Uttam Kumar Reddy: ఫాస్ట్రాక్‌లో భూసేకరణ: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Jul 13 , 2025 | 04:08 AM
రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన భూ సేకరణను ఫాస్ట్రాక్ విధానంలో చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన భూ సేకరణను ఫాస్ట్రాక్ విధానంలో చేపట్టాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూసేకరణతో పాటు నిర్వాసితుల పునరావాసం, పునర్‌నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆయన నిర్దేశించారు. నీటిపారుదలశాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ తదితరులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. భూసేకరణ ప్రక్రియను జిల్లా యూనిట్‌గా చేసుకొని చేపట్టాలని, జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని, చట్టపరమైన, పాలనాపరమైన అంశాలను తక్షణం పరిష్కరించాలని సూచించారు.
రైతులు స్వచ్ఛందంగా భూములు ప్రాజెక్టులకు ఇచ్చేలా చూడాలన్నారు. పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోతల పథకం పనుల పూర్తికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మాజీ ఈఎన్‌సీ హర్పాల్‌సింగ్ గౌరవ సలహాదారుగా, అంతర్జాతీయ టన్నెల్ ఇంజనీరింగ్ నిపుణుడు కల్నల్ పరిక్షిత్ మెహ్రాలను నీటిపారుదల శాఖలోకి తీసుకుంటామని, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌తో పాటు ఇతర టన్నెల్ పనులను నిరంతరం సమీక్షించే బాధ్యతలను వారు తీసుకుంటారని చెప్పారు.