మా పిల్లలను సర్కారు బడికే పంపుతాం..
ABN , Publish Date - Jun 24 , 2025 | 04:00 AM
మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపుతాం.. ప్రైవేట్ పాఠశాలకు పంపం... ప్రైవేట్ పాఠశాలల బస్సులు మా ఊరికి రావద్దు’ అని నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామస్థులు తేల్చిచెప్పారు.
ప్రైవేట్ స్కూల్ బస్సులను అడ్డుకున్న గ్రామస్థులు
నల్లగొండ జిల్లా పుల్లెంలలో ఘటన
చండూరు రూరల్/ఆత్మకూరు(ఎస్), జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ‘మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపుతాం.. ప్రైవేట్ పాఠశాలకు పంపం... ప్రైవేట్ పాఠశాలల బస్సులు మా ఊరికి రావద్దు’ అని నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామస్థులు తేల్చిచెప్పారు. సోమవారం తమ గ్రామానికి వచ్చిన ప్రైవేట్ పాఠశాలల బస్సులను అడ్డుకుని గంట పాటు రహదారిపై బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి తల్లిదండ్రులతో మాట్లాడి బస్సులను అక్కడి నుంచి పంపించారు. పుల్లెంలలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 39మంది, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 102మంది చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. గ్రామానికి చెందిన 100 మంది విద్యార్థులు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న చండూరు మండల కేంద్రంలోని ఐదు ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్నారు.
ప్రతిరోజూ మూడు ప్రైవేటు పాఠశాలలకు చెందిన బస్సుల్లో పుల్లెంల మీదుగా విద్యార్థులు ప్రయాణిస్తుంటారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పలువురు గ్రామపెద్దల ఆధ్వర్యంలో గ్రామస్తులు ప్రైవేటు పాఠశాలల బస్సులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తామని స్పష్టం చేశారు.
సూర్యాపేట జిల్లాలో నిరసనలు..
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలవ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల బస్సుల అడ్డగింత, నిరసనలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఏపూరు గ్రామంలో అడ్డుకోగా, సోమవారం తుమ్మలపెన్‌పహాడ్ గ్రామంలో నిరసన వ్యక్తమైంది. అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ప్రైవేట్ పాఠశాల బస్సులు నడపరాదంటూ గ్రామస్తులు హెచ్చరించారు.