Share News

Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్ల డీపీఆర్‌ సవరించండి

ABN , Publish Date - Sep 09 , 2025 | 05:23 AM

ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని, ఇందుకోసం తక్షణమే సవరణ డీపీఆర్‌ను సిద్ధం చేసి, అనుమతుల కోసం దాఖలు చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.

Uttam Kumar Reddy: ప్రాణహిత-చేవెళ్ల డీపీఆర్‌ సవరించండి

  • తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి కట్టుబడి ఉన్నాం

  • మేడిగడ్డ పునరుద్ధరణ డిజైనర్‌గా ఐఐటీ రూర్కీ వద్దు

  • సమ్మక్క సాగర్‌ పనుల వేగం పెంచండి: మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని, ఇందుకోసం తక్షణమే సవరణ డీపీఆర్‌ను సిద్ధం చేసి, అనుమతుల కోసం దాఖలు చేయాలని అధికారులను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. జలసౌధలో సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికానున్న నేపథ్యంలో డిసెంబరు నాటికల్లా పనులను వేగిరం చేయాలన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాణహిత-చేవెళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలన్నారు. సీతారామ ఎత్తిపోతల పథకం, చనకా కొరాటా, చిన్న కాళేశ్వరం(ముక్తేశ్వర్‌), మొడికుంటవాగు ప్రాజెక్టులకు టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ(టీఏసీ) అనుమతులు లభించిన నేపథ్యంలో ప్రధానమంత్రి కృషి సింఛాయ్‌ యోజన(పీఎంకేఎ్‌సవై-ఏఐబీపీ) కింద సాయం కోసం అభ్యర్థించాలని ఆదేశించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లు, పరీక్షలు ఎక్కడి దాకా వచ్చాయని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో) చీఫ్‌ ఇంజనీర్‌(సీఈ)ను మంత్రి ప్రశ్నించారు. కొత్త బ్యారేజీల డిజైన్లు/డ్రాయింగ్‌లు సిద్ధం చేయడానికి ఐఎ్‌స(భారతీయ ప్రమాణాల)కోడ్‌లు ఉన్నాయి కానీ.. బ్యారేజీలు కుంగినప్పుడు పునరుద్ధరణకు ఏం చేయాలన్న దానిపై కోడ్‌లు లేకపోవడంతో డిజైన్లు తయారు చేయలేకపోతున్నామని ఆయన పేర్కొన్నారు. దీంతో ఉత్తమ్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్ల తయారీ బాధ్యత నుంచి తప్పించుకోలేరని స్పష్టంచేశారు. అలాగే, బ్యారేజీల పునరుద్ధరణ డిజైనర్‌గా ఐఐటీ రూర్కీని నియమించాలన్న ప్రతిపాదన రాగా... బ్యారేజీలు నిర్మించిన సమయంలో కన్సల్టెంట్‌గా ఐఐటీ రూర్కీ ఉందని, ఇప్పుడు ఆ సంస్థ సేవలు అక్కర్లేదని మంత్రి తేల్చిచెప్పారు. దీనికి బదులుగా ఐఐటీ మద్రాసు వంటి పురాతన విద్యాసంస్థల సేవలు తీసుకోవాలని, వారిచ్చే డిజైన్లకు చట్టబద్ధత కల్పించాల్సింది సీడీవో సీఈనేనని తేల్చిచెప్పారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉద్ధండపూర్‌ వద్ద భూసేకరణ సమస్యలు ఉన్నాయని అధికారులు పేర్కొనగా... త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి సూచించారు. కొడంగల్‌-నారాయణపేట, డిండి ఎత్తిపోతల పథకం, పెండ్లిపాకల, నక్కలగండి రిజర్వాయర్ల పనుల కోసం సత్వరమే భూసేకరణ చేపట్టాలన్నారు. ఎన్‌డీఎ్‌సఏ నివేదిక ప్రకారం జూరాల ప్రాజెక్టు కట్టపై వాహనాల రాకపోకల నియంత్రణకు దిగువన ప్రత్యామ్నాయంగా బ్యారేజీ కమ్‌ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి దేవాదుల ఎత్తిపోతల పథకం ప్యాకేజీ-3, 6కింద పనుల పురోగతిపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ పనుల పునరుద్ధరణలో భాగంగా హెలిబోర్న్‌ సర్వేకు రెండు హెలికాప్టర్లు సిద్ధంగా ఉన్నాయని, తక్షణమే ఏరియల్‌ మ్యాగ్నటిక్‌ సర్వే చేపట్టాలని సూచించారు.


సమ్మక్కసాగర్‌కు ఎన్వోసీ కోసం ఛత్తీ్‌సగఢ్‌కు

సమ్మక్కసాగర్‌ ప్రాజెక్టు(తుపాకులగూడెం బ్యారేజీ)కు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) కోసం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రంగంలోకి దిగారు. బుధవారం ఆయన ఛత్తీ్‌సగఢ్‌ వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర సీఎం విష్ణుదేవ్‌ సాయిని నేరుగా కలిసి ఎన్వోసీ జారీ చేయాలని మంత్రి కోరనున్నారు. ఈనెల 23న సీడబ్ల్యూసీ ఈ ప్రాజెక్టుపై సమావేశం నిర్వహించనుంది. ఈలోగా ఛత్తీ్‌సగఢ్‌ నుంచి ఎన్వోసీ వస్తే ప్రాజెక్టు గట్టెక్కే అవకాశాలుండటంతో మంత్రి ఉత్తమ్‌ రంగంలోకి దిగారు.

Updated Date - Sep 09 , 2025 | 05:23 AM