Guru Purnima: విద్యావేత్త చుక్కా రామయ్యకు సత్కారం
ABN , Publish Date - Jul 11 , 2025 | 05:01 AM
గురుపౌర్ణమి సందర్భంగా ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య(99)ను పలువురు ప్రముఖులు కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.
పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు, సీఎస్ రామకృష్ణారావు
హైదరాబాద్ సిటీ, జూలై 10(ఆంధ్రజ్యోతి): గురుపౌర్ణమి సందర్భంగా ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య(99)ను పలువురు ప్రముఖులు కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. కొంతకాలంగా వయసురీత్యా ఎదురయ్యే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చుక్కా రామయ్య మంచానికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు కె.రామచంద్రమూర్తి, ఎమెస్కో విజయకుమార్ తదితరులు చుక్కా రామయ్యను గురువారం విద్యానగర్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
పుష్ఫగుచ్ఛం అందించడంతో పాటు పూలమాల, శాలువాతో సత్కరించి, ఆశీస్సులు తీసుకున్నారు. విద్యారంగానికి రామయ్య అందించిన సేవలను ఈ సందర్భంగా వారంతా ప్రస్తావిస్తూ కొనియాడారు. తనను పరామర్శించడానికి వచ్చిన ప్రఖ్యాత సామాజికవేత్త ఆచార్య హరగోపాల్, వనమాల దంపతులను చూసి రామయ్య భావోద్వేగానికి లోనయ్యారు. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ వాట్సాప్ వీడియోకాల్ ద్వారా చుక్కా రామయ్యకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. వందేమాతరం ఫౌండేషన్ రవీందర్, సీనియర్ జర్నలిస్టు శ్రీనివా్‌సరెడ్డితో పాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు రామయ్యకు పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. తాను మాట్లాడలేని స్థితిలోనూ వారందరినీ చూసి సంజ్ఞలద్వారా రామయ్య సంతోషాన్ని వ్యక్తం చేశారు.