Share News

Yadagirigutta: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచే

ABN , Publish Date - Mar 01 , 2025 | 05:03 AM

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధానాలయానికి స్వర్ణ విమాన గోపురం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు మరింత శోభను సంతరించుకోనున్నాయి.

Yadagirigutta: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుంచే

యాదాద్రి, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధానాలయానికి స్వర్ణ విమాన గోపురం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు మరింత శోభను సంతరించుకోనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వస్తివాచనం, అంకురారోపణం జరగనున్నాయి. ఆదివారం నుంచి 6వ తేదీ వరకు వరుసగా ధ్వజారోహణం, దేవతాహ్వానం, వేదపారాయణ, హవన, అలంకార సేవలు జరుగుతాయి. 7న ఎదుర్కోలు, 8న లక్ష్మీనరసింహస్వామి తిరు కల్యాణోత్సవం, 9న దివ్య విమాన రథోత్సవం, 10న శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవం, 11న శతఘటాభిషేకం, శృంగారడోలోత్సవం, ఉత్సవ సమాప్తి కార్యక్రమాలు ఉంటాయి.


బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రధానాలయాన్ని, ఆలయ మండపాలను, ముఖద్వారాలను, గోపురాన్ని విద్యుద్దీపాలు, వివిధ రకాల పూలమాలలు, అరటి, మామిడి తోరణాలతో అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 8న తిరుకల్యాణ మహోత్సవానికి ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వామివారిని దర్శించుకొని.. స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని, బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కొండపైకి వాహనాలను ఉచితంగా అనుమతించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఆలయ ఈవో ఏపూరి భాస్కర్‌రావు వెల్లడించారు.

Updated Date - Mar 01 , 2025 | 09:59 AM