్యోతి మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధాకృష్ణ పత్రికను, చానల్‌ను నడుపుతున్నారు. వైఎ్‌స హయాంలోనే ఎదురొడ్డి నిలిచారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తి కాదు.


వైసీపీ సంస్కృతికి నిదర్శనం: మంత్రి అచ్చెన్నాయుడు

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ రౌడీ మూకల దాడి యత్నం మీడియా స్వేచ్ఛపై దాడే. అమరావతిపై జగన్‌ వైఖరిని ప్రశ్నిస్తే.. మీడియాపై దాడి చేయడం వైసీపీ సంస్కృతికి నిదర్శనం

ప్రజల గొంతు నొక్కడమే: మంత్రి అనగాని సత్యప్రసాద్‌

ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాపై దాడి చేయటం అంటే ప్రజల గొంతును నొక్కటమే. వాస్తవాలను ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగటం వైసీపీ సంస్కృతి. వీకెండ్‌ కామెంట్‌ బై ఆర్‌కే కార్యక్రమంలో వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రౌడీల్లా కార్యాలయాల మీదకు వెళ్లటం సిగ్గుచేటు.

వైసీపీ తీరు సిగ్గుచేటు: మంత్రి సవిత

ప్రజాస్వామ్యంలో పత్రికలపై దాడులు చేయడం సిగ్గుచేటు. ఆంధ్రజ్యోతి నిజాన్ని నిర్భయంగా చెప్పగలుగుతుంది. అది తెలుగు ప్రజలందరికీ తెలుసు. ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసే పత్రిక ఆంధ్రజ్యోతి. ఆ సంస్థ ఎండీ వేమూరి రాధాకృష్ణ వీకెండ్‌ కామెంట్‌లో నిజాలు చెబితే, దానిని జీర్ణించుకోలేక జగన్మోహన్‌రెడ్డి పేటీఎం బ్యాచ్‌తో ధర్నా చేయించారు. దాడులకు పూనుకున్నారు. దాడులు, దౌర్జన్యాలే ఆ పార్టీ సిద్ధాంతమా? శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చూస్తూ ఊరుకోం.

వైసీపీ వెంటనే క్షమాపణ చెప్పాలి: మంత్రి గొట్టిపాటి రవి

‘‘ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి వైసీపీ వెంటనే క్షమాపణ చెప్పాలి. ‘ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై దాడి ఖండనీయం. మీడియా స్వేచ్చను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత. వార్తల్లో తప్పులు ఉంటే ఖండించాలి. దాడులు చేయడం అమానుషం.


వైసీపీ అధినేతకు అలవాటే: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

వైసీపీ నేత జగన్‌ వైఖరిని ప్రశ్నిస్తే దాడులకు పాల్పడతారా? పత్రికలు, పత్రికా స్వేచ్ఛపై దాడులు చేయడం వైసీపీ అధినేతకు, వారి నాయకత్వానికి అలవాటే. ఎండీ రాధాకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు చేసిన వైసీపీ నాయకులు పచ్చి గూండాలు, రౌడీల్లా మాట్లాడారు. సొంతంగా ఒక మీడియా సంస్థను నడుపుతున్న జగన్‌... సాటి మీడియా సంస్థలపై దాడికి ప్రోత్సహించడం ఆయన దుర్మార్గానికి పరాకాష్ఠ.

ప్రజాస్వామ్యం ఖూనీ: మంత్రి సంధ్యారాణి

అమరావతిపై వైసీపీ అరాచక వైఖరిని ప్రశ్నించినందుకు ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిపై దాడులు చేసి, గొంతు నొక్కాలని చూడటం పిరికిపంద చర్య. వైసీపీకి ఖూనీలు అలవాటే. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని చూస్తున్నారు. ఐదేళ్ల పాటు అధికార బలంతో వేధించినా లొంగని ఆంధ్రజ్యోతిని ఇప్పుడు దాడులతో భయపెట్టాలని చూడటం అవివేకమవుతుంది. తాజా దాడి ముమ్మాటికీ పత్రికాస్వేచ్ఛపై దాడే.

