Share News

Cabinet Expansion: ప్రజాసేవకు మరో అవకాశం

ABN , Publish Date - Jun 09 , 2025 | 03:52 AM

కార్యకర్తల కోరిక మేరకు తన తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చానని, సుదీర్ఘ ప్రయాణం తరువాత ఇప్పుడు మంత్రి పదవి దక్కడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆదివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వివేక్‌ మీడియాతో మాట్లాడారు.

Cabinet Expansion: ప్రజాసేవకు మరో అవకాశం

కాకా ఆశయాలను కొనసాగిస్తా

ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా పనిచేస్తా

సింగరేణికి కొత్త గనుల కోసం కృషి చేస్తా

ఏ శాఖ ఇవ్వాలో సీఎం నిర్ణయిస్తారు: వివేక్‌

హైదరాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు సేవ చేయడానికి తనకు మరో అవకాశం లభించిందని నూతన మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి అన్నారు. కార్యకర్తల కోరిక మేరకు తన తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చానని, సుదీర్ఘ ప్రయాణం తరువాత ఇప్పుడు మంత్రి పదవి దక్కడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆదివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వివేక్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘మా నాన్న వెంకటస్వామి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు నేను ఆయనకు ఎలక్షన్‌ ఏజెంట్‌గా పనిచేశాను. ఆయన రాజకీయాల నుంచి రిటైర్‌ అవడంతో కార్యకర్తల కోరిక మేరకే 2009లో రాజకీయాల్లోకి వచ్చాను. గతంలో తెలంగాణ కోసం పోరాడాను. రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్‌ అవినీతిపైనా కొట్లాడాను. మా నాన్నను ఇప్పటికీ చాలా మంది గుర్తుంచుకున్నారు. ఆయన నిత్యం పేదప్రజల కోసమే పనిచేశారు. అవే విలువలు, వారసత్వాన్ని మాకు నేర్పించారు. అదే ఆలోచనలను నేను పాటిస్తూ, ముందుకువెళ్తాను. రేవంత్‌రెడ్డికి అండగా ఉంటూ, ప్రజా ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చేలా పనిచేస్తాను’’ అని వివేక్‌ అన్నా రు. మంత్రిగా తనకు ఏ శాఖ ఇచ్చినా సమర్థంగా నిర్వహిస్తానని, ఏ శాఖ ఇవ్వాలనేదానిపై సీఎం రేవంతే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ‘‘మా ప్రాంతంలో సింగరేణి ఉంది. అక్కడ కొత్త గనులు వచ్చేలా ప్రయత్నం చేస్తా. గనులు వస్తే.. ఉద్యోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దాంతో సింగరేణి కూడా మరింత బలోపేతమవుతుంది. ఇక ఎన్నికల సమయంలో నేతకాని కార్పొరేషన్‌, లిడ్‌క్యాప్‌ సంస్థ పునఃప్రారంభం, మాల కార్పొరేషన్‌ ఏర్పాటుచేస్తామని చెప్పాను. వాటిని అమలుచేసే దిశగా ముఖ్యమంత్రితో చర్చిస్తాను’’ అని వివేక్‌ చెప్పారు. మంత్రి పదవి కోసం తమ జిల్లా నుంచి ప్రేమ్‌సాగర్‌రావు, వినోద్‌ కూడా ప్రయత్నించారని, అందులో తప్పేమీ లేదని అన్నారు. అయితే సామాజిక సమీకరణాలు, గతంలో తన తండ్రి చేసిన సేవలను అధిష్ఠానం పరిశీలించి నిర్ణయం తీసుకుందని తెలిపారు.


వెంకటస్వామి వారసుడిగా రాజకీయాల్లోకి

కేంద్ర మాజీ మంత్రి, దివంగత గడ్డం వెంకటస్వామి (కాకా) కుమారుడైన వివేక్‌ వెంకటస్వామి 1957 నవంబరు 30న జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీబీఎస్‌ చదివారు. తండ్రి వెంకటస్వామి వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. 2009లో పెద్దపల్లి ఎంపీగా గెలుపొంది.. రాష్ట్రం కోసం ఢిల్లీ స్థాయిలో కృషిచేశారు. తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్‌ జాప్యం చేస్తుందన్న కారణంతో 2013లో బీఆర్‌ఎస్‌ (అప్పటి టీఆర్‌ఎ్‌స)లో చేరారు. తెలంగాణ ఏర్పాటైన తరువాత మళ్లీ 2014లో కాంగ్రె్‌సలో చేరారు. ఆ తరువాత 2016లో బీఆర్‌ఎ్‌సలోకి వెళ్లారు. 2019లో బీజేపీలో చేరారు. ఆ తరువాత 2023 నవంబరు 21న తిరిగి కాంగ్రె్‌సలో చేరారు. వెంటనే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరపున చెన్నూరు నియోజవర్గంలో పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత పార్లమెంట్‌ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు స్థానం నుంచి తన కుమారుడు వంశీకృష్ణను బరిలో దింపి ఎంపీగా గెలిపించడంలో సఫలీకృతులయ్యారు. వివేక్‌ సోదరుడు వినోద్‌ ప్రస్తుతం బెల్లంపల్లి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

తనయుడి సంబరాలు!

చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామి మంత్రిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో.. తనయుడు ఎంపీ వంశీకృష్ణ సంబరాలు చేసుకున్నారు. వివేక్‌ మంత్రి పదవి చేపట్టనున్న విషయం తెలిసి కార్యకర్తలు, అనుచరులు ఆయన ఇంటికి తరలివచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఎంపీ తీన్మార్‌ స్టెప్పులు వేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

For Telangana News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 03:52 AM