పల్నాడులో అమానుషం.. తన పొలంలోకి వచ్చాయని 7 గొర్రెలకు విషంపెట్టి చంపిన యజమాని
ABN , Publish Date - May 24 , 2026 | 09:43 PM
పల్నాడు జిల్లాలోని వినుకొండ మండలం నాగులవరం గ్రామంలో దారుణం వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..
పల్నాడు జిల్లా, మే 24: వినుకొండ మండలం నాగులవరం గ్రామంలో దారుణం వెలుగుచూసింది. నోరులేని జీవాలను అమానుషంగా చంపిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. తన పొలాల్లోకి వస్తున్నాయనే కక్షతో గొర్రెలకు విషం పెట్టి చంపిన ఘటన కాపరుల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు రోజువారీలాగే తమ జీవాలను మేత కోసం సమీపంలోని పొలాలవైపు తీసుకెళ్లారు. ఎన్నిసార్లు చెప్పినా తన పొలం వద్దకు గొర్రెలను తీసుకురావడం.. అవి మేయడం సహించలేని పొలం యజమాని అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు.
నూకలలో విషపూరితమైన గుళికలను కలిపి గొర్రెలు మేసే ప్రాంతంలో ఉంచాడు. ఆకలితో ఉన్న గొర్రెలు ఆ విషపూరిత నూకలను తినడంతో.. కాసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. అందులో 7 గొర్రెలు అక్కడికక్కడే విలవిలలాడుతూ మృతిచెందాయి. కాగా, అదే నూకలను తిన్న మరో 50 గొర్రెలు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్టు సమాచారం. లక్షలాది రూపాయల నష్టం వాటిల్లడమే కాకుండా, తమ పొట్టగొట్టిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బాధితులు వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. తమకు జరిగిన నష్టానికి పరిహారం ఇప్పించాలని, మూగజీవాల మృతికి కారణమైన దుండగుడిపై కఠిన చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఇవి కూడా చదవండి..
బంకీపూర్ నుంచి ప్రశాంత్ కిషోర్ పోటీ.?
డీఎంకే కష్టకాలంలో ఆదుకున్నాం.. ఉదయనిధికి కాంగ్రెస్ కౌంటర్