Uttam : చేతికొచ్చిన పంటల రక్షణే ప్రభుత్వ కర్తవ్యం
ABN , Publish Date - Mar 11 , 2025 | 04:59 AM
చేతికొచ్చిన పంటలను కాపాడుకోవడ మే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఆ దిశగానే పనిచేయాలని వారికి సూచించారు.

చివరి భూములకూ నీరందేలా చూడాలి
విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు
మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : చేతికొచ్చిన పంటలను కాపాడుకోవడ మే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఆ దిశగానే పనిచేయాలని వారికి సూచించారు. ప్రాజెక్టుల నుంచి సాగునీటి విడుదల విషయంలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, వాస్తవాలు ప్రజలకు వివరించాలన్నారు. సచివాలయం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన సోమవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, వ్యవసాయ శాఖ అఽధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రబీ సీజన్ పంట మరో 15 రోజుల్లో చేతికి రానుందని, అధికారులంతా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులకు తోడ్పాటు అందించాలన్నారు. తొలుత ఆయకట్టు చివరి భూములకు నీరు అందేలా చూడాలన్నారు. పంటలు కీలక దశలో ఉన్నాయని, వాటిని కాపాడుకోవడానికి అవసరమైన ప్రయత్నాలు చేయాలన్నారు.
క్షేత్రస్థాయిలో నిజానిజాలు తెలుసుకోకుండా పంటల నష్టం గురించి దుష్ప్రచారం జరుగుతుందని, దీన్ని కట్టడి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. బోర్లు ఎండిపోవడం, మోటార్లు కాలిపోవడం వంటి కారణాలతో పంటనష్టం జరుగుతుందంటూ.. రాజకీయంగా వాడుకోవడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని, వాస్తవాలు రైతులకు వివరిస్తూ ముందుకెళ్లాలన్నారు. ప్రణాళిక ప్రకారం రబీలో నీటిని అందించడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ, నిరంతరం పరిస్థితిని గమనిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చెప్పారు. రబీ సాగులో రైతులకు ఇబ్బందులు లేకుండా నీటిని అందించడంతో పాటు 24 గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ గుర్తుచేశారు.