Share News

Pedda Amberpet: సబ్‌ రిజిస్ట్రార్‌పై యువకుడి దాడి

ABN , Publish Date - May 06 , 2025 | 06:01 AM

పెద్దఅంబర్‌పేట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌పై ఓ యువకుడు దాడి చేశాడు. ఓ డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో సబ్‌రిజిస్ట్రార్‌తో వాగ్వాదానికి దిగి ఆయన విచారణ జరిపిస్తానని చెబుతుండగానే ఆయన చెంపపై కొట్టాడు.

Pedda Amberpet: సబ్‌ రిజిస్ట్రార్‌పై యువకుడి దాడి

  • రిజిస్ట్రేషన్‌ విషయంలో వాగ్వాదం.. చెంపపై దెబ్బ

  • పెద్దఅంబర్‌పేట్‌లో ఘటన.. యువకుడిపై కేసు నమోదు

హైదరాబాద్‌/ హయత్‌నగర్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): పెద్దఅంబర్‌పేట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌పై ఓ యువకుడు దాడి చేశాడు. ఓ డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ వ్యవహారంలో సబ్‌రిజిస్ట్రార్‌తో వాగ్వాదానికి దిగి ఆయన విచారణ జరిపిస్తానని చెబుతుండగానే ఆయన చెంపపై కొట్టాడు. పెద్దఅంబర్‌పేట్‌కు చెందిన పి. శ్రీనివాస్‌ సోమవారం స్థానిక సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లాడు. సబ్‌రిజిస్ట్రార్‌ రవీంద్రనాయక్‌ వద్దకు వెళ్లి డాక్యుమెంట్‌ డబుల్‌ రిజిస్ట్రేషన్‌లపై మాట్లాడాడు. సర్వే నం.154లో తాను 2012లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న ప్లాటు డాక్యుమెంటును మళ్లీ 2025 జనవరిలో ఎందుకు రెలింక్వి్‌షమెంట్‌ చేశారంటూ శ్రీనివాస్‌ సబ్‌రిజిస్ట్రార్‌తో వాగ్వాదానికి దిగాడు. లీగల్‌గా పరిశీలించే రెలింక్వి్‌షమెంట్‌ డీడ్‌ చేశానని సబ్‌ రిజిస్ట్రార్‌ చెబుతుండగానే కోపంతో శ్రీనివాస్‌ ఆయన చెంపపై కొట్టాడు. వెంటనే అక్కడున్న వారు వారిద్దరినీ సముదాయించారు. డాక్యుమెంట్‌పై విచారణ జరుపుతానని చెబుతుండగానే తనపై శ్రీనివాస్‌ దాడి చేశాడని సబ్‌రిజిస్ట్రార్‌ రవీంద్రనాయక్‌ తెలిపారు. ఏదైనా తప్పు జరిగితే జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయాలే తప్ప దాడి చేస్తారా అని ప్రశ్నించారు. సబ్‌ రిజిస్ట్రార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీనివా్‌సపై కేసు నమోదు చేశారు.


సబ్‌రిజిస్ట్రార్‌పై దాడి హేయం: టీజీవో

విధి నిర్వహణలో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌పై దాడి చేయడం హేయమైన చర్య అని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం (టీజీవో) పేర్కొంది. ఈ దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ సంస్థ అధ్యక్షుడు ఏలూరి శ్రీనివా్‌సరావు, ప్రధానకార్యదర్శి సత్యానారాయణ, సహాధ్యక్షుడు బ్యాగరి శ్యామ్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ విధివిధానాల ప్రకారం పనిచేస్తారని, ఏదైనా సమస్య ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి కాని భౌతిక దాడులకు పాల్పడటం సరికాదని అన్నారు. దాడి చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

Updated Date - May 06 , 2025 | 06:01 AM