Share News

Kurnool Tragedy: అగ్నికి ఆహుతి

ABN , Publish Date - Oct 25 , 2025 | 05:58 AM

దీపావళి సెలవులు సరదాగా గడిపి తిరిగి బయలుదేరిన వారు కొందరు... ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారు కొందరు...

Kurnool Tragedy: అగ్నికి ఆహుతి

దీపావళి సెలవులు సరదాగా గడిపి తిరిగి బయలుదేరిన వారు కొందరు... ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారు కొందరు... వ్యాపార, ఇతర అవసరాల కోసం ప్రయాణమైన వారు కొందరు... గమ్యస్థానం బెంగళూరు... స్లీపర్‌ బస్సులో ఆదమరిచి నిద్రిస్తున్నారు! అదే వారికి శాశ్వత నిద్ర అయ్యింది. బహుశా... ‘బస్సు ఢీ... బైకర్‌ మృతి’ అని మాత్రమే వినాల్సిన వార్త! కానీ... మొత్తంగా 20 నిండు ప్రాణాలు సజీవ దహనమయ్యాయి. వారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఆరు రాష్ట్రాలకు చెందిన వారు బాధితులుగా మిగిలారు. కర్నూలు నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో జరిగిన పెను విషాదమిది! ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు, ఇతర అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం..... ఇవీ ఆ వివరాలు!

19 మంది సజీవ దహనం

  • హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ‘వేమూరి కావేరి’ బస్సు

  • జాతీయ రహదారిపై బైక్‌ను ఢీకొట్టి 200 మీటర్లు అలాగే ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌

  • బస్సు కింద ఇరుక్కుపోయిన పల్సర్‌ బైక్‌.. పెట్రోల్‌ ట్యాంకు మూత ఊడి మంటలు

  • క్షణాల్లో బస్సుకు వ్యాపించిన అగ్నికీలలు.. సెన్సర్లు పనిచేయక తెరుచుకోని డోర్లు

  • బయటికి వచ్చే దారి లేక ప్రయాణికుల ఆర్తనాదాలు.. బస్సులోనే మాడిమసి

  • డీఎన్‌ఏ పరీక్షల అనంతరమే మృతదేహాల అప్పగింత

  • 27 మంది సురక్షితంగా బయటకు.. బస్సు ఢీకొనడంతో యువకుడి మృతి

(కర్నూలు - ఆంధ్రజ్యోతి)

అది... ‘వేమూరి కావేరి’ ట్రావెల్స్‌ బస్సు! డీడీ01 ఎన్‌9490 నంబర్‌... మల్టీ యాక్సిల్‌ స్కానియా ఏసీ స్లీపర్‌ బస్‌! హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళుతోంది! గురువారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో బయలుదేరింది. 11:05 గంటలకు ఆరాంఘర్‌ చౌరస్తాకు చేరుకుంది. అక్కడ ముగ్గురు ప్రయాణికులను ఎక్కించుకొని ఎన్‌హెచ్‌-44పై బెంగళూరు దిశగా కదిలింది.


రిజర్వేషన్‌ చేయించుకున్న ప్రయాణికులు 39 మంది... టికెట్‌ అక్కర్లేని చిన్న పిల్లలు నలుగురు... మధ్యలో ఎక్కిన మరో ప్రయాణికుడు... ఇద్దరు డ్రైవర్లు! బస్సులో మొత్తం 46 మంది! బెంగళూరులో వివిధ కంపెనీల్లో పని చేసే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, ప్రైవేట్‌ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు, వివిధ వ్యాపారాలు చేసే వాళ్లు... పనులపైనా, దీపావళి పండుగ సెలవుల కోసం హైదరాబాద్‌కు వచ్చి.. తిరిగి బెంగళూరుకు వెళ్తున్నవారే అధికం! సిటీ దాటగానే... ఒక్కొక్కరుగా నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి దాటాక 2.40 గంటల సమయంలో... బస్సు చిన్న టేకూరు దాటుతోంది. బస్సుకు ఇద్దరు డ్రైవర్లున్నారు. ఆ సమయంలో మిర్యాల లక్ష్మయ్య బస్సు నడుపుతున్నాడు. అంతకుముందు వరకు బస్సు నడిపిన మరో డ్రైవర్‌ శివనారాయణ... వెనుకవైపు డిక్కీలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అంతలో ఏం జరిగిందంటే....

