Housing Scheme: ఇందిరమ్మ ఇంటి బిల్లు రాలేదని ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Jul 16 , 2025 | 05:43 AM
ఇందిరమ్మ ఇంటి పథకం బిల్లులు రాలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు.
మాసాయిపేట, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇంటి పథకం బిల్లులు రాలేదని మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. మెదక్ జిల్లా మాసాయిపేటలో మంగళవారం ఈ ఘటన జరిగింది. మాసాయిపేట దళిత కాలనీకి చెందిన ఎర్ర నర్సింహులు పెయింటింగ్ పనులు చేస్తుంటాడు. తానుండే పూరి గుడిసె తీసేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టాడు. పునాదుల వరకు నిర్మాణ పనులు పూర్తి చేశాడు. అయితే, ఆ పనులకు సంబంధించిన బిల్లులు మంజూరు కాకపోవడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. నర్సింహులు నిబంధనల ప్రకారం ఇంటి నిర్మాణం చేపట్టకపోవడంతోనే బిల్లులు ఆగినట్టు తెలిసింది. అయితే, తీవ్ర మనస్తాపం చెందిన నర్సింహులు పెయింటింగ్ ఆయిల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో అతని శరీరం, కాళ్లు కొంతమేర కాలిపోయాయి. గమనించిన కుటుంబసభ్యులు మంటలు ఆర్పి అతనిని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులను సంప్రదించగా తాము నిబంధనల ప్రకారం ఇందిరమ్మ ఇంటి బిల్లులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.