Share News

ప్రమాదంలో ఎన్నికల సంఘం

ABN , Publish Date - Oct 10 , 2026 | 04:52 AM

దేశంలో ఎన్నికల కమిషన్‌ ప్రమాదంలో పడిందని, దాని ముసుగులో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ హైజాక్‌ చేస్తోందని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై...

ప్రమాదంలో ఎన్నికల సంఘం

  • ప్రజాస్వామ్యం హైజాక్‌ అయింది

  • రౌండ్‌టేబుల్‌ సమావేశంలో షర్మిల

విజయవాడ, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): దేశంలో ఎన్నికల కమిషన్‌ ప్రమాదంలో పడిందని, దాని ముసుగులో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ హైజాక్‌ చేస్తోందని పలువురు వక్తలు వ్యాఖ్యానించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై విజయవాడలో శుక్రవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మాట్లాడారు. సీఈసీ.. ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియాగా కాకుండా ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ మోదీగా మారిందని విమర్శించారు. సీఈసీని కీలుబొమ్మ చేసి.. ప్రజాస్వామ్యాన్ని ప్రధాని మోదీ హైజాక్‌ చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నికల వ్యవస్థ మోదీ చెప్పుచేతల్లో పనిచేస్తోందని మండిపడ్డారు. స్వయం ప్రతిపత్తి సంస్థలన్నీ మోదీ గుప్పెట్లో ఉన్నాయన్నారు. దేశంలో పట్టపగలే ఓట్లు చోరీ అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల 13 కోట్ల ఓట్లు తొలగించారని ఆమె మండిపడ్డారు. ఇది దేశంలో సీఈసీ చేసిన అతిపెద్ద నేరమన్నారు. ఫాం-6, 7ను చట్టవిరుద్ధంగా మార్పులు చేశారన్నారు.


‘‘రాష్ట్రంలో పార్టీలు మోదీకి బినామీలుగా మారాయి. ఒకరిది బహిరంగ పొత్తు. మరొకరిది అక్రమ పొత్తు.’’ అని షర్మిల ఆరోపించారు. మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. 2029లో మోదీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని, ప్రజల్లో వ్యతిరేకత ఉందని గ్రహించి ఎన్నికల సంఘాన్ని బానిసగా చేసుకున్నారని విమర్శించారు. దొడ్డిదారిన ప్రభుత్వాల ఏర్పాటుకు జ్ఞానేశ్‌ను ఆ పదవిలో పెట్టారన్నారు. సీపీఎం నేత వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. సీఈసీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని అన్నారు. ఇది ప్రజా ఉద్యమమని, పార్టీలకు అతీతంగా ప్రజలు కదులుతున్నారని చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 04:52 AM