Share News

బీసీలకు 40 శాతం ఇద్దాం

ABN , Publish Date - Oct 12 , 2026 | 03:36 AM

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

బీసీలకు 40 శాతం ఇద్దాం

  • గొడ్డలి పార్టీ మూతపడేలా కూటమి గెలవాలి

  • తద్వారా ట్రిపుల్‌ ఇంజన్‌ సర్కారు రావాలి

  • ‘జనాభాలో సగం.. కూటమి ఇచ్చింది బలం’,

  • ‘జయహో బీసీ’ పేర్లతో రాష్ట్రవ్యాప్త ప్రచారం

  • క్యాడర్‌లో కసి పెరగాలి.. 2024 మించి ఓట్లు రావాలి

  • సమన్వయంతో మిత్రపక్షాలతో కలిసి ప్రచారం

  • విభేదాలకు, అపోహలకు తావివ్వొద్దు

  • కూటమిలో ఉన్నాం.. మిత్రధర్మం ముఖ్యం

  • విజయానికి పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలి

  • అధిష్ఠానాలు నిర్ణయించే అభ్యర్థులనే గెలిపించాలి

  • ఆషామాషీగా తీసుకోవద్దు.. శ్రేణులకు బాబు నిర్దేశం

  • వర్చువల్‌, టెలికాన్ఫరెన్స్‌లతో రోజంతా బిజీబిజీ

అమరావతి, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. చట్టబద్ధంగా వారికి 34 శాతం కోటా కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను, గత వైసీపీ ప్రభుత్వం బీసీలకు చేసిన అన్యాయాన్ని ప్రజలకు వివరించాలని టీడీపీ శ్రేణులను ఆదేశించారు. ‘జయహో బీసీ...!’, ‘జనాభాలో సగం-కూటమి ఇచ్చింది బలం’ పేరుతో రాష్ట్రవ్యాప్త ప్రచారం చేపట్టాలన్నారు. ఒకట్రెండు రోజుల్లో షెడ్యూల్‌ వెలువడనున్న నేపథ్యంలో ఆయన ఎన్నికల కసరత్తు ముమ్మరం చేశారు. ఆదివారం రోజంతా మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల పరిశీలకులు, ముఖ్య నేతలతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు.


తర్వాత మరోసారి.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, నేతలు, బూత్‌ కమిటీలు, గ్రామ స్థాయి కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు.. ప్రచారంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం.. ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడం.. రిజర్వేషన్ల వంటి విషయాలపై దిశానిర్దేశం చేశారు. గొడ్డలి పార్టీ ఇమేజ్‌ పడిపోయిందని, అందుకే స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఫేక్‌ ప్రచారం ముమ్మరం చేస్తోందన్నారు. దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆదేశించారు. గొడ్డలి పార్టీకి, అభివృద్ధి నిరోధకులకు, రౌడీలకు, రప్పా రప్పా టీంలకు గట్టిగా బుద్ధి చెప్పాలని పిలుపిచ్చారు. డబుల్‌ ఇంజన్‌ సర్కారుతో రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నామని.. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుతో ట్రిపుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు. ఆయా సందర్భాల్లో సీఎం ఇంకా ఏమన్నారంటే..

ఎవరికీ మినహాయింపు లేదు..

2024 ఎన్నికల కంటే మనకు ఎక్కువ శాతం ఓట్లు పడాలి. ఇదే నేతల పనితీరుకు కొలమానం. 50 రోజులు.. ఎవ్వరికీ మినహాయింపు లేదు.. గెలుపు, నిజాయితీ, సామ ర్థ్యం, సోషల్‌ రీ-ఇంజనీరింగ్‌ వంటి అంశాలను బేరీజు వేసుకునే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో నేతల పనితీరుపై రేటింగ్స్‌ ఇస్తాం. సక్రమంగా పనిచేయాలని అందరినీ కోరుతున్నా. ఆషామాషీగా తీసుకోవద్దు.

కోర్టులకు వెళ్లి అడ్డుకోవాలని..

బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకూడదని.. స్థానిక ఎన్నికలు జరక్కూడదని గొడ్డలి పార్టీ కోర్టులకు వెళ్లింది. 50 శాతం జనాభా ఉన్న బీసీలకు ఆ పార్టీ అన్యాయం చేయాలని భావించింది. బీసీల నాయకత్వాన్ని పెంచడానికి స్థానిక ఎన్నికలే వేదిక... అందుకే వారికి రిజర్వేషన్లు పెంచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేసింది. రాజీవ్‌ రంజన్‌ మిశ్రా కమిషన్‌ సిఫారసులను ఆమోదించి.. బీసీలకు వీలైనంత మేలు చేస్తున్నాం. స్థానిక ఎన్నికల్లో వారికి 34 శాతానికి మించి స్థానాలు ఇస్తామని ప్రకటించాం.. పార్టీపరంగా 40 శాతం వరకు ఇచ్చేలా కసరత్తు చేస్తున్నాం.


గెలిచేవారికే సీట్లు..