దఢేల్‌మనే శబ్దంతో...

ఏపీలోని కర్నూలు శివారు ప్రాంతం ప్రజానగర్‌ చెందిన బి.శివశంకర్‌(21) అనే యువకుడు ఇళ్లలో గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ పనులు చేస్తుంటాడు. నంద్యాల జిల్లా డోన్‌లో పని దొరికింది. తెల్లవారక ముందే అక్కడ ఉండాలని అర్ధరాత్రి తర్వాతే బయల్దేరాడు. కానీ... అతడిని దురదృష్టం వెంటాడింది. శివశంకర్‌ పల్సర్‌ బైక్‌ను వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. శివశంకర్‌ ఎగిరి రోడ్డుపక్కన పడిపోయాడు. బైక్‌ మాత్రం బస్సు కిందికి వెళ్లి... ముందు వైపున్న యాక్సిల్‌లో ఇరుక్కుంది. ‘దఢేల్‌’ అంటూ పెద్ద శబ్దం... కుదుపు! ప్రయాణికుల్లో కొందరికి మెలకువ వచ్చింది కానీ... ఏం జరిగిందో తెలియదు! ఆ సమయంలో బస్సు గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. అప్పటికప్పుడు బ్రేక్‌ వేసి, బస్సును ఆపి ఉంటే సరిపోయేది. కానీ... ప్రమాదం జరిగిందన్న కంగారువల్లో, మరే కారణం చేతనో డ్రైవర్‌ ఆ పని చేయలేదని తెలుస్తోంది. సుమారు 200 మీటర్లు అలాగే... బస్సును ముందుకు తీసుకెళ్లాడు! దాని ఫలితమే...

4.jpg5.jpg3.jpg2.jpg


కాల్చేసిన నిప్పు రవ్వలు

బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్‌... రోడ్డును బలంగా రాసుకుంటూ అలాగే వచ్చేసింది! ఈ క్రమంలో బైక్‌ పెట్రోల్‌ ట్యాంక్‌ మూత ఊడిపోయింది. పెట్రోల్‌ బయటికి చిమ్మింది. బైక్‌, రోడ్డు మధ్య జరిగిన రాపిడితో నిప్పు రవ్వలు ఎగిశాయి. పెట్రోలు అంటుకుంది. దాంతోపాటు బస్సుకు కూడా మంటలు వ్యాపించాయి. డ్రైవర్‌ లక్ష్మయ్య వెంటనే బయటకు దూకాడు. వెనుక వైపు డిక్కీలో నిద్రిస్తున్న మరో డ్రైవర్‌ శివనారాయణను లేపాడు. ‘బస్సుకు మంటలు అంటుకున్నాయి’ అని కేకలు వేసి... అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బస్సులోపలున్న ప్రయాణికులను మృత్యుకీలలు ఆవరించడం మొదలైంది. బైక్‌ను ఢీకొట్టిన సమయంలో వచ్చిన శబ్దానికి మేల్కొన్న కొందరు ప్రయాణికులు బస్సు డ్రైవర్‌ వెళ్లిన మార్గంలోనే కిందికి దూకారు. ‘మంటలు... మంటలు... బస్సుకు నిప్పంటుకుంది దూకండి.. దూకండి’ అంటూ బిగ్గరగా కేకలు వేశారు. గాఢ నిద్రలో ఉన్న వారు ఉలిక్కిపడి లేచారు. అప్పటికే పొగలు కమ్ముకుంటున్నాయి. మంటలు, వేడికి సెన్సర్లు పనిచేయకపోవడంతో... ‘ఆటోమేటిక్‌ డోర్లు’ లాక్‌ అయిపోయాయి. అత్యవసర (ఎమర్జెన్సీ) ద్వారాలు కూడా తెరుచుకోలేదు. అద్దాలు పగలగొట్టేందుకు అవసరమైన ‘హ్యామర్లు’ కూడా కనిపించలేదు. లోపలున్న వారిది దిక్కుతోచని పరిస్థితి! చేతులతో, భుజాలతో అద్దాలు పగలగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈలోపే... రెండో డ్రైవర్‌ శివనారాయణ జాకీ తీసి బయటి నుంచి అద్దాలు పగొలగొట్టాడు. బస్సు వెనుకే మరో కారులో వెళుతున్న హరీశ్‌ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి రాళ్లతో అద్దాలు బద్దలు కొట్టాడు. దీంతో... లోపలున్న ప్రయాణికుల్లో కొందరు చకచకా కిందికి దూకారు. అప్పటికే బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. ముందు వైపున స్లీపర్‌ బెర్తుల మధ్య ఇరుక్కున్న వారు బయటికి వచ్చే మార్గమే కనిపించలేదు. వారంతా నిస్సహాయ స్థితిలో.. అగ్ని కీలల మధ్య ఆర్తనాదాలు చేస్తూ సజీవ దహనమయ్యారు. మృతదేహాలన్నీ గుర్తుపట్టలేనంతగా... మాంసపు ముద్దలుగా మారాయి. పోలీసులు వచ్చేసరికే... ఆరుగురు క్షతగాత్రులు ప్రైవేట్‌ వాహనాల్లో ఆస్పత్రికి చేరుకున్నారు. మిగిలిన వారిని అంబులెన్స్‌లలో ఆస్పత్రికి తరలించారు. మృతులలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారూ ఉండటంతో మంత్రి జూపల్లి కృష్ణారావు, అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడుతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.


