Share News

సీబీఐకి సాయికృష్ణ కేసు

ABN , Publish Date - Oct 17 , 2026 | 03:54 AM

విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ మృతికేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కస్టోడియల్‌ మృతి ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు

సీబీఐకి సాయికృష్ణ కేసు

  • పోలీస్‌ కస్టడీలోనే మరణం.. హైకోర్టు సంచలన తీర్పు

  • వేగంగా దర్యాప్తు పూర్తి చేయండి.. బాధ్యుల్ని ప్రాసిక్యూట్‌ చేయండి

  • సీబీఐ డైరెక్టర్‌కు ఆదేశాలు.. కేసు రికార్డులు వారంలో సీబీఐకి

  • డీజీపీకి ధర్మాసనం నిర్దేశం.. తల్లి విజయలక్ష్మికి 25 లక్షల పరిహారం

  • 4 వారాల్లో ఆమె ఖాతాలో జమ చేయండి.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు

  • సర్వీస్‌ నిబంధనల ప్రకారం బాధ్యులైన అధికారులపై శాఖాపర చర్యలకు నిర్దేశం

  • సిట్‌ చార్జిషీట్‌ వేసిందన్న వాదన తిరస్కృతి

అమరావతి, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): విజయవాడ యువకుడు గాదె సాయికృష్ణ కస్టోడియల్‌ మృతికేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కస్టోడియల్‌ మృతి ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు బాధ్యతను సీనియర్‌ అధికారికి అప్పగించాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తును పూర్తి చేయాలని, సాయికృష్ణ మృతికి బాధ్యులైన అధికారులందరినీ చట్టం ప్రకారం ప్రాసిక్యూట్‌ చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం కేసును ప్రత్యేక పోలీసు బృందం (సిట్‌) దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, కేసుకు సంబంధించిన పూర్తి రికార్డులను వారం రోజుల్లోగా ప్రత్యేక మెసెంజర్‌ ద్వారా సీబీఐ డైరెక్టర్‌కు అందజేయాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది. సాయికృష్ణ మృతికి కారణమైన అధికారులపై సర్వీస్‌ నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది.

సాయికృష్ణ తల్లి, పిటిషనర్‌ విజయలక్ష్మికి నాలుగు వారాల్లో రూ.25లక్షల పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పరిహారం మొత్తాన్ని విజయలక్ష్మి బ్యాంక్‌ ఖాతాలో జమ చేయాలని పేర్కొంది. కస్టోడియల్‌ మృతి ఘటనను సీబీఐకి అప్పగించాలని కోరుతూ తల్లి విజయలక్ష్మి వేసిన అనుబంధ పిటిషన్‌ను అనుమతించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, జస్టిస్‌ ఆలపాటి గిరిధర్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు ఇచ్చింది. తన కుమారుడు గాదె సాయి కృష్ణను కోర్టు ముందు హాజరుపర్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ తల్లి విజయలక్ష్మి ఈ ఏడాది జూన్‌ 2న హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ అనుబంధ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌పై సెప్టెంబరు 22వ తేదీన వాదనలు ముగియడంతో, తీర్పును ధర్మాసనం రిజర్వ్‌ చేసింది. శుక్రవారం తీర్పు వెలువరించింది.


తీర్పులో ఏముందంటే....

‘‘సాయికృష్ణ పోలీస్‌ కస్టడీలోనే మరణించారని ప్రాథమికంగా స్పష్టమైంది. కోర్టు ముందు ఉన్న రికార్డులు, ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు వివరాలు దీనినే సూచిస్తున్నాయి. ఈ ఏడాది మే ఆరు తెల్లవారుజాము మూడు గంటలకు మార్కాపురంలో సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయం ఏడు గంటల సమయంలో కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి సెంట్రీకి అప్పగించారు. అనంతరం సాయికృష్ణ, అతని ఫోనును ఎస్‌హెచ్‌వోకు స్వాధీనపరిచారు. అరెస్టు చట్టబద్ధమైనదే అయినప్పటికీ, చట్ట నిబంధనల్లో నిర్దేశించిన కాలపరిమితిలోగా అతనిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చలేదు.

కస్టడీ నుంచీ విడుదల చేయలేదు. రాజ్యాంగ అధికరణ 22, బీఎన్‌ఎస్ఎస్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టమైంది. మృతుడు సాయికృష్ణ కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో పోలీస్‌ కస్టడీలో చివరిగా జీవించి ఉన్నట్లుగా కనిపించాడు. తదనంతరం అతని ఆచూకీ లేదు. దర్యాప్తులో భాగంగా సేకరించిన మౌఖిక, డిజిటల్‌, డాక్యుమెంటరీ, ఇతర సాక్ష్యాలను పరిశీలిస్తే, మృతుడు చట్టంలో నిర్దేశించిన కాలపరిమితికి మించి పోలీస్‌ కస్టడీలోనే ఉన్నాడు. మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చలేదని ప్రాథమికంగా తేలింది. పోలీస్‌ కస్టడీలో జరిగిన దాడిలో తగిలిన గాయాలవల్ల సాయికృష్ణ మరణించాడు. పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటుచేసిన సీసీ టీవీ హార్డ్‌ డిస్క్‌లను తొలగించి, వాటి స్థానంలో వేరే హార్డ్‌ డిస్క్‌లు ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఫోరెన్సిక్‌ పరీక్షల్లో కస్టడీ కాలానికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ, అంతకుముందు 18 నెలల ఫుటేజీ లేదని తేలింది.

