Uttam Kumar Reddy: ఇంటికెళ్లి సంతకం చేయించండి
ABN , Publish Date - Apr 06 , 2025 | 05:24 AM
రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశం అయింది. సీనియర్ ఐఏఎస్ అయిన ఆయనకు నిజాయితీపరుడిగా పేరున్నప్పటికీ.. విధులు, బాధ్యతల పట్ల ప్రభుత్వం ఆశించినంత వేగంగా స్పందించడం లేదనే అభిప్రాయాలున్నాయి.
నీటిపారుదల సమీక్షకు ముఖ్య కార్యదర్శి గైర్హాజరు.. అధికార్లకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
సీతారామ సవరణ జీవో జారీకి నిర్దేశం
సెక్రటరీ ఫోన్ ఎత్తడం లేదన్న అధికారులు
చర్చనీయాంశమైన వ్యవహారం
హైదరాబాద్, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశం అయింది. సీనియర్ ఐఏఎస్ అయిన ఆయనకు నిజాయితీపరుడిగా పేరున్నప్పటికీ.. విధులు, బాధ్యతల పట్ల ప్రభుత్వం ఆశించినంత వేగంగా స్పందించడం లేదనే అభిప్రాయాలున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులపై శనివారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్వహించిన సమీక్షకు ముఖ్య కార్యదర్శి గైర్హాజరయ్యారు. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భద్రాచలంలో పర్యటించనుండడంతో.. సీతారామ ఎత్తిపోతల పథకం/సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజె క్టుకు సంబంధించి సవరణ అంచనాలకు పరిపాలనపరమైన అనుమతినిస్తూ జీవో జారీ చేయాలని సమీక్ష సందర్భంగా మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. అయితే ముఖ్య కార్యదర్శి ఫోన్ ఎత్తడంలేదని, అలాంటప్పుడు జీవో ఎలా జారీ చేయాలని అధికారులు విన్నవించుకున్నారు. దీంతో, ‘‘ఇంటికెళ్లి.. ఫైలుపై సంతకం చేయించుకొని రండి. వెంటనే పరిపాలన పరమైన అనుమతులు ఇస్తూ ఈ రోజే (శనివారం) జీవో జారీ చేయండి’’ అంటూ మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. వాస్తవానికి సీతమ్మసాగర్ ప్రాజెక్టు సవరణ అంచనాలను నిశితంగా పరిశీలించి.. హేతుబద్ధంగా ఉన్నాయో, లేదో ప్రతిపాదనలు పరిశీలించాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి రామకృష్ణారావుకు ఇటీవలే మంత్రివర్గం బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు సవరణ అంచనాలకు రామకృష్ణారావు ఆమోదముద్ర కూడా వేశారు. కాగా, ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకావడంతోపాటు సన్నబియ్యం అందుకుంటున్న లబ్ధిదారుడి ఇంట్లో భోజనం కూడా చేయనున్నారు. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టుపై సీఎం ప్రకటన ఉంటుందని గుర్తించిన మంత్రి ఉత్తమ్.. వెంటనే సవరణ అంచనాలకు పరిపాలనపరమైన అనుమతులు ఇస్తూ జీవో జారీ చేయాలని ఆదేశించారు. కానీ, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి బాధ్యతలు చూస్తున్న కీలక ఐఏఎస్ అధికారి.. మంత్రి నిర్వహించిన సమావేశానికి దూరంగా ఉండటమే కాకుండా మంత్రి ఓఎస్డీలు చేసే ఫోన్ కూడా ఎత్తకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించాలంటూ మంత్రి ఉత్తమ్ ప్రభుత్వాన్ని కోరినట్లు కూడా తెలిసింది.
ఛత్తీ్‌సగఢ్ నుంచి ఎన్‌వోసీ తెప్పించండి..
సమ్మక్కసాగర్ బ్యారేజీకి ఛత్తీ్‌సగఢ్ నుంచి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) తెప్పించుకోవాలని, దీనికోసం అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలని సమీక్ష సందర్భంగా మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. ఈ ఎన్‌వోసీ తెచ్చుకుంటేనే సమ్మక్కసాగర్‌కు క్లియరెన్స్‌లు ఇస్తామని కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చిచెప్పగా.. దాదాపు రెండేళ్లకు పైగా ఎన్‌వోసీ అంశం తేలడంలేదు. ఇక గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుతోపాటు రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టులో కేసు వేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీనిపై ఆదివారం హైదరాబాద్‌కు రానున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌తో ఉత్తమ్ సమావేశం కానున్నారు. ఇదిలా ఉండగా.. కడెం, లోయర్ మానేరు, భద్రకాళి చెరువుల్లో ప్రస్తుతం జరుగుతున్న పూడికతీత పనులను ఇతర రిజర్వాయర్లకు విస్తరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. జూరాల, నిజాంసాగర్, ఎస్‌ఆర్‌ఎస్పీ, నాగార్జునసాగర్ ప్రాజెక్టులో కూడా పూడికతీత చేపట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. మరోవైపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తొలిదశను రానున్న డిసెంబరుకల్లా పూర్తి చేసి, నార్లాపూర్‌లో 6.40 టీఎంసీలు, ఏదులలో 6.55 టీఎంసీలు, వట్టెంలో 16.70 టీఎంసీలు, కరివెనలో 19 టీఎంసీల నీటిని నిల్వ చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ పథకంపై ఆయన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. నార్లాపూర్-ఏదుల రిజర్వాయర్‌కు నీటిని తరలించే ప్యాకేజీ-3లోని కెనాల్ పనులను రానున్న అక్టోబరు కల్లా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇక నార్లాపూర్, ఏదుల, వట్టెం పంపింగ్ కేంద్రాల వద్ద 400 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి వీలుగా రూ.262 కోట్లను తెలంగాణ ట్రాన్స్‌కోకు విడుదల చేశామని చెప్పారు. ఆయా పంపింగ్ స్టేషన్ ల వద్ద సబ్‌స్టేషన్‌ల నిర్మాణం పూర్తి చేసి, రానున్న జూలైలో పంపుల డ్రై రన్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఔట్‌లెట్‌లో డ్రిల్లింగ్, బ్లాస్టింగ్‌కు అనుమతించం..
