Share News

Uttam: కుంగే బ్యారేజీలకు నీళ్లు ఎత్తిపోయాలా?

ABN , Publish Date - Jul 07 , 2025 | 02:15 AM

అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్‌సఏ) హెచ్చరించింది.

Uttam: కుంగే బ్యారేజీలకు  నీళ్లు ఎత్తిపోయాలా?

  • ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు హరీశ్‌ యత్నం

  • రైతులు బాగుంటే ఓర్వలేకపోతున్నారా?

  • రికార్డు స్థాయిలో వరి పంట సాగయింది

  • ఇప్పటికైనా అబద్ధాలు మాట్లాడడం మానుకోవాలి: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): ‘‘అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎ్‌సఏ) హెచ్చరించింది. అయినా సరే, కన్నెపల్లి పంప్‌హౌజ్‌ నుంచి నీటిని ఎత్తిపోయాలని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌ రావు పదే పదే మాట్లాడుతున్నారు. దీని వెనుక ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర తప్ప రైతులకు మేలు చేసే ఉద్దేశం లేదు. కుంగే బ్యారేజీలకు నీళ్లు ఎత్తిపోయాలా?’’ అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్‌ పానలనో రైతులు బాగుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. గతంలో మేడిగడ్డ బ్యారేజీ నుంచి అన్నారం, సుందిళ్ల, అక్కణ్నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్‌ చేసిన 160 టీఎంసీలలో దాదాపు 57 టీఎంసీల నీళ్లు మళ్లీ గేట్లు ఎత్తి సముద్రానికి పంపించి ప్రజాధనాన్ని గోదాట్లో పోసిన విషయం మరిచిపోయారా..? అని ప్రశ్నించారు. సీకెంట్‌ ఫైల్స్‌ టెక్నాలజీతో మేడిగడ్డ నిర్మాణం చేపట్టిన విషయాన్ని ఎన్డీఎ్‌సఏ తప్పుబట్టిందని తెలిపారు. మేడిగడ్డ మాదిరిగానే అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను అదే సీకెంట్‌ ఫైల్స్‌ పౌండేషన్‌ టెక్నాలజీతో నిర్మించటంతో ప్రమాదకరంగా మారాయని పేర్కొన్నారు.


ఎన్డీఎ్‌సఏ సలహాలు, సూచనల మేరకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులపై తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. గోబెల్స్‌కు మించి ప్రచారం చేయటం హరీశ్‌ రావుకు అలవాటైపోయిందని, ఇప్పటికైనా అబద్ధాలు మా ట్లాడడం మానుకోవాలన్నారు. గత ఏడాది వానాకాలంతో పాటు ఇటీవలి యాసంగిలో దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణ రైతులు రికార్డు స్థాయిలో వరి పంట సాగు చేశారని చెప్పారు. గత వానాకాలంలో 66.7 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసి 153.5 లక్షల మెట్రి క్‌ టన్నుల ధాన్యం పండించారని, యాసంగిలో 60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే.. 130 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి సాధించిన ఘనత తెలంగాణ రైతులదని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే ఒకే ఏడాదిలో 283 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సాధించిన రికార్డు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో సాధ్యమైందన్నారు. ప్రతి ఏడాది జూలై చివరిలో లేదా ఆగస్టు ఒకటో తేదీన కల్వకుర్తి పంపులను ప్రారంభించి వానాకాలం పంటలకు నీళ్లు అందిస్తారని, ఈసారీ అదే విధానం అమలవుతుందని ఆయన వెల్లడించారు.

Updated Date - Jul 07 , 2025 | 02:15 AM