Share News

మోదీ, బాబు, పవన్‌తో ఏపీలో 360 డిగ్రీల అభివృద్ధి

ABN , Publish Date - Oct 05 , 2026 | 03:49 AM

నాడు కాంగ్రెస్‌ పార్టీ రాజధాని లేకుండా రాష్ట్ర విభజన చేస్తే, మూడు రాజధానుల పేరుతో జగన్‌ రాష్ట్రాన్ని, ప్రజలను మరింత అబాసుపాలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు విజన్‌తో ఏపీ షైనింగ్‌ ఆంధ్రగా మారుతోంది.

మోదీ, బాబు, పవన్‌తో   ఏపీలో 360 డిగ్రీల అభివృద్ధి
CHANDRABABUNAIDU WITH CHOWHAN

  • రానున్న రోజుల్లో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్‌

  • షైనింగ్‌ ఆంధ్ర.. చంద్రబాబు వల్లే సాధ్యం

  • బుర్రిపాలెం సభలో కేంద్ర మంత్రి చౌహాన్‌

  • రాష్ట్రానికి మరో 6 లక్షల ఇళ్ల మంజూరుకు ఓకే

  • మధ్యప్రదేశ్‌కే కాదు.. ఏపీకి కూడా ‘మామ’నేనని వ్యాఖ్య

  • పేదల సొంతింటి కలను జగన్‌ చెరిపేశారని విమర్శ

  • ఏపీ ప్రజలకు ‘ఐ లవ్‌ యూ’ చెప్పిన కేంద్ర మంత్రి

తెనాలి, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ‘నాడు కాంగ్రెస్‌ పార్టీ రాజధాని లేకుండా రాష్ట్ర విభజన చేస్తే, మూడు రాజధానుల పేరుతో జగన్‌ రాష్ట్రాన్ని, ప్రజలను మరింత అబాసుపాలు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు విజన్‌తో ఏపీ షైనింగ్‌ ఆంధ్రగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రానున్న రోజుల్లో దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా, దిక్సూచిగా మారబోతోంది’ అని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో పీఎంఏవై-జీ2.0 పథకం కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 3డీ ప్రింటెడ్‌ టెక్నాలజీతో నిర్మించనున్న ఇళ్లకు సంబంధించి భూమిపూజ అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడారు. రాజధాని, అభివృద్ధికి నిధులు లేని స్థితి నుంచి ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధి దిశగా పయనిస్తోందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లు రాష్ట్రాభివృద్ధికి మూల స్థంభాలన్నారు. ఈ ముగ్గురితో ఆంధ్రప్రదేశ్‌లో 360 డిగ్రీల అభివృద్ధి సాధ్యమైందన్నారు. భవిష్యత్‌ భారతావనికి సాంకేతికతే ప్రధాన బలమని ముందుగానే గుర్తించిన చంద్రబాబు ఏపీని ఏఐ డేటా సెంటర్ల హబ్‌గా, క్వాంటమ్‌ వ్యాలీగా తీర్చిదిద్దుతున్నారని ప్రశంసించారు. ఆయన నేడు ఆలోచించి అమలు జరిపిన దానిని దేశం రేపు ఆచరిస్తుందని, ఇది బాబు దూరదృష్టికి, సమర్థతకు నిదర్శనమన్నారు.


సీఎం రైతుల పక్షపాతి అని, ‘అన్నదాత సుఖీభవ’ ఆర్థిక సాయంతో వారికి అండగా నిలిచారని పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ ఒక్కటే కాదు... అక్కచెల్లెళ్లు సుఖీభవ, అన్నదమ్ములు సుఖీభవ, చంద్రబాబు సుఖీభవ... చివరకు ఆంధ్రప్రదేశ్‌ కూడా సుఖీభవ అవుతోందన్నారు. ‘చంద్రబాబు సంకల్ప బలం, స్వర్ణాంధ్రపై ఆయన విజన్‌ చాలా గొప్పది. ఏపీలోని ప్రతి ఒక్కరి ఆశలు నెరవేర్చేది ఆయన మాత్రమే’ అని పేర్కొన్నారు. చంద్రబాబును మిగతా రాష్ట్రాలు మార్గదర్శకంగా తీసుకుంటున్నాయన్నారు

ఏపీకి కూడా మామనే..

