Nalgonda: ప్రభుత్వ ఉద్యోగం కోసం భర్తను హత్య చేసిన భార్య
ABN , Publish Date - Mar 12 , 2025 | 05:12 AM
ప్రభుత్వ ఉద్యోగం కోసం కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. ఈ ఘటన నల్లగొండలోని ఉస్మాన్‌పురాలో గత నెల 24న జరిగింది. ఈ కేసును ఛేదించిన పోలీసులు వివరాలను మంగళవారం వెల్లడించారు.

నల్లగొండలో ఘటన.. పోలీసుల అదుపులో నిందితురాలు
నల్లగొండ క్రైం, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగం కోసం కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. ఈ ఘటన నల్లగొండలోని ఉస్మాన్‌పురాలో గత నెల 24న జరిగింది. ఈ కేసును ఛేదించిన పోలీసులు వివరాలను మంగళవారం వెల్లడించారు. నల్లగొండ ఉస్మాన్‌పురంలో నివసిస్తున్న మహ్మద్ ఖలీల్ హుస్సేన్ (44) కనగల్ మండలం చర్లగౌరారం జడ్పీ ఉన్నత పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్నారు. హుస్సేన్ మానసికంగా ఇబ్బందులు పడుతుండడంతో వైద్యుడిని సంప్రదించి మందులు వాడుతున్నారు. హుస్సేన్ చనిపోతే ఉద్యోగం తనకుగాని, పిల్లలకు గాని వస్తుందని ఎలాగైనా అతడిని హతమార్చాలని నిశ్చయించుకున్న ఆయన భార్య అక్సర్ జాహా గత నెల 22న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఖురాన్ గ్రంథం పెట్టే స్టాండ్‌తో ఆయన్ను బలంగా కొట్టింది.
అనంతరం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి నామమాత్రంగా చికిత్స చేయించి ఇంటికి తీసుకెళ్లింది. అదే రోజు రాత్రి పరిస్థితి విషమించడంతో హుస్సేన్‌ను నల్లగొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు చెప్పారు. ఈ ఘటనపై అనుమానం ఉందని ఫిబ్రవరి 25న హుస్సేన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేసిన పోలీసులు హుస్సేన్ భార్య అక్సర్ జాహానే ఆయన్ను చంపినట్లు నిర్ధారించారు. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.