Year Ender 2025: అజారుద్దీన్‌కు కలిసొచ్చిన 2025.. వరించిన మంత్రి పదవి
ABN , Publish Date - Dec 31 , 2025 | 05:12 PM
2025లో మంత్రివర్గ విస్తరణలో భాగంగా మైనార్టీ కోటాలో మహమ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి లభించడం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మైనార్టీ వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
2025 సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలకు వేదికగా నిలిచింది. ఈ ఏడాది రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న ముఖ్యమైన పరిణామాల్లో మహమ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కడం. రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై ఏఐసీసీలో చాలా రోజులుగా తీవ్ర కసరత్తు జరిగింది. చివరకు మైనార్టీ కోటాలో అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. మైనార్టీ కోటాలో ఆయనకు మంత్రి పదవి లభించడం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మైనార్టీ వర్గాలకు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
మంత్రివర్గ విస్తరణ..
రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు ఏఐసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం.. హైకమాండ్ నిర్ణయంతో మహమ్మద్ అజారుద్దీన్‌కు అవకాశం లభించడం వెను వెంటనే జరిగిపోయాయి. మైనార్టీ వర్గాలకు ప్రాతినిధ్యం పెంచాలనే లక్ష్యంతోనే ఆయన పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్న మాట.
మంత్రిగా ప్రమాణ స్వీకారం
ఇక అక్టోబర్ 31న మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నేతలు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారంతో అజారుద్దీన్ అధికారికంగా మంత్రి బాధ్యతలు చేపట్టారు.
రెండు కీలక శాఖలు కేటాయింపు
మంత్రి పదవి లభించిన వెంటనే అజారుద్దీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రెండు కీలకమైన శాఖలు కేటాయించింది. మైనార్టీల సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలను కేటాయించింది సర్కార్. మైనార్టీ విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారతకు సంబంధించిన పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలనే బాధ్యత ఆయన భుజాలపై పడింది. అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు మెరుగుపర్చడం, నష్టాల్లో ఉన్న సంస్థలను గాడిలో పెట్టడం వంటి కీలక బాధ్యతలు కూడా అజారుద్దీన్‌కు ప్రభుత్వం అప్పగించింది. అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కడంతో మైనార్టీ వర్గాల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.
పాలనపై ఫోకస్..
మంత్రి పదవి చేపట్టిన వెంటనే శాఖల పనితీరుపై అజారుద్దీన్ దృష్టి సారించారు. మైనార్టీ సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, ప్రభుత్వ రంగ సంస్థల పనితీరులో సమర్థత తీసుకురావడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి 2025 సంవత్సరంలో మహమ్మద్ అజారుద్దీన్‌కు మంత్రి పదవి దక్కడం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా బలాన్ని చేకూర్చిన అంశంగా మారిందనే చెప్పొచ్చు. మైనార్టీ వర్గాల్లో పార్టీకి మరింత పట్టు పెరగడానికి ఈ నిర్ణయం ఉపయోగపడిందని భావించవచ్చు.