పద్ధతి మారకపోతే పతనమే: మంత్రి ఫరూక్‌

వైసీపీ నాయకుల పద్ధతి మారకపోతే పతనం తప్పదు. యథార్థాలను ప్రచురించే ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడులకు పాల్పడడం హేయం. జగన్‌ అండ్‌ కో నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ ప్రజాభ్యున్నతికి పాటుపడుతున్న సంస్థలపై దాడులకు పాల్పడడం సిగ్గుచేటు.

పిరికిపంద చర్య: మంత్రి సత్యకుమార్‌

అమరావతిపై వైసీపీ అరాచక వైఖరిని ప్రశ్నించినందుకు మీడియా గొంతు నొక్కాలనుకోవడం పిరికిపంద చర్య. రౌడీ మూకలను వెంటేసుకొని వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా సంస్థపైకి వెళ్లడం వారి విష సంస్కృతికి పరాకాష్ఠ. ఐదేళ్లపాటు అధికార బలంతో వేధించినా లొంగని ఆంధ్రజ్యోతిని, ఇప్పుడు దాడులతో భయపెట్టాలని చూడటం అవివేకం.ప్రశ్నిస్తే దాడులు చేయడం కాదు... చేతనైతే ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పండి. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంపై ఇలాంటి దాడులు సాగనివ్వం.

వైసీపీకి తెలిసింది విధ్వంసం, బూతులే: మంత్రి దుర్గేశ్‌

ప్రతిపక్ష నేత వైఖరిని ప్రశ్నించినా, వారి విధానాలను విశ్లేషించినా భౌతిక దాడులకు దిగడం దుర్మార్గం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావులేదు. వైసీపీకి తెలిసింది కేవలం విధ్వంసం, బూతులు మాత్రమే. ప్రజాస్వామ్యాబద్ధంగా విమర్శలను ఎదుర్కోవడం ఆ పార్టీకి చేతకాదు.


దాడులతో బెదిరిస్తారా: మంత్రి టీజీ భరత్‌

పత్రికల్లో వచ్చే వార్తలు నచ్చకపోతే ప్రజాస్వామ్య పద్థతిలో ఎదుర్కోవాలి. దాడులతో మీడియాను బెదిరించాలనుకోవడం సరికాదు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను.

ఉడుత ఊపులకు రాధాకృష్ణ భయపడరు: ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ వైసీపీ నాయకుల ఉడుత ఊపులకు భయపడే వ్యక్తి కాదు. ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై విశ్వాసం లేక వైసీపీ నాయకులు మీడియాపై దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య. ఇలా అయితే జగన్‌ మీడియా కార్యాలయంపై ప్రతిరోజూ ప్రజలు దాడి చేయాల్సి వస్తుంది. దాడి చేసిన వారిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి.

ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి: ఎమ్మెల్యే గౌతు శిరీష

ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిపై దాడిని ఓ పత్రికా సంస్థపై జరిగిన దాడిగా మాత్రమే చూడకూడదు. పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా చూడాలి. గత 18 ఏళ్లుగా జగన్‌ పత్రికలో వాస్తవాలను పాతరవేస్తూ, నిజాలను అబద్ధాలుగా వక్రీకరిస్తున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లు వైసీపీ సొంత పత్రికలో టీడీపీ నాయకులు... ముఖ్యంగా నా లాంటి మహిళా నేతలపై రాయించిన రాతలు అత్యంత హేయం. కనీసం కుటుంబ సభ్యులతో కలసి చదవలేని నీచపు రాతలు రాయించిన ఆయన పత్రికను ఏమనాలో జగన్‌ విజ్ఞతకే వదిలేస్తున్నా.

Updated Date - Apr 08 , 2026 | 04:29 AM