Wife Murders Husband: భర్తను చంపి శవాన్ని పూడ్చి
ABN , Publish Date - Apr 22 , 2025 | 04:05 AM
భర్తతో గొడవ జరగడంతో తన చెల్లి సహకారంతో కవిత భర్తను కరెంటు షాకిచ్చి, తవ్వలు బిగించి హత్య చేసింది. అనంతరం శవాన్ని పూడ్చి దాచేందుకు ప్రయత్నించిన ఈ దారుణం హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చింది
హైదరాబాద్‌లో ఓ భార్య క్రైమ్ కథాచిత్రమ్
18న ఇద్దరి మధ్య ఘర్షణ.. కరెంట్ షాక్ ఇచ్చి..
చెల్లితో కలిసి మెడకు తువ్వాలు బిగించి హత్య
రాత్రివేళ ఆటోలో తీసుకెళ్లి పూడ్చిపెట్టే యత్నం
ఆటోడ్రైవర్ సమాచారంతో పోలీసుల దర్యాప్తు
హైదర్‌నగర్, పాపన్నపేట, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ఇరవై ఏళ్లుగా భర్తకు దూరంగా ఉండి, ఇటీవలే అతడితో కలిసి ఉండడం ప్రారంభించిన ఓ మహిళ.. అతడికి కరెంటు షాకిచ్చి, ఊపిరాడకుండా చేసి చంపేసి, అతడి శవాన్ని పూడ్చేసింది! రాజధాని హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీ్‌సస్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణం మూడు రోజులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... మెదక్‌జిల్లా పాపన్నపేట్ మండలం పాతలింగాయపల్లికి చెందిన బెయిని సాయిలు(45)కి కవిత(42)తో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమార్తె శ్వేత(17), కుమారుడు బన్ని(14) ఉన్నారు. దంపతుల మధ్య మొదటి నుంచి సఖ్యత లేకపోవడంతో.. సాయిలు తన పిల్లలతో పాతలింగాయపల్లిలోనే నివాసం ఉంటున్నాడు. ఊరిలో ఉండటం ఇష్టంలేని కవిత హైదరాబాద్ వచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ మిత్రహిల్స్ ప్రాంతంలో తన చెల్లి జ్యోతి, మరిది మల్లేశ్‌తో కలిసి జీవించేది. తనకు ఇష్టమైనప్పుడు ఊరికి వెళ్లి భర్త, పిల్లలతో రెండు మూడు రోజులు గడిపి వచ్చేది. ఇటీవల దగ్గరి బంధువుల అంత్యక్రియలకు వెళ్లినప్పుడు.. వారిద్దరూ కలిసి ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. 12వ తేదీన సాయిలు భార్యతో సహా నగరానికి వచ్చాడు. 18వ తేదీన రాత్రి.. సాయిలు, కవిత, జ్యోతి, మల్లేశ్ నలుగురూ కలిసి కల్లు తాగారు. ఆ సమయంలో సాయిలు, కవిత మధ్య గొడవ జరిగింది. ఆ కోపంలో.. చెల్లెలు సాయంతో కవిత తన భర్తకు కరెంట్ షాకిచ్చి చంపేదుకు యత్నించింది. అయినా మృతిచెందకపోవడంతో ఇద్దరూ కలిసి అతడి మెడకు తువ్వాలు చుట్టి ప్రాణాలు తీశారు.
ఆటోలో బయల్దేరి..
అదే రోజు రాత్రి 12గంటల సమయంలో.. కవిత తనకు పరిచయం ఉన్న ఆటోడ్రైవర్‌ను పిలిపించుకుని అందులో శవాన్ని తీసుకెళ్లి, పాత లింగాయపల్లి ఊరి శివారుల్లో మృతదేహాన్ని పూడ్చి పెట్టేందుకు యత్నించింది. కానీ.. ‘‘ఎవరికి తెలీకుండా మృతదేహాన్ని ఎందుకు పూడ్చేస్తున్నావు, నేను ఇందుకు సహకరించను.’’ అని ఆటోడ్రైవర్ అనడంతో, తన ఇంటివద్దే తిరిగి దింపాలని ఆమె కోరింది. తిరిగొచ్చాక.. చెల్లి, మరిది సాయంతో భర్త మృతదేహాన్ని మిత్రహిల్స్ పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో పాతిపెట్టింది. అనంతరం పాతలింగాయపల్లికి వెళ్లింది. అక్కడ పిల్లలు, సాయిలు కుటుంబసభ్యులు అడిగిన ప్రశ్నలకు పొంతన లేని జవాబులు చెప్పింది. మరోవైపు... సాయిలు మృతదేహాన్ని తరలించిన ఆటో డ్రైవర్ కేపీహెచ్‌బీ ఠాణాకు వెళ్లి కవిత గురించి ఫిర్యాదు చేశాడు. దీంతో వారు సోమవారం జ్యోతి, మల్లేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో విషయం బయటపడింది. పోలీసులు వెంటనే పాతలింగాయపల్లికి వెళ్లి కవితను అదుపులోకి తీసుకుని విచారించారు. తన భర్తకు ఎయిడ్స్ ఉందని, అనుమానంతో నిత్యం వేధిస్తుండడంతో.. భరించలేక ఈ హత్యకు పాల్పడినట్లు తెలిపిందామె. కాగా సాయిలు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీ్‌సస్టేషన్‌కు చేరుకుని వాంగ్మూలం ఇచ్చారు. సాయిలుకు ఎటువంటి వ్యాధులూ లేవని స్పష్టం చేశారు. కాగా.. మంగళవారం కూకట్‌పల్లి తహసీల్దార్ సమక్షంలో సాయిలు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయిస్తామని పోలీసులు తెలిపారు.
తాగి గొడవ చేస్తున్నాడని భర్తను హతమార్చిన భార్య
కూతురితో కలిసి ఘాతుకం..
పాపన్నపేట, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): నిత్యం మద్యం తాగి ఇంట్లో గొడవ చేస్తున్నాడని భర్తను కూతురితో కలిసి ఓ భార్య హతమార్చింది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నామాపూర్‌లో ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నామాపూర్‌కు చెందిన గొల్ల జోగయ్య (51) వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతను మద్యానికి బానిసగా మారాడు. రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవ చేస్తుండేవాడు. దీంతో విసుగు చెందిన భార్య నాగమ్మ ఆదివారం ఇంట్లో చిన్న కూతురితో కలిసి జోగయ్య మెడకు చీరతో ఉరి బిగించి హతమార్చింది. కూతురు అతని కాళ్లు పట్టుకోగా నాగమ్మ గొంతుకు ఉరి బిగించి హత్య చేసింది. కాసేపటి తర్వాత జోగయ్య ఇంటికి వెళ్లిన ఇరుగు పొరుగు వారు అతను చలనం లేకుండా పడి ఉండటాన్ని గమనించి చికిత్స కోసం మెదక్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే జోగయ్య మృతి చెందినట్లు నిర్ధారించి, అతని మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. సోమవారం బంధువులు మార్చురీకి చేరుకుని పరీక్షించగా జోగయ్య మెడకు కమిలిన గాయం కనిపించింది. అనుమానం వచ్చి భార్య నాగమ్మను గ్రామస్థులు, బంధువులు నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. జోగయ్య సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.