Share News

Cotton MSP: 35 లక్షల క్వింటాళ్లు.. రూ. 175 కోట్లు

ABN , Publish Date - May 05 , 2025 | 04:35 AM

పత్తి రైతులకు మస్కా కొట్టి.. సీసీఐ, వ్యవసాయ శాఖ అధికారులతో కుమ్మక్కై, మార్కెటింగ్‌ అధికారులను మచ్చిక చేసుకొని తాత్కాలిక ధ్రువపత్రాలతో జిన్నింగ్‌ మిల్లర్లు పొందిన లబ్ధి అక్షరాలా రూ.175 కోట్లు.

Cotton MSP: 35 లక్షల క్వింటాళ్లు.. రూ. 175 కోట్లు

క్వింటాలుకు రూ.500 చొప్పున లాభం.. ఎమ్మెస్పీతో లబ్ధిపొందిన జిన్నింగ్‌ మిల్లర్లు

  • తాత్కాలిక ధ్రువపత్రాలతో మాయాజాలం

  • సీసీఐ కేంద్రాల్లో పత్తి కొను‘గోల్‌మాల్‌’

  • నేడు ఆదిలాబాద్‌ జిల్లాకు విజిలెన్స్‌ బృందం

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): పత్తి క్వింటాకు కనీస మద్దతు ధర రూ.7,521. కానీ రైతుల నుంచి జిన్నింగ్‌ మిల్లర్లు కొనుగోలు చేసింది రూ.7 వేలకే. అదే పత్తిని జిన్నింగ్‌ మిల్లర్లు సీసీఐ(కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా)కి అమ్మితే పడిన రేటు రూ.7,521. అంటే క్వింటా పత్తి మీద రూ.500 లాభం. పత్తి రైతులకు మస్కా కొట్టి.. సీసీఐ, వ్యవసాయ శాఖ అధికారులతో కుమ్మక్కై, మార్కెటింగ్‌ అధికారులను మచ్చిక చేసుకొని తాత్కాలిక ధ్రువపత్రాలతో జిన్నింగ్‌ మిల్లర్లు పొందిన లబ్ధి అక్షరాలా రూ.175 కోట్లు. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు విజిలెన్స్‌ అధికారులు జరుపుతున్న విచారణలో కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.


కౌలు రైతులు, పోడు రైతులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు లేని పత్తి రైతులు సీసీఐకి పత్తి అమ్ముకోవటానికి వ్యవసాయశాఖ 60 వేల తాత్కాలిక ధ్రువపత్రాలు జారీచేసిన విషయం విదితమే. ఈ ‘టీఆర్‌’లను రైతుల కంటే ఎక్కువగా జిన్నింగ్‌ మిల్లర్లు, ట్రేడర్లు, దళారులు వినియోగించుకొని సొమ్ము చేసుకున్నారు. పట్టాదారు పాస్‌ పుస్తకాలు లేకుండా కేవలం తాత్కాలిక సాగు ధ్రువీకరణ పత్రాలతో సీసీఐ కొనుగోలు చేసిన పత్తి 35 లక్షల క్వింటాళ్లుగా లెక్క తేలింది. అయితే ఈ పత్తిని సీసీఐ కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) క్వింటాకు రూ.7,521 చొప్పున కొనుగోలు చేసింది. కానీ కొనుగోలు చేసింది మాత్రం పత్తి రైతుల నుంచి కాదు. రైతుల పేర్లతో జిన్నింగ్‌ మిల్లర్లు సీసీఐకి ఈ 35 లక్షల క్వింటాళ్ల పత్తిని అమ్ముకొని లబ్ధిపొందారు. రైతుల నుంచి క్వింటాకు రూ.6,800 నుంచి రూ.7 వేల చొప్పున జిన్నింగ్‌ మిల్లర్లు, దళారులు, ట్రేడర్లు పత్తి కొనుగోలు చేశారు. సగటున క్వింటాకు రూ.7 వేల చొప్పున కొనుగోలు చేయటంతో.. ఎమ్మెస్పీ కంటే రూ.500 తక్కువకు మిల్లర్లకు పత్తి దొరికింది. ఇలా 60 వేల టీఆర్‌లపై 35 లక్షల క్వింటాళ్ల పత్తిని సీసీఐకి అమ్మి రూ.175 కోట్ల లాభాన్ని జిన్నింగ్‌ మిల్లర్లు పొందారు.


