2025 Scientific Breakthroughs: ఈ ఏడాది శాస్త్రసాంకేతిక రంగాల్లో అద్భుతాలు.. ఆశ్చర్యపోవాల్సిందే.
ABN , Publish Date - Dec 31 , 2025 | 09:47 AM
ఈ ఏడాది శాస్త్రసాంకేతిక ప్రపంచంలో అనేక అద్భుతాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. కొత్త సంవత్సరంలో కాలుపెట్టనున్న తరుణంలో అవేంటో ఒకసారి నెమరేసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది శాస్త్రసాంకేతిక రంగాలు ఎంతో పురోగతి సాధించాయి. శాస్త్రజ్ఞులు ఎన్నో కొత్త విషయాలను కనుగొన్నారు. వైద్యరంగం మొదలు, ఖగోళ శాస్త్రం వరకూ ఈ ఏడాది ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చి మానవాళిని ఆశ్చర్యానికి గురిచేశాయి. మరి కొత్త సంవత్సరంలో కాలు పెడుతున్న తరుణంలో అవేంటో ఓ లుక్కేద్దాం (Scientific Breakthroughs and Discoveries in 2025).
కొత్త రంగు
మనుషుల కళ్లల్లోని కొన్ని కోన్ కణాలను ప్రేరేపించడం ద్వారా శాస్త్రవేత్తలు ఓ కొత్త రంగును చూసిన అనుభూతిని కలిగించారు. ఇప్పటివరకూ కేవలం ఐదుగురు మాత్రమే ఈ రంగును చూసిన అనుభూతిని పొందారు. శాస్త్రవేత్తలు దీన్ని ఓలో రంగు అని పిలుస్తున్నారు. ఇది నెమలిలో కనిపించిన నీలి రంగును పోలి ఉంటుందట.
ప్రకృతిలో వింత
సాధారణంగా జంతువులు ఆహారం కోసం ఇతర జీవాలపై ఆధారపడతాయి. మొక్కలేమో కిరణజన్య సంయోగక్రియ ద్వారా తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. అయితే, మొలస్కా వర్గానికి చెందిన ఎలీసియా క్లోరోటికా అనే సముద్రపు జీవి (సీ స్లగ్).. ఆల్గే (శైవలాలు) నుంచి క్లోరోప్లాస్ట్‌లను తన శరీరంలో తాత్కాలికంగా నిల్వ చేసుకుని, కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యాన్ని సంతరించుకుంటున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని వల్ల ఆ జీవి శరీరం ఆకుపచ్చ రంగులోకి మారుతుందని తెలిపారు. జంతువులు, మొక్కల మధ్య ఉన్న స్పష్టమైన విభజనకు సవాలు విసిరేలా ఉన్న ఈ వింత అంశం శాస్త్ర ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
బంగాళదుంప, టమాటాల మూలాల వెలికితీత
బంగాళదుంపల గురించి దాదాపు అందరికీ తెలిసిందే. టమాటాలు కూడా అందరికీ పరిచయమే. అయితే, పురాతన కాలంలోని ఒక పూర్వ జాతి నుంచి బంగాళదుంపలు, టమాటాలు వేర్వేరు జాతులుగా పరిణామం చెందినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. పూర్తిగా భిన్నంగా కనిపించే ఈ రెండింటికీ ఒకే మూలం ఉండటం శాస్త్ర ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
పర్సనలైజ్డ్ జీన్ థెరపీ
ఈ ఏడాది వైద్య రంగంలో ఆసక్తి రేపిన అంశాల్లో పర్సనలైజ్డ్ జీన్ థెరపీ ఒకటి. ఇందులో వ్యక్తుల జన్యు క్రమాలకు అనుగుణంగా ప్రత్యేక జన్యు చికిత్సను రూపొందిస్తారు. బేబీ కేజీ అనే పేషెంట్ ఈ విధానంలో ఓ అరుదైన జన్యు వ్యాధికి చికిత్స తీసుకున్నారు. పర్సనలైజ్డ్ జీన్ థెరపీకి సంబంధించి ఇదో కీలక మైలురాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మానవ పరిణామక్రమం.. వెలుగులోకి కొత్త విషయం
మానవ పరిణామక్రమం గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఆధునిక మానవుల రాకకు మునుపు మనిషిని పోలిన అనేక జాతులు కాలగర్భంలో కలిసిపోయాయి. వాటిలో డెనిసోవన్స్ కూడా ఒకటి. అయితే, ఈ జాతి ఉనికిపై శాస్త్ర ప్రపంచంలోనే అనేక సందేహాలు ఉన్నాయి. వీటికి సమాధానంగా డెనిసోవన్ జాతికి చెందిన ఓ జీవి పుర్రెను శాస్త్రవేత్తలు చైనాలో కనుగొన్నారు.