సాయికృష్ణ నిర్బంధం, కస్టడీలో దాడి, మరణం, మృతదేహాన్ని మాయం చేయడం విషయంలో ఎలక్ట్రానిక్‌ సాక్ష్యాలు లభించకుండా చేసేందుకే హార్డ్‌ డిస్క్‌లు మాయం చేశారు. మృతుడి, భౌతిక అవశేషాలు గుర్తించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, స్మశానవాటికల నుండి శవాల వివరాలు సేకరించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సంబంధిత రికార్డులు పరిశీలించిన తరువాత కూడా, సాయికృష్ణ భౌతిక అవశేషాలు గుర్తించేందుకు, రికవరీ చేసేందుకు ఎలాంటి సమాచారం లభించలేదు.


ఈ ఏడాది మే 8న కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌లో సాయికృష్ణను తాను పరీక్షించానని, అతని ఒంటిపై గాయాలు, వాపులు ఉన్నాయని, పోలీసులే చిత్రహింసలకు గురి చేసినట్లు అతను చెప్పాడని ఆర్‌ఎంపీ వాంగ్మూలం ఇచ్చారు. ఆ తరువాత సాయికృష్ణ మొబైల్‌ ఫోను మరొక వ్యక్తి ఉపయోగించేలా చేశారు. పోలీస్‌ కస్టడీలో ఉన్నప్పుడు సాయికృష్ణ శరీర స్థితి, అతను సజీవంగా ఉన్నాడనే భ్రమ కల్పించేందుకు చేసిన ప్రయత్నాలూ, పరారీలో ఉన్నట్లు చూపడం, క్రైమ్‌ రూమ్‌ను మార్చడం, మృతుడి కుటుంబాన్ని ప్రభావితం చేసేందుకు చేసిన ప్రయత్నాలను పరిశీలిస్తే... పోలీస్‌ కస్టడీలో సాయికృష్ణ మరణించాడని, మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారని స్పష్టమవుతోంది.’’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.

అసాధారణ పరిస్థితులు ఉన్నాయి

‘‘సాయికృష్ణ కేసులో సిట్‌ ఇప్పటికే అభియోగపత్రం దాఖలు చేసినంత మాత్రాన, దర్యాప్తును సీబీఐకి ఇవ్వకుండా నిషేధం ఏమీ లేదు. దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ దాఖలు చేయడమనేది సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడానికి నిరోధకంగా మారదని, పోలీస్‌ సిబ్బందే నేరానికి పాల్పడినప్పుడు ఇది మరింత విస్తృతంగా వర్తిస్తుందని షేక్‌ రుబాబుద్దీన్‌ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. పోలీస్‌ కస్టడీలో జరిగే హింస, కస్టోడియల్‌ మరణం వంటి కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించే అధికారం ఈ కోర్టుకు ఉంది. ఇలాంటి ఘటనల్లో ఉన్నతాధికారుల పాత్రను ప్రశ్నించకుండా వదిలేయడానికి వీల్లేదు.

దర్యాప్తుపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంపొందించడం, బాధితుల ప్రయోజనాలు, చట్టబద్ధమైన పాలనను కాపాడడమే నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు ముఖ్య ఉద్దేశం. సీబీఐ విచారణకు ఆదేశించే అధికారం అసాధారణమైనది. ఈ అధికారాన్ని వినియోగించేటప్పుడు స్వీయ నియంత్రణ అవసరం. అత్యంత అరుదైన సందర్భాల్లోనే సీబీఐ విచారణకు ఆదేశించాలి. ప్రస్తుత కేసులో సీబీఐ దర్యాప్తు కోరే అసాధారణ పరిస్థితులు ఉన్నాయని నమ్ముతున్నాం. పిటిషనర్‌ హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసిన తరువాతే సిట్‌ను ఏర్పాటు చేశారు. కస్టడీ మరణానికి సంబంధించి పోలీసు అధికారులపై తీవ్ర ఆరోపణలున్నాయి. పోలీసుల నేతృత్వంలో వేసిన సిట్‌ పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉంది.


సిట్‌ నిజాయితీగా దర్యాప్తు చేసినప్పటికీ, పోలీసులు తమ వారిని కాపాడుకుంటున్నారనే అనుమానం బాధితుడి కుటుంబానికి, సమాజానికి రావడం సహజం. నిష్పాక్షిక దర్యాప్తు జరగాలన్నా, దర్యాప్తు సంస్థపై ప్రజలకు నమ్మకం కలగాలన్నా, కేసును స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించడమే సమంజసం. లాక్‌పలో జరిగే కస్టడీ హింస, చిత్రహింసలు, మరణాలు... చట్టబద్ధమైన పాలనను దెబ్బతీస్తాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. పౌరులను కాపాడాల్సిన పోలీసులే భక్షకులుగా మారితే తీవ్రత మరింత పెరుగుతుంది. పోలీసు కస్టడీలో వ్యక్తి మృతి చెందడమనేది సాధారణ అంశం కాదు. అది తీవ్రమైన నేరం. సిట్‌ దర్యాప్తు చేసి ఇప్పటికే చార్జిషీట్‌ దాఖలు చేసినందున, దర్యాప్తును సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ వాదనతో మేం ఏకీభవించడం లేదు. నిష్పాక్షిక దర్యాప్తు జరిపించి, వ్యవస్థ పై ప్రజల్లో నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాపాడే లక్ష్యంతో సాయికృష్ణ కస్టోడియల్‌ మృతి కేసులో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తున్నాం.’’ అని బెంచ్‌ తీర్పులో పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి:

అంతా కొలిక్కి...

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 17 , 2026 | 03:55 AM