పట్టాదారుల పేర్ల మీద కూడా అక్రమ కొనుగోళ్లు జరిగినప్పటికీ.. ప్రస్తుతానికి టీఆర్‌ల ద్వారా జరిగిన అక్రమ లావాదేవీలపైనే విజిలెన్స్‌ అధికారులు విచారణ చేస్తున్నారు. వ్యవసాయ శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఏఈవోలు, ఏవోలు, మార్కెటింగ్‌ శాఖ కార్యదర్శులు, సీసీఐ అధికారులు, వారి ప్రైవేటు సిబ్బంది, జిన్నింగ్‌ మిల్లర్లు, బ్రోకర్లు, ట్రేడర్ల ప్రమేయంపై విచారణ జరుపుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్‌, మెదక్‌ జిల్లాల్లోని సీసీఐ కొనుగోలు కేంద్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. రికార్డులను పరిశీలిస్తున్నారు. ఏఈవోలు, ఏవోలు, మార్కెట్‌ కార్యదర్శులను వ్యక్తిగతంగా విచారిస్తూ, లిఖిత పూర్వకంగా వివరణ తీసుకుంటున్నారు. టీఆర్‌లలో పేర్లు ఉన్న రైతులను కలిసి పత్తి సాగు చేశారా..? లేదా..? ఏఈవోల నుంచి సాగు ధ్రువీకరణ పత్రాలు తీసుకున్నారా..? లేదా..? సీసీఐకి పత్తి అమ్మారా..? లేదా..? రైతులకు తెలిసి జరిగిందా..? తెలియకుండా జరిగిందా..? రైతులు ఫొటోలు దిగారా..? టీఆర్‌లలో పేర్కొన్న ఫోన్‌ నంబర్లు, బ్యాంకు ఖాతా నంబర్లు రైతులవేనా..? ఓటీపీలు ఏ నంబర్లకు వచ్చాయి..? అనే అంశాలపై విజిలెన్స్‌ అధికారులు విచారణ చేస్తున్నారు.


ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికం..

సీసీఐ పత్తి కొనుగోళ్లు ఎక్కువగా జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాపై విజిలెన్స్‌ అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇక్కడ అత్యధికంగా 85 జిన్నింగ్‌ మిల్లులు ఉన్నాయి. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, నిర్మల్‌ ప్రాంతాల్లోని జిన్నింగ్‌ మిల్లుల్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో అక్రమ కొనుగోళ్లు పెద్దఎత్తున జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. ఆదిలాబాద్‌ బీ-సీసీఐ కేంద్రంలో 2 లక్షల క్వింటాళ్ల పత్తిని పరమాత్మ జిన్నింగ్‌ మిల్లు యజమానులే విక్రయించారని లిఖిత పూర్వక ఫిర్యాదులు వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆదిలాబాద్‌- ఏ సెంటర్‌లో రజిత కాటన్‌ మిల్స్‌ యజమానులు 70 వేల క్వింటాళ్ల పత్తిని సీసీఐకి విక్రయించినట్లు విజిలెన్స్‌ ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదులు వచ్చాయి. ఇప్పటికే జరిపిన ప్రాథమిక విచారణలో ఆదిలాబాద్‌ మార్కెట్‌ కార్యదర్శి మధుకర్‌పై సస్పెన్షన్‌ వేటువేశారు. ఆదిలాబాద్‌లోని ఏ, బీ జోన్లలో తాత్కాలిక ధ్రువపత్రాలతో జరిగిన కొనుగోళ్లలో అక్రమాలు జరిగిన తీరుపై నేడు విజిలెన్స్‌ అధికారులు క్షేత్రస్థాయి విచారణ జరపనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..

AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..

Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..

Updated Date - May 05 , 2025 | 04:35 AM