Share News

కొత్త ఠాణాలు ఎప్పుడో..?!

ABN , Publish Date - Sep 19 , 2025 | 12:18 AM

కొత్త ఠాణాలు, ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్ల ఏర్పాటు కాగితాలకే పరిమితమవుతోంది. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌తో పాటు ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో కొత్తగా ఠాణాల ప్రతిపాదనలు మూలుగుతున్నాయి. కొత్త జిల్లాలు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త పోలీస్‌ స్టేషన్లు, ట్రాఫిక్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినా ఫలితం లేకుండా పోతోంది.

కొత్త ఠాణాలు ఎప్పుడో..?!

  • ఏళ్ల తరబడి కాగితాల్లోనే మూలుగుతున్న ప్రతిపాదనలు

  • ఉమ్మడి జిల్లాలో గతంలోనే 3 పోలీ్‌సస్టేషన్లు, 6 ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లకు ప్రతిపాదనలు

  • నడికూడ, మేడారం, అలుబాకలో ఏర్పాటు చేయాలని నిర్ణయం

  • కేయూ, జనగామ, నర్సంపేట, మహబూబాబాద్‌, ములుగు, భూపాలపల్లిలో ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్‌లకు ప్రతిపాదనలు

  • పోలీ్‌సకమిషనరేట్‌ పరిధిలో రెండు పోలీ్‌సస్టేషన్లు అవసరంగా గుర్తింపు

  • అప్‌గ్రేడేషన్‌కు నోచుకోని పోలీ్‌సస్టేషన్లు.. సిబ్బంది కొరతతో అవస్థలు..

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌ : కొత్త ఠాణాలు, ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్ల ఏర్పాటు కాగితాలకే పరిమితమవుతోంది. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌తో పాటు ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లో కొత్తగా ఠాణాల ప్రతిపాదనలు మూలుగుతున్నాయి. కొత్త జిల్లాలు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త పోలీస్‌ స్టేషన్లు, ట్రాఫిక్‌ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినా ఫలితం లేకుండా పోతోంది. వీటితో పాటు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కొత్తగా మరో రెండు పోలీ్‌సస్టేషన్‌ల కోసం చేసిన ప్రతిపాదనల ఫైలు కదలటం లేదు. దీనికి తోడు ఏళ్ల తరబడి పోలీ్‌సస్టేషన్లు అప్‌గ్రేడేషన్‌కు నోచుకోవటం లేదు. దీంతో చాలా పోలీ్‌సస్టేషన్లలో అరకొర సిబ్బందితో స్టేషన్లను నెట్టుకురావాల్సి వస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగితాల్లోనే కొత్త ఠాణాలు

కొత్త ఠాణాల ప్రతిపాదనలు అటకెక్కుతున్నాయి. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని వరంగల్‌, హనుమకొండ, జనగామ జిల్లాల్లో 45 పోలీ్‌సస్టేషన్లు ఉండగా, భూపాలపల్లిలో 13 పీఎస్‌లు, ములుగు జిల్లాలో 10, మహబూబాబాద్‌ జిల్లాలో 18 పోలీ్‌సస్టేషన్‌లు ఉన్నాయి. మొత్తం గా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 86 పోలీ్‌సస్టేషన్లు ఉండగా, పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న కాలనీలతో కొత్తగా మరిన్ని పోలీ్‌సస్టేషన్లు అవసరంగా గుర్తించారు. 2018లోనే ములుగు జిల్లా మేడారంలో పోలీ్‌సస్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించారు. మేడారంలో నిత్యం పూజలు జరుగుతుండటంతో పాటు వేలాది మంది భక్తులు రోజు వస్తుండటంతో ఇక్కడ ప్రత్యేక పోలీ్‌సస్టేషన్‌ అవసరంగా గుర్తించి ప్రతిపాదనలు పంపించారు. పోలీ్‌సస్టేషన్‌ నిర్మాణం కూడా పూర్తి చేశారు. కానీ, ఇప్పటి వరకు సిబ్బంది కేటాయింపులు చేసి, స్టేషన్‌ ప్రారంభించలేదు. దీంతో ప్రస్తుతం రిజర్వుడు పోలీసులకు షెల్టర్‌గా మారింది.

ఇక ములుగు జిల్లా వెంకటాపురం మండలం అలుబాకలో కూడా పోలీ్‌సస్టేషన్‌ కోసం 2018లోనే ప్రతిపాదనలు చేశారు. చత్తీ్‌సగడ్‌కు సరిహద్దులో ఉండటంతో మావోయిస్టుల ఉనికితోపాటు గంజాయి లాంటి అక్రమ దందాను అరికట్టేందుకు అలుబాక స్టేషన్‌ అవసరంగా గుర్తించి చేసిన ప్రతిపాదనలు ఏడేళ్లుగా కాగితాల్లోనే మూలుగుతున్నాయి. అలాగే వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని నడికూడ గ్రామాన్ని 2018 ఆగస్టు 27న నూతన మండల కేంద్రంగా ఏర్పాటు చేశారు. అయితే కొత్త మండలానికి పోలీ్‌సస్టేషన్‌ను ఇవ్వలేదు. ఏడేళ్లుగా పరకాల పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోనే కొనసాగుతోంది. దీంతో శాంతిభద్రతల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తోంది.