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్ ఔట్‌లెట్ (మన్నెవారిపల్లి, అచ్చంపేట) నుంచి కూడా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో టన్నెలింగ్‌కు అనుమతించాలని జయప్రకాష్ అసోసియేట్స్ (జేపీ) ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిని మంత్రి ఉత్తమ్ తిరస్కరించారు. తమిళనాడులోని పోర్ట్ నుంచి బేరింగ్‌లు వస్తున్నాయని, వాటిని టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం)కు బిగించి.. టన్నెలింగ్ చేయాలని ఆదేశించారు. టీబీఎం ద్వారా టన్నెల్ తవ్వకానికి నిధులిచ్చాక.. డ్రిల్లింగ్, బ్లాస్టింగ్‌కు ఎలా అంగీకరిస్తామని ప్రశ్నించారు. శ్రీశైలం (దోమలపెంట) నుంచి టన్నెల్ ఇన్‌లెట్ వైపు ఫిబ్రవరి 22న సొరంగం పైకప్పు కూలడంతో టీబీఎం పూర్తిగా దెబ్బతిన్నది. ప్రస్తుతం దాని విడిభాగాలను సొరంగం నుంచి బయటికి తీస్తున్నారు. ఇన్‌లెట్‌లో మళ్లీ టీబీఎం ద్వారా టన్నెలింగ్ చేసే పరిస్థితి లేకపోవడంతో.. ఇకపై డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో తవ్వకం చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకు ముఖ్యమంత్రి, మంత్రి కూడా అనుమతినిచ్చారు. అయితే ఔట్‌లెట్ వైపు కూడా డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో టన్నెలింగ్ చేస్తామని నిర్మాణ సంస్థ ప్రతిపాదించగా.. దీనిని మంత్రి తోసిపుచ్చారు.
సీఎం పర్యటన ఉండగా అమెరికా ఎలా వెళ్తావు?
సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనుండగా.. తాను వ్యక్తిగత పనుల నిమిత్తం అమెరికా వెళ్తున్నానని, అనుమతినివ్వాలని కొత్తగూడెం చీఫ్ ఇంజనీర్ మంత్రి ఉత్తమ్‌ను కోరారు. అయితే, ‘సీఎం పర్యటన పెట్టుకొని అమెరికా ఏ విధంగా పోతావు?’ అని మంత్రి ప్రశ్నించారు. దాంతో సదరు సీఈ బాధపడినట్లు తెలిసింది.
రెండు ఈఎన్‌సీ పోస్టుల భర్తీ కోసం ప్రతిపాదనలు
నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయి. మార్చి 31న ఈఎన్‌సీ(ఓఅండ్‌ఎం)గా పనిచేస్తున్న విజయభాస్కర్‌రెడ్డి పదవీ విరమణ చేయగా.. అదేరోజు చీఫ్ ఇంజనీర్(మైనర్ ఇరిగేషన్)గా పనిచేస్తున్న సీఎ్‌సఎస్ చంద్రశేఖర్ కూడా రిటెరయ్యారు. దాంతో ఈఎన్‌సీ(అడ్మిన్)గా కమిషనర్ ఆఫ్ ఎంక్వయిరీ్‌సగా పనిచేస్తున్న అంజద్ హుస్సేన్‌కు, ఈఎన్‌సీ(ఓఅండ్‌ఎం)గా ఆదిలాబాద్ సీఈగా పనిచేస్తున్న టి.శ్రీనివా్‌సకు బాధ్యతలు అప్పగించేందుకు, సెలవులో ఉన్న వనపర్తి చీఫ్ ఇంజనీర్ రఘునాథరావును సీఈ(మైనర్ ఇరిగేషన్)గా నియమించడానికి వీలుగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఈఎన్‌సీ(జనరల్) జి.అనిల్‌కుమార్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. మరోవైపు ఈఎన్‌సీ(జనరల్) కార్యాలయంలో ఎస్‌ఈ(టెక్నికల్)గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న బస్వరాజును ఇరిగేషన్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్(ఐడీసీ) ఎండీగా నియమించాలని ప్రతిపాదించారు.