గెలిచే వారికే స్థానాలు కేటాయించాలి. పంతాలకు పోతే లక్ష్యం దెబ్బతింటుంది. అధిష్ఠానాలు నిర్ణయించిన కూటమి అభ్యర్థులను గెలిపించాలి. గొడ్డలి పార్టీ మూతపడేలా స్థానిక ఎన్నికల్లో కూటమి గెలుపు ఉండాలి. పై స్థాయిలో ఎలాంటి సమన్వయం ఉందో.. క్షేత్ర స్థాయిలో అలాగే ఉండాలి. విభేదాలకు, అపోహలకు తావివ్వొద్దు. కూటమిలో మిత్రధర్మం ముఖ్యం. జనసేన, బీజేపీలను కలుపుకొని వెళ్లాలి. ఆ పార్టీల నేతలతో నియోజకవర్గ, జిల్లా స్థాయుల్లో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. 2024 ఎన్నికల నాటి కంటే మరింత కసి మీలో పెరగాలి. స్థానిక ఎన్నికల్లో కూటమి కొట్టే దెబ్బతో గొడ్డలి పార్టీ శాశ్వతంగా మూత పడుతుంది. ఎమ్మెల్యేలంతా కార్యకర్తల మనోభావాలు గుర్తుంచుకుని కార్యక్రమాలు రూపొందించుకోవాలి.

రూ.లక్షల కోట్ల సంక్షేమం..

రాష్ట్రంలో సంక్షేమం కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశాం. అంతే మొత్తంలో అభివృద్ధి పనులు చేశాం. సూపర్‌ సిక్స్‌ హామీలను సూపర్‌ హిట్‌ చేశాం. చెత్త పన్ను రద్దు చేశాం.. చెత్తనూ తొలగించాం. చక్కటి రోడ్లు వేశాం. ఇరిగేషన్‌కు పూర్వ వైభవం తెచ్చాం. భోగాపురం విమానాశ్రయాన్ని పూర్తి చేశాం. వికేంద్రీకరణ విధానంలో ప్రతి ప్రాంతాన్నీ అభివృద్ధి చేస్తున్నాం. పల్లె పండుగకు రూ.11 వేల కోట్లు, జేజేఎం పనులకు రూ.30 వేల కోట్లతో శంకుస్థాపన చేశాం. 5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు చేపట్టాం. మరో 3 లక్షల ఇళ్లకు భూమిపూజ చేశాం. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.11,359 కోట్ల పనులు చేపట్టాం. ఇప్పటివరకు 16.48 లక్షల ఎకరాలను 22ఏ నుంచి తొలగించాం. విశాఖ, విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో రూ.52 వేల కోట్ల విలువైన ఆస్తిపై 60 వేల మందికి లబ్ధి చేకూరేలా పట్టాలిచ్చాం. సంక్షేమం అందించడంతోపాటు వ్యక్తిగత అవసరాలు తీరుస్తున్నాం.. సామాజిక అవసరాలు నెరవేరుస్తున్నాం. వ్యక్తి భద్రత, కుటుంబ సాధికారత, గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నాం. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇంటింటికీ వెళ్లి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరించాలి.


కూటమి బలం మరింత పెరగాలంటే స్థానిక ఎన్నికలే కీలకం. తటస్థులు మన సానుభూతిపరులుగా.. ప్రత్యర్థులు తటస్థులుగా మారేలా టీడీపీ శ్రేణులు పని చేయాలి.

బీసీలే టీడీపీకి వెన్నెముక. వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేసిన పార్టీ టీడీపీ ఒక్కటే. వారికి వైసీపీ చేసిన అన్యాయం, మనం చేసిన న్యాయం ఏమిటో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి.

ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం కాబట్టి ప్రజలను ఓటు అడిగే హక్కు మనకే ఉంది. చేసిన మంచిని వివరించి ఓట్లు వేయించుకోవాలి. ఏ ఎన్నిక పెట్టినా మనమే గెలవాలి.. గెలుస్తాం. - సీఎం చంద్రబాబు

  • ఈడీని మనమే పంపామట!

వివేకా హత్యలో అంతిమ లబ్ధిదారు జగనే: సీఎం

అక్రమంగా ఆస్తులు సంపాదించుకున్న జగన్‌.. మనపై ఆరోపణలు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అంతిమ లబ్ధిదారు జగన్‌ అయితే.. కత్తి నా చేతిలో పెట్టి ప్రజలను మభ్యపెట్టారు. ఇప్పుడు ఈడీని మనమే పంపామని గొడ్డలి పార్టీ అంటోంది.. లేనిపోని దుష్ప్రచారాలు ఆ పార్టీకి అలవాటే..! జగన్‌ వల్ల ఎంతో మంది ఐఏఎ్‌సలు, ఐపీఎ్‌సలు, వ్యాపారస్తులు జైళ్లకు వెళ్లారు’ అని గుర్తుచేశారు.

  • డోలీ మోతలకు చరమగీతం

పవన్‌కు చంద్రబాబు అభినందనలు

గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించి, డోలీ మోతలకు చరమగీతం పాడేలా అడవితల్లి బాట కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్‌కు సీఎం చంద్రబాబు ‘ఎక్స్‌’లో అభినందనలు తెలిపారు. ఇది గిరిజనుల కష్టాలకు విముక్తి, అత్యవసర వైద్యసేవలకు భరోసా అని తెలిపారు. ప్రతి గిరిజన గూడెం రహదారితో అనుసంధానమై అభివృద్ధి ఫలాలను అందుకునేలా సాగుతున్న ఈ మహత్తర యజ్ఞం మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నానని పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి...

నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

Updated Date - Oct 12 , 2026 | 03:37 AM