100 ఏళ్ల పాటు నిలిచుండే బ్యాటరీ
సాధారణ బ్యాటరీలు కొద్ది రోజులకే ఖాళీ అవుతాయి. అయితే, దాదాపు 100 ఏళ్ల పాటు పనిచేసేలా కార్బన్-14 అనే మూలకం ఆధారంగా చైనా ప్రయోగాత్మక న్యూక్లియర్ బ్యాటరీని అభివృద్ధి చేసింది.
క్వాంటమ్ కంప్యూటింగ్
క్వాంటమ్ కంప్యూటింగ్‌లో మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది కీలక పురోగతి సాధించింది. ప్రపంచంలోనే మొదటిసారిగా టోపోలాజికల్ ఆర్కిటెక్చర్ ఆధారంగా మెజొరానా1 అనే క్వాంటమ్ చిప్‌ను డిజైన్ చేసింది.
ఈ ఏడాది జేమ్స్ వెబ్ టెలిస్కోప్ మరో కొత్త అద్భుతాన్ని ఆవిష్కరించింది. ఎమ్ఓఎమ్-జెడ్14 అనే ఓ కొత్త పాలపుంతను కనుగొన్నది. ఇప్పటివరకూ మానవాళికి తెలిసిన పాలపుంతల్లో భూమికి అత్యంత సుదూరాన ఉన్నది ఇదే కావడం గమనార్హం.
శనిగ్రహానికి చుట్టు తిరిగే 128 కొత్త ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. దీంతో, శనిగ్రహానికి చెందిన శాటిలైట్స్ సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యి 274కు చేరుకుంది.
అవయవ మార్పిడికి సంబంధించి వైద్య రంగంలో మరో కీలక పురోగతి చోటుచేసుకుంది. ఈ ఏడాది శాస్త్రవేత్తలు పూర్తిస్థాయి పనితీరు కలిగిన గుండె, గర్భసంచీకి చెందిన కణజాలాలను ప్రయోగశాలలో రూపొందించగలిగారు.
ఈ విశ్వంలో మన సౌర కుటుంబం లాంటి వ్యవస్థల ఆరు వేలకు పైనేనని నానా తాజాగా ప్రకటించింది. మానవాళి కంట పడని ఇలాంటివి ఇంకా వేల సంఖ్యలోనే ఉన్నాయని తెలిపింది.
నగరీకరణ ప్రభావం జంతుజాలంపైనా స్పష్టంగా కనిపిస్తోంది. పావురాళ్లు, ఎలకలు వంటి జీవులు జనావాసాల మధ్య నివసిస్తూ అక్కడి పరిస్థితులకు అనుగుణంగా తమ ప్రవర్తనను మార్చుకుంటున్నాయి. ట్రాఫిక్ శబ్దం, వాహనాల కదలిక వంటి సంకేతాలకు స్పందిస్తూ ప్రమాదాలను తప్పించుకునేలా అవి అలవాటు పడుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తరహా నగర వాతావరణ సంకేతాలను ఉపయోగించుకుని, ఇటీవల ఓ డేగ తన వేట తీరును మార్చుకున్న వైనం శాస్త్రవేత్తలనూ ఆశ్చర్యపరిచింది.
ఇవీ చదవండి:
అంతరిక్ష రంగం.. ఇస్రో సారథ్యంలో భారత్‌కు అద్భుత విజయాలు
ఇది ఏఐ నామ సంవత్సరం.. ఆశ్చర్యం కలిగించే మార్పులు