Share News

girl's education: ఆధార్‌ ఇప్పిస్తే ఈ చిన్నారి చదువుకుంటుంది!

ABN , Publish Date - Mar 06 , 2025 | 05:02 AM

పుస్తకాల సంచీ భుజానేసుకొని తమ గుడిసె ముందు నుంచి వెళ్లే తన ఈడు పిల్లల్ని చూస్తూ ‘నేను కూడా ఇలా స్కూలుకు వెళితే బాగుండు’ అనుకుంటుంది. అయినా వెళ్లలేకపోతోంది. నిబంధనల పేరుతో అధికారులు, టీచర్లే చదువుపై చిన్నారికి ఉన్న ఆసక్తిని చిదిమేస్తున్నారు.

girl's education: ఆధార్‌ ఇప్పిస్తే ఈ చిన్నారి చదువుకుంటుంది!

జనన ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో

పాఠశాలలో పేరు తొలగింపు

ఆ పత్రం కోసం వెళితే ఆస్పత్రి నుంచి

సర్టిఫికెట్‌ తేవాలంటున్నారు

పాప ఇంట్లో పుట్టింది.. వివరాలేమీ

లేవంటున్న తల్లిదండ్రులు

హైదరాబాద్‌ సనత్‌నగర్‌లోని బస్తీలో

నిరుపేద చదువుల తల్లికి పెద్ద కష్టం

హైదరాబాద్‌ సిటీ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఆ బాలికకూ చదువుకోవాలని ఉంది. రోజూ బడికి వెళ్లాలని ఉంది. యూనిఫాం ధరించి.. పుస్తకాల సంచీ భుజానేసుకొని తమ గుడిసె ముందు నుంచి వెళ్లే తన ఈడు పిల్లల్ని చూస్తూ ‘నేను కూడా ఇలా స్కూలుకు వెళితే బాగుండు’ అనుకుంటుంది. అయినా వెళ్లలేకపోతోంది. నిబంధనల పేరుతో అధికారులు, టీచర్లే చదువుపై చిన్నారికి ఉన్న ఆసక్తిని చిదిమేస్తున్నారు. అయినా చదువుపై ఆ చిన్నారికి ఎంతో అనురక్తి ఉంది. చెత్తలో ఓ పుస్తకం దొరికితే.. అందులో అక్షరాలు దిద్దుతోంది! ఈ పాప పేరు మల్లెల శ్రీవిద్య. వయసు ఎనిమిదేళ్లు. సనత్‌నగర్‌ దాసారం బస్తీలో రెక్కల కష్టమ్మీద బతికే అశోక్‌, మమత దంపతుల బిడ్డ. ఏడాది క్రితం స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో శ్రీవిద్యను చేర్పించారు. ఆమెకు బర్త్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌ లేదంటూ ఆ స్కూలు నిర్వాహకులు శ్రీవిద్యను బడికి పంపొద్దని తల్లిదండ్రులకు చెప్పారు. ఫలితంగా పాప ఇంటి వద్దే ఉంటోంది. పాపకు తాము బర్త్‌ సర్టిఫికెట్‌ తీసుకోలేదని తల్లి మమత చెప్పింది. బర్త్‌ సర్టిఫికెట్‌ కావాలని అధికారులను సంప్రదిస్తే.. పాప ఏ తారీఖున పుట్టిందనే వివరాలతో ఆస్పత్రి వారు ఇచ్చిన పత్రం తేవాలంటున్నారని.. పాప ఇంట్లోనే పుడితే ఆ పత్రం తామెక్కడి నుంచి తేవాలి? అని ఆవేదన వ్యక్తం చేసింది. జనన ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో పాపకు ఆధార్‌ కార్డు కూడా ఇవ్వడం లేదని చెప్పింది. రూ.10వేలు సర్దుబాటు చేస్తే అన్ని పత్రాలూ సిద్ధం చేస్తామని కొందరు చెబుతున్నారని.. అంతడబ్బు తమ దగ్గర లేదని మమత వాపోయింది. అధికారులు స్పందించి శ్రీవిద్యకు బర్త్‌ సర్టిఫికెట్‌, ఆధార్‌ కార్డు ఇప్పించాలని చేతులు జోడిస్తోంది.


ఇవి కూడా చదవండి

Uttarakhand: ఉత్తరాఖండ్ ఘటనలో నలుగురు మృత్యువాత.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

Parvesh Verma: తీహార్ నుంచి ఇక ఆయన తిరిగి రాకపోవచ్చు.. కేజ్రీవాల్‌ అవినీతిపై పర్వేష్ వర్మ

Congress: కేరళ కాంగ్రెస్‌ నేతల భేటీకి థరూర్‌

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 06 , 2025 | 07:38 AM