Share News

Uttam Kumar Reddy: వరదల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించం

ABN , Publish Date - Aug 20 , 2025 | 04:21 AM

కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల కింద పంటల సాగుకు అనువైన పరిస్థితులున్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. వరదల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమన్నారు.

Uttam Kumar Reddy: వరదల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని సహించం

  • సాగు అవసరాలను పరిగణనలోకి తీసుకోండి

  • సమీక్షలో ఇంజనీర్లకు మంత్రి ఉత్తమ్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల కింద పంటల సాగుకు అనువైన పరిస్థితులున్నాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. వరదల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమన్నారు. వరదల నిర్వహణ, సాగునీటి సరఫరా.. ఈ రెండింటికీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. జలసౌధలో మంగళవారం ఈఎన్‌సీలతోపాటు క్షేత్ర స్థాయి సీఈలు, ఎస్‌ఈలు, ఈఈలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన సమీక్షించారు. జలాశయాల వద్ద నిరంతరం వరదలను పర్యవేక్షిస్తూ వరద ముప్పును ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో ఉండాలని ఆదేశించారు. ఈవిషయంలో నీటిపారుదల, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.


ప్రస్తుత ఖరీఫ్‌, వచ్చే రబీ పంటల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, గోదావరి జలాలను ఒడిసిపట్టుకోవాలని సూచించారు.గరిష్ఠ సామర్థ్యంతో పంప్‌హౌ్‌సల ద్వారా నీళ్లను ఎత్తిపోయాలని ఆదేశించారు. ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్‌, మిడ్‌మానేరు ప్రాజెక్టులను బుధవారం తానే స్వయంగా పరిశీలిస్తానని వెల్లడించారు. రాష్ట్రంలో 34,740 చెరువులు ఉండగా, 12,023 చెరువులు పూర్తిగా నిండాయని, 9,100 చెరువులు 75శాతం వరకు నిండాయన్నారు. 177 చెరువులు, కాల్వలు, ఎత్తిపోతల పథకాలకు గండ్లు పడినట్లు క్షేత్ర స్థాయి నుంచి నివేదికలు అందాయన్నారు. రూ.335కోట్లతో చేపట్టిన పునరుద్ధరణ పనులను వేగిరం చేయాలని సూచించారు. చెరువుల కింద పూర్తి ఆయకట్టుకు సాగునీరందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - Aug 20 , 2025 | 04:21 AM