అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌లో తెలంగాణ యువతి మృతి
ABN , Publish Date - May 24 , 2025 | 04:38 AM
ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నంబాల కేశవరావుతో పాటు తెలంగాణ యువతి వన్నాడ విజయలక్ష్మి(36) అలియాస్ భూమిక కూడా మృతి చెందింది.
ఓయూ నుంచి అబూజ్‌మడ్ వరకు.. 12 ఏళ్ల కిందట మావోయిస్టు ఉద్యమంలోకి విజయలక్ష్మి
స్వస్థలం రంగారెడ్డి జిల్లా వేములనర్వ
మృతుల్లో ముగ్గురు తెలంగాణ వాసులు
ఛత్తీస్‌గఢ్‌లో 33 మంది లొంగుబాటు
చర్ల/షాద్‌నగర్/కేశంపేట, మే 23 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నంబాల కేశవరావుతో పాటు తెలంగాణ యువతి వన్నాడ విజయలక్ష్మి(36) అలియాస్ భూమిక కూడా మృతి చెందింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా భూమిక కీలక పాత్ర పోషించింది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం వేములనర్వకు చెందిన వన్నాడ సాయి లు, రాధమ్మకు ముగ్గురు ఆడపిల్లలు. మూడో సంతానమైన భూమిక పుట్టిన ఏడాదికే తల్లి పాము కాటుతో మరణించింది. భూమిక కేశంపేటలో పదో తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. చదువుకుంటూనే ఇంట్లో పిల్లలకు ట్యూషన్లు చెప్పేది. మహబూబ్‌నగర్‌లోని ఎన్టీఆర్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసింది. 2009-10లో హైదరాబాద్‌లోని ఓయూలో పీజీ పొలిటికల్ సైన్స్‌లో చేరింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంది. పలుమార్లు జైలుకూ వెళ్లింది. పోలవరం ముంపునకు గురవుతున్న ఆదివాసీ గూడేలను సందర్శించి, వారి కష్టాలకు చలించిపోయింది. అదే ఆమెపై ప్రభావం చూపిందని సన్నిహితులంటున్నారు. 2013-14 మధ్యకాలంలో విజయలక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లింది.
మావోయిస్టు పార్టీలో చేరిన మొదటి రోజు విషయాలను ‘వసంత మేఘం’ అనే వెబ్‌సైట్‌లో ఓ కథను రాసింది. తానెందుకు గెరిల్లాగా మారాననే విషయాలతో పాటు ఓయూలో జరిగిన ఉద్యమాన్ని గుర్తు చేసుకుంది. విజయలక్ష్మి దాదాపు 12 ఏళ్ల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేసి, చివరికి ప్రధాన కార్యదర్శి నంబాల రక్షణ బృందంలో ఉంటూ మరణించింది. విజయలక్ష్మి మృతిపై ఓయూ జేఏసీ నేతలు దిగ్ర్భాంతికి గురయ్యారు. తెలంగాణ ఉద్యమంలో ఆమెతో కలిసి చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. అయితే, 13 ఏళ్ల కిందట హైదరాబాద్ వెళ్లిన విజయలక్ష్మి ఎక్కడుందో.. ఏం చేస్తుందో తండ్రికి, బంధువులకు తెలియదు. ఎన్నడూ తనను పలకరించలేదని.. కనీసం ఫోన్ కూడా చేయలేదని తండ్రి సాయిలు తెలిపా రు. ఆమె మావోయిస్టుల్లో చేరిన విషయం కూడా తెలియదని, మృతి చెందింది విజయలక్ష్మా? కాదా? అన్నది కూడా సమాచారం లేదని బంధువులు చెప్పారు. అబూజ్‌మడ్ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేశవరావుతో పాటు తెలంగాణ, ఏపీకి చెందిన నలుగురు చనిపోయారు. వీరిలో జంగు నవీన్ అలియాస్ మధు ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. ఇతని స్వస్థలం ప్రకా శం జిల్లా. అలాగే సంగీత, భూమిక తెలంగాణ వాసులని పోలీసులు చెబుతున్నారు. అలాగే యుగేంద్ర అలియాస్ వివేక్‌ది తెలంగాణ అని పేర్కొన్నారు.
నంబాల ఎన్‌కౌంటర్‌తో బలగాల సంబరాలు
అబూజ్‌మడ్ అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగిన అనంతరం నారాయణపూర్ జిల్లాకు చెందిన డీఆర్‌జీ బలగాలు సంబరాలు చేసుకున్నాయి. మృతదేహాల ఎదుట అడవిలో డ్యాన్సులు వేశారు. గురువారం సాయంత్రం నారాయణపూర్ జిల్లా పోలీస్ కేంద్రంలోనూ డీజేలు పెట్టుకొని నృత్యాలు చేశారు. బలగాల కుటుంబ సభ్యులు వారికి తిలకాలు దిద్దారు.
ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టుల మృతి
మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్ అడవుల్లో రెండు ఎన్‌కౌంటర్లు జరిగాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు, సుకుమా జిల్లా కిష్టారం అడవుల్లో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో ఓ మావోయిస్టు మృతి చెందారు. కాగా, ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌లో 24 మంది, దంతెవాడలో 9 మంది మావోయిస్టులు లొంగిపోయారు.