ఆంధ్రప్రదేశ్‌ గడ్డకు ఎంతో ఘన కీర్తి ఉందని, ఇది తెనాలి రామకృష్ణ కవి వంటి వారెందరో జన్మించిన నేలని, ఈ నేల ప్రగతి, ప్రతిభ కలగలిపిన సంగమం చౌహాన్‌ అన్నారు. ఈ పుణ్యభూమికి, తెలుగు భాషకు నా ప్రణామాలంటూ రాష్ట్రంపై ప్రేమను కేంద్ర మంత్రి చాటుకున్నారు. మధ్యప్రదేశ్‌ ప్రజలంతా తనను ‘మామ’ అని ప్రేమగా పిలుచుకుంటారని, ఇకపై ఆంధ్రులకు కూడా తాను మామనేనని అన్నారు. ‘మీ సంక్షేమం, యోగక్షేమాలు చూసుకోవాల్సిన బాధ్యత నాదే. గూడు లేని నిరుపేదల లేని రాష్ట్రంగా ఏపీని చేసేందుకు సహకారం అందిస్తా’ అని చౌహాన్‌ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రజలకు ‘ఐ లవ్‌ యూ’ అంటూ చెప్పారు.

మరో 6 లక్షల ఇళ్ల మంజూరుకు ఓకే!

‘‘దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాలు కేటాయించడానికి మోదీ ఒక పాలసీ పెట్టుకున్నారు. దాని ప్రకారం ఏపీకి 76 వేల ఇళ్లు మాత్రమే మంజూరవుతాయి. వైసీపీ ప్రభుత్వంలో జగన్‌ విధ్వంసకర విధానాలతో పేదల సొంతింటి కల నెరవేరలేదు. వారందరికీ ఇళ్లు అందించాలంటే మరో 3 లక్షల ఇళ్లు అదనంగా అవసరమని చంద్రబాబు ప్రధాని మోదీని కోరారు.


పరిస్థితిని అర్థం చేసుకున్న మోదీ వెంటనే వాటిని మంజూరు చేశారు. ఆ మంజూరు పత్రాలను అందిద్దామని ఇక్కడికి వస్తే సీఎం అవి కూడా చాలవని, మరో 6 లక్షల ఇళ్లు కావాలని కోరారు. ఆయన విజన్‌, మీ ప్రేమాభిమానాలు చూశాక కాదనలేకపోతున్నా. ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తవగానే మరో 3 లక్షల ఇళ్లు, అవి కూడా పూర్తయ్యే లోపు మరో 3 లక్షలు మంజూరు చేస్తాం’ అని చౌహాన్‌ ప్రకటించారు.

3డీ ఇళ్లకు బుర్రిపాలెంలో తొలి అడుగు

‘‘2029 నాటికి రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద ఒక్కరు కూడా ఉండకూడదని చంద్రబాబు లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఆయన ఆలోచనలకు మా మద్దతు ఉంటుంది. గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లన్నిటినీ పూర్తిచేసి ఉంటే, ఇప్పుడు ఇన్ని ఇళ్ల అవసరం పడేది కాదు. రానున్న రోజుల్లో వృథా వ్యయం తగ్గించడం, సమయం ఆదా చేయటమే కాక తక్కువ మానవ వనరులను ఉపయోగించి, 3డీ కాంక్రీట్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీతో ఇళ్లను నిర్మించేందుకు కేంద్రం తొలి అడుగు బుర్రిపాలెం గ్రామం నుంచి వేసింది. వీటిని త్వరితగతిన నిర్మించి ఇచ్చేందుకు నా సహచర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ వంటి వారు సీఎ్‌సఐఆర్‌, సీబీఆర్‌ఐల సహకారంతో ప్రయోగాత్మకంగా పైలెట్‌ ప్రాజెక్టు చేపట్టటం గర్వంగా ఉంది. ఇక్కడ నిర్మిస్తున్న 177 ఇళ్లు విజయవంతమైతే రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ తరహాలోనే ఇళ్ల నిర్మాణం చేపడతాం’’ అని మంత్రి తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి

ప్రకృతి సాగులో ఏపీ నంబర్‌ వన్.. సీఎం చంద్రబాబుకు శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రశంసలు

ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

Updated Date - Oct 05 , 2026 | 03:54 AM