ఆ బస్సులో భారీగా కొత్త సెల్‌ఫోన్లు

కర్నూలు క్రైం: కాలిపోయిన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సులో ఖరీదైన 234 సెల్‌ఫోన్లు దగ్ధమయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన మంగనాథ్‌ అనే వ్యాపారి రూ.46లక్షలు విలువైన రియల్‌మీ కంపెనీ సెల్‌ఫోన్ల బాక్సులను బస్సులో పార్సిల్‌ చేశారు. ఇవి బెంగళూరులోని ఫ్లిప్‌కార్టుకు చేరాల్సి ఉంది. అక్కడి నుంచి కస్టమర్లకు అవి సరఫరా అవుతాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఆయన హైదరాబాద్‌ నుంచి ప్రమాద స్థలానికి చేరుకుని, లబోదిబోమన్నారు. కాగా.. ప్రమాదంలో మంటల తీవ్రత పెరగడానికి ఈ సెల్‌ఫోన్ల బ్యాటరీలు పేలిపోవడం కూడా ఓ కారణమేనని ఫోరెన్సిక్‌ నిపుణులు అంటున్నారు. మంటలకు ఆ ఫోన్లు కాలిపోవడంతో బ్యాటరీలు పేలిపోయిన శబ్దం వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు.

నా రెండు కాళ్లు విరిగాయి

25 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం తల్లిదండ్రులు హైదరాబాద్‌ వచ్చారు. మూసాపేటలో నివాసం ఉంటున్నాం. బీటెక్‌ పూర్తి చేశాను. బెంగళూరులో ఇంటర్వ్యూ ఉండటంతో గురువారం రాత్రి బయల్దేరాను. బస్సులో మంటలు చెలరేగడంతో అద్దాన్ని పగులకొట్టి బయటికి దూకేశాను. నా రెండు కాళ్లు విరిగాయి. ప్రస్తుతం నంద్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాను. నా కళ్లెదుటే బస్సు మంటల్లో ప్రయాణికులు కాలిపోయారు.

- జయసూర్య, నెమళ్లదిన్నె,

పెద్దముడియం మండలం, కడప జిల్లా

Updated Date - Oct 25 , 2025 | 05:58 AM