Kaleshwaram Project: మేడిగడ్డ గుండె పగిలింది!
ABN , Publish Date - May 25 , 2025 | 04:20 AM
తుమ్మడిహెట్టిని కాదని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ బ్యారేజీ మెయిన్ గుండె అని బీఆర్‌ఎస్ నేతలు చెప్పారని, కానీ ఇప్పుడు మేడిగడ్డ గుండె పగిలిందని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

విచారణ కమిషన్‌పైనే విమర్శలంటూ మండిపాటు
ఎవరు బాంబులేస్తే కాళేశ్వరం కూలిందో చెప్పాలి: మంత్రి ఉత్తమ్
హుజూర్‌నగర్, మే 24 (ఆంధ్రజ్యోతి): తుమ్మడిహెట్టిని కాదని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ బ్యారేజీ మెయిన్ గుండె అని బీఆర్‌ఎస్ నేతలు చెప్పారని, కానీ ఇప్పుడు మేడిగడ్డ గుండె పగిలిందని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు.. ఆ పార్టీ అధికారంలో ఉండగానే కూలిందని ఎద్దేవా చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండల కేంద్రంలోని తన ఇంట్లో ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవినీతి, అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాక ఘోష్ కమిషన్ నోటీసులివ్వడాన్ని బీఆర్‌ఎస్ నేతలు తప్పుబట్టడం సిగ్గు చేటని పేర్కొన్నారు. విచారణ జరుపుతున్న కమిషన్ చైర్‌పర్సన్- సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పైనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
బీఆర్‌ఎస్ నేతలకు నోటీసులిస్తే.. కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ నేతలే బాంబులు పెట్టారని మాట్లాడటం శోచనీయం అని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. ఎవరు బాంబులు పెడితో కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందో బీఆర్‌ఎస్ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు పునాదుల్లోనే తప్పు జరిగిందని పేర్కొన్నారు. అంబేడ్కర్ పేరుతో గత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన తుమ్మడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే తమ పార్టీకి పేరొస్తుందన్న రాజకీయ దురుద్దేశంతోనే మేడిగడ్డకు తరలించారని ఉత్తమ్ ఆరోపించారు. కాళేశ్వరం పథకానికి రూ. లక్ష కోట్లకు బదులు తుమ్మడిహెట్టి వద్ద రూ.38 వేల కోట్లతో ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. కానీ, కేవలం కమీషన్లకు కక్కుర్తి పడి, రాజకీయ దురుద్దేశంతోనే డిజైన్లు మార్చేసి, అంచనాలు నాలుగింతలు పెంచేసి అవినీతికి పాల్పడటంతోపాటు తెలంగాణ సమాజాన్ని మోసగించారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటిపారుదలశాఖ ఆగం కాగా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని పేర్కొన్నారు.