Sitarama Lift Irrigation: భూమి నిస్సారం.. పునాది బలహీనం
ABN , Publish Date - May 13 , 2025 | 05:32 AM
సీతారామ ఎత్తిపోతల పథకం కాలువకు మద్దతుగా నిర్మించిన పియర్ కూలి పోవడానికి దాని పునాదులు బలహీనంగా ఉన్నాయని, అక్కడ భూమి నిస్సారంగా ఉండటమే కారణమని నిపుణుల కమిటీ తేల్చింది.
సీతారామ ప్రాజెక్టు పియర్ కూలడానికి కారణమిదేనని నిపుణుల కమిటీ నివేదిక
గైడ్ వాల్స్.. ప్రొటెక్షన్ పనులు చేపట్టాలని సూచన
హైదరాబాద్, మే 12 (ఆంధ్రజ్యోతి): సీతారామ ఎత్తిపోతల పథకం కాలువకు మద్దతుగా నిర్మించిన పియర్ కూలి పోవడానికి దాని పునాదులు బలహీనంగా ఉన్నాయని, అక్కడ భూమి నిస్సారంగా ఉండటమే కారణమని నిపుణుల కమిటీ తేల్చింది. ఈ పథకం నాలుగో ప్యాకేజీలో ములకలపల్లి మండలం పూసుగూడం పరిధిలో ప్రధాన కాలువ 48.309 కిలో మీటర్ వద్ద సూపర్ పాసేజ్‌కు మద్దతుగా నిర్మించిన పియర్ (పిల్లర్) కూలిపోయిన ఘటన గత నెలలో వెలుగు చూసింది. దీని విషయమై సీఎం రేవంత్‌రెడ్డి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణంలో నాణ్యత పాటించరా..? ‘కట్టుడు.. కూలుడేనా..?’ అంటూ మండి పడ్డారు. ఈ నేపథ్యంలో పియర్ కూలిపోవడానికి కారణాలపై విచారణకు సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజినీర్ వి. మోహన్ కుమార్ నేతృత్వంలో నలుగురు అధికారులతో ఈఎన్‌సీ (జనరల్) జి. అనిల్ కుమార్ కమిటీని నియమించారు.
ఈ ప్రాజెక్టులోని అన్ని కాంపోనెంట్ల నిర్మాణ ధృడత్వంపై నివేదిక అందజేయాలని ఆ కమిటీని ఆదేశించారు. దీంతో మోహన్ కుమార్ కమిటీ తొలుత ప్రమాదం జరిగిన పియర్‌ను పరిశీలించి.. అది కూలిపోవడానికి అక్కడ భూమి బలహీనం (నిస్సారం)గా ఉండటంతోపాటు పునాదులూ సరిగా లేకపోవడమే కారణమని గుర్తించింది. మున్ముందు ఇటువంటి ఘటనలు జరుగకుండా కన్సల్టెంట్ సలహా మేరకు ప్రత్యేక భూభౌతిక పరీక్షలు చేపట్టాలని సిఫారసు చేసింది. అవుట్‌లెట్ వైపు వింగ్ వాలు పక్కన గల గట్టు క్షీణించిందని, ఏ సమయంలోనైనా కూలిపోవచ్చునని పేర్కొంది. ఇప్పటికే పనులు దాదాపు పూర్తయినందున గైడ్ వాల్‌లు, ప్రొటెక్షన్ పనులు చేపట్టాలని సూచించింది. పియర్ పునరుద్ధరణకు డిజైన్లు అందజేయాలని సూచించింది. పియర్‌కు ఎగువన, దిగువన వర్షపు నీరు కిందకెళ్లడంతో పునాది బలహీన పడిందని పేర్కొంది. గత ఫిబ్రవరి 28 నుంచి మార్చి 15 వరకూ ప్రధాన కాలువ పూర్తి సామర్థ్యంతో నీరు ప్రవహించడం వల్ల పియర్ ఎడమ వైపు కూలిందని మోహన్ కుమార్ కమిటీ పేర్కొంది.