తాజాగా వరంగల్‌ నగరంలో కొత్తగా రెండు పోలీ్‌సస్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపించారు. సుబేదారి, మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్ల పరిధి ఎక్కువగా ఉండటంతో పునర్విభజన చేసి మరో రెండు కొత్త పోలీ్‌సస్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. ఇవీ కూడా అమలుకు నోచుకోలేదు. దీంతో నగరంలో శాంతిభద్రతల బాధ్యతలు ఖాకీలకు భారంగా మారుతున్నాయి. దొంగతనాలు, గంజాయి స్మగ్లింగ్‌, అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్లు..

కొత్తగా జిల్లాలు ఏర్పడటం.. నగరం భారీగా విస్తరిస్తుండటంతో పాటు జనాభా సైతం భారీగా పెరుగుతోంది. దీంతో రహదారులు జామ్‌ అవుతున్నాయి. వరంగల్‌ నగరంలో కాజీపేట, హనుమకొండ, వరంగల్‌లోనే ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. వీటితో పాటు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో మరో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. హసన్‌పర్తి, ఎల్కతుర్తి వరకు నగరంలో కలిసిపోయింది. వడ్డెపల్లి, హనుమకొండ ఆర్టీసీ డిపో ఏరియా మొత్తం కూడా కాజీపేట ట్రాఫిక్‌ పరిధిలో ఉండటం పోలీసులపై భారం పడుతోంది. కాజీపేట నుంచి మడికొండ, పెద్దపెండ్యాల నుంచి స్టేషన్‌ ఘన్‌పూర్‌ వరకు నగరం విస్తరిస్తుంది. ఈ క్రమంలో కాజీపేట ట్రాఫిక్‌ సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. ఈ క్రమంలో కేయూ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుకు ఏడేళ్ల కిందట చేసిన ప్రతిపాదనలకు మోక్షం లభించటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

అలాగే కొత్తగా మిల్స్‌కాలనీ స్టేషన్‌ పరిధిలో కూడా మరో ట్రాఫిక్‌ స్టేషన్‌ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. మామునూరు ఎయిర్‌పోర్టుతో పాటు కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కు విస్తరిస్తుండటంతో ట్రాఫిక్‌ భారీగా పెరుగుతోంది. ఈ ప్రాంతంలో కూడా మరో ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటుపై అధికారులు దృష్టి పెట్టాలని నగరవాసులు కోరుతున్నారు. ఇక కొత్తగా ఏర్పడిన భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్లను ఏర్పాటు చేయాలని 2019లోనే ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. భూపాలపల్లిలో ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్‌ కోసం 2020లోనే స్థల సేకరణ కూడా చేశారు. ఇప్పటివరకు కొత్త జిల్లాల్లో ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్ల ఊసే లేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హోంశాఖ మంత్రిగా ఉండటంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన నూతన ఠాణాలు, ట్రాఫిక్‌ పోలీ్‌సస్టేషన్లపై అధికారి పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకురావటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

స్థాయి పెంచరు.. సిబ్బందిని ఇవ్వరు..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పోలీ్‌సస్టేషన్లలో సిబ్బంది కొరత వేధిస్తోంది. సెలవు పెట్టాలన్న పోలీసులకు నిరీక్షణ తప్పటం లేదు. ప్రధానంగా కొత్త పోలీ్‌సస్టేషన్‌ను ఏర్పాటు చేసినప్పుడు ఎఫ్‌ గ్రేడ్‌ కేటగిరీలో సిబ్బంది నియమిస్తారు. ఎఫ్‌ కేటగిరీ పోలీ్‌సస్టేషన్‌లో ఎస్సై, ఏఎస్సై, హెడ్‌ కానిస్టేబుల్స్‌, కానిస్టేబుల్స్‌ కలిపి మొత్తం 28మంది ఉండాలి. అయితే ఇటీవల కొత్తగా భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం ఏర్పాటు చేశారు. ఈ మండల పోలీ్‌సస్టేషన్‌లో ఒక ఎస్సై, మరొకరు సెంకడ్‌ ఎస్సైతో పాటు ముగ్గురు హెడ్‌కానిస్టేబుల్స్‌, ఆరుగురు కానిస్టేబుల్స్‌, ఒక మహిళ కానిస్టేబుల్‌ను నియమించారు. మొత్తం 12మంది మాత్రమే గోరికొత్తపల్లి పోలీ్‌సస్టేషన్‌కు కేటాయించారు. 28మంది సిబ్బంది చేయాల్సిన పనిని 12మందితో చేయిస్తున్నారు. దీంతో సెలవు పెట్టే అవకాశం పోలీసులకు దొరకటం లేదు.

అలాగే ఈ కేటగిరి పోలీ్‌సస్టేషన్‌లో 45మంది, డీ కేటగిరి స్టేషన్‌లో 55మంది సిబ్బంది డ్యూటీస్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఏళ్ల తరబడి ఏ పోలీ్‌సస్టేషన్‌ స్థాయిని కూడా పెంచటం లేదు. ఏ కేటగిరిలో ఉన్న సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించటం లేదు. దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీ్‌సస్టేషన్లలో పోలీసులకు సెలవులు బంగారమయ్యాయి. పండుగలు, పబ్బాలుకు కూడా సెలవుల కోసం నిరీక్షించాల్సి వస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించి కొత్త ఠాణాలతో పాటు నగరాల్లో కొత్త ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు చేయటంతో పాటు పోలీ్‌సస్టేషన్ల స్థాయిని పెంచి సిబ్బంది నియామకం చేయాలనే డిమాండ్‌ వినిపస్తోంది.

Updated Date - Sep 19 , 2025 | 12:18 AM