Share News

విరిగిన పాలు జున్నులా తినొచ్చా..

ABN , Publish Date - Jul 20 , 2025 | 11:49 AM

పాలు సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయనప్పుడు, లేదా ఎక్కువ కాలం నిల్వ ఉన్నప్పుడు దానిలో స్వతహాగా ఉండే సూక్ష్మజీవులు కొన్ని రకాల ఆమ్లాలను (ఆసిడ్‌) తయారు చేస్తాయి. ఈ ఆమ్లాలతో పాటు వేడిచేసినప్పుడు పాలలో ఉండే ప్రొటీన్లలో జరిగే మార్పుల వలన పాలు విరగడం (లేదా పగలడం) జరుగుతుంది. పాలను వేడి చేయకముందే వాటి రంగు, వాసనలో తేడా వస్తే, వాటిని వాడకపోవడమే మంచిది. ఎక్కువ కాలం నిల్వ లేవు, వాసనలో కూడా మార్పు లేదు అనుకున్నప్పుడు... కాచిన పాలు విరిగితే దానిని కొంతమంది జున్నులా లేదా పనీర్‌లా వాడతారు.

విరిగిన పాలు జున్నులా తినొచ్చా..

విరిగిన పాలను జున్నులాగా కొందరు తింటుంటారు. విరిగిన పాలు పాడైనట్టు కాదా? ఇలా జున్నులా చేసుకొని తింటే ఇబ్బందేమీ ఉండదా?

- రజిత, హైదరాబాద్‌

పాలు సరైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయనప్పుడు, లేదా ఎక్కువ కాలం నిల్వ ఉన్నప్పుడు దానిలో స్వతహాగా ఉండే సూక్ష్మజీవులు కొన్ని రకాల ఆమ్లాలను (ఆసిడ్‌) తయారు చేస్తాయి. ఈ ఆమ్లాలతో పాటు వేడిచేసినప్పుడు పాలలో ఉండే ప్రొటీన్లలో జరిగే మార్పుల వలన పాలు విరగడం (లేదా పగలడం) జరుగుతుంది. పాలను వేడి చేయకముందే వాటి రంగు, వాసనలో తేడా వస్తే, వాటిని వాడకపోవడమే మంచిది. ఎక్కువ కాలం నిల్వ లేవు, వాసనలో కూడా మార్పు లేదు అనుకున్నప్పుడు... కాచిన పాలు విరిగితే దానిని కొంతమంది జున్నులా లేదా పనీర్‌లా వాడతారు. జున్నులా తయారు చేసినప్పుడు అందులో రుచికొరకు చక్కెర లేదా బెల్లం వంటివి చేరిస్తే క్యాలరీలను కూడా చేర్చినట్టే. అలాకాకుండా వడకట్టి ఆ పనీర్‌ను కూరలాగా, ఆ నీటితో సూప్‌ లేదా చారు వంటివి తయారు చేసుకోవచ్చు. పూర్తిగా మరిగేలా వేడిచేయడం వలన వాటిలో సూక్ష్మజీవులు నశిస్తాయి కాబట్టి... విరిగిన పాలను తీసుకొంటే సాధారణంగా ప్రమాద మేమీ ఉండదు. కానీ రుచిలో తేడా వస్తే మాత్రం వాడొద్దు.


పచ్చి బొప్పాయి తినడం, దాని రసం తాగడం వలన ఏవైనా ఉపయోగాలున్నాయా?

