టీచర్లపై దాడి కేసులో మరో 30 మంది అరెస్టు
ABN , Publish Date - Sep 24 , 2026 | 05:34 AM
శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై దాడి చేసిన కేసులో విజయవాడలోని మాచవరం పోలీసులు మరో 30 మందిని అరెస్టు చేశారు. విజయవాడతో పాటు నందిగామ, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం, గుంటూరు ప్రాంతాలకు చెందిన నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
టీచర్లపై దాడి కేసులో మరో 30 మంది అరెస్టు
బెజవాడ కోర్టులో హాజరు.. అజ్ఞాతంలోకి వైసీపీ నేతలు
దేవినేని, వెలంపల్లి, జోగి, మల్లాదిపై రౌడీషీట్లు?
విజయవాడ, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై దాడి చేసిన కేసులో విజయవాడలోని మాచవరం పోలీసులు మరో 30 మందిని అరెస్టు చేశారు. విజయవాడతో పాటు నందిగామ, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం, గుంటూరు ప్రాంతాలకు చెందిన నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారికి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం ఏడో ఏసీఎంఎం కోర్టులో హాజరుపరిచారు. కాగా మాచవరం పోలీసులు విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ లూనా సెంటర్‌కు చెందిన అకరపు రవిచంద్ర(ఏ6), అయోధ్యనగర్‌కు చెందిన గుందె సుందర్‌పాల్(ఏ7), గుంటూరుకు చెందిన గెద్దాటి సురేంద్ర(ఏ8)లను మంగళవారం రాత్రి కోర్టులో హాజరుపరిచారు. రవిచంద్రకు వచ్చే నెల 5 వరకు కోర్టు రిమాండ్ విధించింది. మిగిలిన ఇద్దరికి 41ఏ నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు.. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాశ్, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పూనూరు గౌతంరెడ్డి తదితరులను ట్రబుల్ మాంజర్స్‌గా నిఘా వర్గాలు గుర్తించాయి. వీరితోపాటు మరికొంతమందిపై రౌడీషీట్ తెరవాలని పోలీసులు నిర్ణయించారు. దీంతో వారిలో ముఖ్యమైన నాయకులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమపై కేసులను కొట్టివేయాలని, రౌడీషీట్లు తెరవకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించే యోచనలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా పోలీసులు 54 మందిని అరెస్టు చేశారు. వారిలో సస్పెక్ట్, రౌడీషీటర్లు ఉన్నారు.
బెజవాడలో కొత్తగా 51 మందిపై రౌడీషీట్!
ఎన్టీఆర్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మొత్తం 51 మందిపై కొత్తగా రౌడీషీట్ తెరవాలని పోలీసులు నిర్ణయించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసులో వాళ్లంతా నిందితులుగా ఉన్నారు. 21వ తేదీన శాప్ కార్యాలయం వద్ద టీచర్లపై జరిగిన దాడి ఘటనలోనూ పాల్గొన్నారు.