భారీగా నకిలీ వీసాలు!
ABN , Publish Date - Jul 03 , 2026 | 04:53 AM
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీ వీసా మోసం వెలుగు చూసింది. నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు యత్నించిన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను..
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 20 మంది మహిళల అరెస్టు
పట్టుబడిన వారంతా తూర్పు గోదావరి వాసులే
ఏజెంట్ మోసం చేశాడంటూ బాధితుల ఆవేదన
శంషాబాద్ రూరల్, జూలై 2(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీ వీసా మోసం వెలుగు చూసింది. నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు యత్నించిన తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. ఒమన్ ఎయిర్‌వేస్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు వీరు ఎయిర్‌పోర్టుకు రాగా అధికారులు ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల వద్ద ఉన్న వీసాలు నకిలీవని గుర్తించారు. ఇమ్మిగ్రేషన్ అధికారులు వెంటనే వారిని అదుపులోకి తీసుకొని ఎయిర్‌పోర్టు క్రైమ్ ఔట్‌పోస్టు పోలీసులకు అప్పగించారు. ఉపాధి కోసం తాము విదేశాలకు వెళ్లేందుకు ఓ ట్రావెల్ ఏజెంట్‌ను ఆశ్రయించగా, తమ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి నకిలీ వీసాలు ఇచ్చి మోసం చేశాడని మహిళలు వాపోయారు. ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించినట్లు సమాచారం. ఏజెంట్ ఆట కట్టించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.