- మహేందర్‌, కరీంనగర్‌

book7.2.jpg

పచ్చి బొప్పాయిని సలాడ్లలో, ఉడికించి సూప్స్‌, కూరల తయారీ లోనూ వాడతారు. బొప్పాయిలో పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, ఫోలేట్‌, విటమిన్‌ సి, విటమిన్‌ ఏ వంటి ముఖ్యమైన పోషకాలుంటాయి. పండిన బొప్పాయితో పోలిస్తే పచ్చిబొప్పాయిలో పిండి పదార్థాలు తక్కువగా, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి. పచ్చిగా ఉన్నప్పుడు చక్కెర శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి కూరగాయల్లాగే క్యాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. బరువు నియంత్రణలో ఉంచేందుకు, రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంచేందుకు కూడా పచ్చి బొప్పాయి పనికొస్తుంది. బొప్పాయి పాలలో ఉండే లేటెక్స్‌ అనే పదార్థం వల్ల... లేటెక్స్‌ అలర్జీ ఉన్నవారు పచ్చి బొప్పాయిని, బొప్పాయి రసాన్ని తీసుకోకూడదు. పచ్చి బొప్పాయిలో ఉండే పపైన్‌ వల్ల ఎక్కువగా తీసుకొంటే ఆహార నాళం (esophagus), జీర్ణాశయ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పచ్చి బొప్పాయిని తక్కువ మొత్తంలో సలాడ్లలో చేర్చుకోవడం, ఉప్పు, కారం, నిమ్మరసం లేదా వెనిగర్‌ చేర్చి చట్నీలా తీసుకోవడం వల్ల ఇబ్బందులుండవు. జ్యూస్‌లా తీసుకుంటే ప్రత్యేకంగా ఉపయోగాలేమీ ఉండవు. పైగా లేటెక్స్‌, పపైన్‌ అధికంగా తీసుకొనే అవకాశం ఉంటుంది కాబట్టి... పచ్చి బొప్పాయి జ్యూస్‌ బదులు కూరల్లో లేదా ఉడికించి వాడుకోవడం అన్నిటికన్నా సురక్షితం.


సేటాన్‌ (Seitan) ప్రొటీన్‌ అని ఈ మధ్య కొత్తగా వింటున్నాం. దీని వివరాలు తెలపండి.

- అనసూయ, విశాఖపట్టణం

గోధుమలలో ఉండే గ్లయిడిన్‌, గ్లూటెనిన్‌ ఇంకొన్ని ప్రొటీన్లన్నింటిని కలిపి ‘గ్లూటెన్‌’ అంటారు. ఈ గ్లూటెన్‌ను గోధుమలలో ఉండే పీచు, పిండి పదార్థాల నుంచి విడదీసి చేసే పదార్థమే ‘సేటాన్‌’. దీనిని వండినప్పుడు మాంసంలాగా ఉండడం వల్ల... మాంసానికి ప్రత్యామ్నాయంగా వాడొచ్చు. సేటాన్‌లో ప్రోటీన్‌ పరిమాణం అధికంగా ఉన్నప్పటికీ మన శరీరానికి అవసరమయ్యే ఆవశ్యక ఎమినో ఆమ్లాలన్నీ (essential amino acids) దీనిలో ఉండవు. అందుకే దీనికి పరిపూర్ణ ప్రొటీన్‌ (complete protein)గా ఉపయోగించుకునేందుకు ఏవైనా పప్పుధాన్యాలతో కూడిన ఆహారంతో తీసుకొంటే ప్రయోజనం ఎక్కువ. సేటాన్‌ అందరూ వాడొచ్చు. కానీ గోధుమల ఎలర్జీ ఉన్నవారు, గ్లూటెన్‌ ఇంటాలరెన్స్‌ ఉన్నవారు, సీలియాక్‌ సమస్య ఉన్నవారు లేదా కొన్ని రకాల ఇన్ఫ్లేమేషన్‌ సంశయాలు ఉన్నవారు... అన్ని రకాల గోధుమల్లాగే సేటాన్‌కూ దూరముండాలి. ఈ సమస్యలు ఏవీ లేనివారు, అన్ని వయసుల వారు నిశ్చింతగా సేటాన్‌తో చేసిన పదార్థాలు తినొచ్చు.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ లక్ష దాటేసిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆధార్‌లో సమూల మార్పులు

Read Latest Telangana News and National News

Updated Date - Jul 20 , 2025 | 11:49 AM