Share News

Year Ender 2025: తెలంగాణలో 2025 ఘోర ప్రమాదాలు.. తీరని విషాదాలు

ABN , Publish Date - Dec 31 , 2025 | 02:23 PM

2025లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రమాదాల్లో చాలా మంది మృతి చెందారు. ఈ సంవత్సరం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

Year Ender 2025: తెలంగాణలో 2025 ఘోర ప్రమాదాలు.. తీరని విషాదాలు
Year Ender 2025

తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సరం అనేక విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఘోర రోడ్డు ప్రమాదాలు, భారీ అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన వారు మృత్యువాత పడ్డారు. వలస కూలీలు, ప్రయాణికులు, ఉద్యోగులు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుని ప్రాణాలు విడిచారు. ఈ ఏడాది ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. 2025లో జరిగిన ప్రమాదాలు, విషాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


టన్నెల్‌లో ప్రమాదం

slbc-tunnel.jpg

ఫిబ్రవరి 22న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంలో ఎనిమిది మంది ఉద్యోగులు, సిబ్బంది చనిపోయారు. SLBC ప్రాజెక్టులో భాగంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం దోమలపెంట వద్ద ఎస్సెల్బీసీ టన్నెల్‌ పనుల్లో 14 కిలోమీటర్‌ వద్ద పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంతో ప్రమాదం జరిగింది.


అగ్నిప్రమాదంలో కుటుంబం సజీవ దహనం

gujar-house.jpg

హైదరాబాద్ పాతబస్తీలోని గుల్జార్‌హౌజ్ అగ్ని ప్రమాదం కూడా పెద్ద ప్రమాదమనే చెప్పుకోవాలి. మార్చి 18న జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది సజీవదహనం అయ్యారు. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో దట్టమైన పొగ వ్యాపించి ఊపరాడక మరణించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రమాదం యావత్ తెలంగాణ ప్రజలను షాక్‌కు గురయ్యేలా చేసింది.


పరిశ్రమలో పేలుడు.. 54 మంది మృతి

sigachi.jpg

సిగాచి ఇండస్ట్రీస్‌‌లో జరిగిన ప్రమాదం తెలంగాణలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా యూనిట్‌లో రియాక్టర్ పేలడంతో దాదాపు 54 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో మంటలు చెలరేగి... పలువురు కార్మికులు ఆ మంటల్లోనే సజీవదహనం అయ్యారు. కొంత మంది మృతదేహాలు కూడా లభ్యంకాని పరిస్థితి. తమ వారి డెబ్‌బాడీస్ కోసం కుటుంబసభ్యులు చాలా రోజులు ఎదురు చూసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ పేలుడులో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది.


చేవెళ్ల ప్రమాదం.. తీవ్ర విషాదం

chevella-incident-1.jpg

ఇక చేవెళ్ల బస్సు ప్రమాద ఘటన ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టేలా చేసింది. నవంబర్ 3న రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. కంకర మొత్తం బస్సులో పడిపోవడంతో అందులో ఇరుక్కుని ఊపిరాడక అనేక మంది చనిపోయారు. ఇక ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. అంతే కాకుండా మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో కుటుంబాల్లో ఈ సంవత్సరం పెను విషాదాన్ని మూటగట్టింది.

Updated Date - Dec 31 , 2025 | 03:23 PM