Share News

Urea shortage: ఎరువు దొరికేదెప్పుడు?

ABN , Publish Date - Aug 22 , 2025 | 05:54 AM

ప్రాథమిక దశలోనే యూరియా వేస్తే పంట ఏపుగా ఎదుగుతుంది. ఇప్పుడా యూరియానే బంగారమైపోయింది. తెల్లారకముందే చాంతాడంత క్యూలో నిల్చున్నా బస్తా యూరియా సంపాదించడం కనాకష్టంగా మారింది.

Urea shortage: ఎరువు దొరికేదెప్పుడు?

  • కొనసాగుతున్న రైతుల అవస్థలు

  • భారీగా లైన్లు.. తోపులాటలు

  • ఆగ్రహంతో ఎరువుల కేంద్రాల

  • సిబ్బందిపై తిరగబడుతున్న వైనం

  • రోడ్లపై ధర్నాలు.. రాస్తారోకోలు

మరిపెడ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక దశలోనే యూరియా వేస్తే పంట ఏపుగా ఎదుగుతుంది. ఇప్పుడా యూరియానే బంగారమైపోయింది. తెల్లారకముందే చాంతాడంత క్యూలో నిల్చున్నా బస్తా యూరియా సంపాదించడం కనాకష్టంగా మారింది. ఎరువు లేక పంటల్లో ఎదుగుదల లోపిస్తోందనే ఆవేదన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఆ ఆవేదన చాలా చోట్ల ఆగ్రహంగా మారి అన్నదాతలను రోడ్డెక్కేలా చేస్తోంది. గురువారం కూడా చాలాచోట్ల రైతులు.. ఎరువుల కేంద్రాల వద్ద నిరసన వ్యక్తం చేశారు. గుంపులు గుంపులుగా రహదారుల మీదకొచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. క్యూలైన్లలో తోపులాటలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల సిబ్బందిపై రైతులు తిరగబడుతున్నారు. మహబూబాబాద్‌ జిల్లా మరిపెడలో ఓ వృద్ధ రైతు ఎరువుల కేంద్రం వద్ద మెట్లపై నుంచి కిందపడగా తలకు గాయాలయ్యాయి. అక్కడ యూరియా దొరక్కపోవడంతో రైతులు రోడ్డు మీదకొచ్చి ధర్నా చేశారు. ఇరువైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. యూరియా బస్తాలిస్తేనే వెళ్తామని స్పష్టం చేశారు. పోలీసులొచ్చి ఆగ్రోస్‌ కేంద్రం యజమానిని దుకాణానికి రప్పించి నిల్వ ఉన్న కొంత యూరియాను కొందరు రైతులకు ఇప్పించారు. కురివిలో 444 యూరియా బస్తాలుండగా 1200 మందికి పైగా రైతులొచ్చారు. గార్లలో తెల్లవారుజామునే రైతులు క్యూలో నిల్చున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని సహకార మార్కెటింగ్‌ సంఘం వద్ద క్యూలైన్‌లో రైతులు చెప్పులు ఉంచారు. జిల్లాలోని హన్వాడ, భూత్పూర్‌, దేవరకద్ర మండలాల్లో భారీ క్యూలైన్లు కనిపించాయి. పదెకరాలున్న రైతుకు కూడా ఒకే బస్తా యూరియా ఇస్తారా? అంటూ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ గ్రామంలో రైతులు ఆవేదనగా ప్రశ్నించారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచ సొసైటీ వద్ద క్యూలైన్‌లో రైతుల మధ్య తోపులాట జరిగింది. వరంగల్‌ జిల్లా చెన్నారావుపేటలో 450 బస్తాల యూరియా రాగా.. రైతులకు తలా రెండు బస్తాలిచ్చారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులో తలా రెండు బస్తాలే ఇస్తామని చెప్పడంతో సిబ్బందిపై రైతులు తిరగబడ్డారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో రైతులు రాస్తారోకో చేశారు. యూరియా కోసం డబ్బులు కట్టి వారం దాటినా పంపిణీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని చిన్నశంకరంపేట మండలంలోని సొసైటీ వద్దకు యూరియా లారీ రావడంతో అప్పటికే పెద్ద సంఖ్యలో వచ్చిన రైతులు టోకెన్ల కోసం ఎగబడ్డారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం లింగాపూర్‌లో పోలీసుల పహారా మధ్య టోకెన్లు పంపిణీ చేశారు.


‘ఆంధ్రజ్యోతి’ పేరుతో తప్పుడు కథనం

‘బ్లాక్‌ మార్కెట్‌లో తెలంగాణ యూరియా’ శీర్షికన ఓ కథనం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అది ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైనట్టుగా ఉండగా.. అది తప్పుడు కథనమని, దానికి ఆంధ్రజ్యోతి సంస్థకు సంబంధం లేదని, సంస్థ ప్రతిష్ఠ దెబ్బతీసేలా కొందరు తప్పుడు కథనం ప్రచురించారన్న విషయాన్ని ఖమ్మం ‘ఆంధ్రజ్యోతి’ బృందం పోలీసు కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు ఖమ్మం బ్రాంచ్‌ మేనేజర్‌ టి. పుల్లారావు, బ్యూరో ఇన్‌చార్జ్‌ ఎన్‌.వెంకటరావు, ఎడిషన్‌ ఇన్‌చార్జ్‌ కె.రాజేశ్‌, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ప్రతినిధి శ్రీధర్‌, రిపోర్టర్లు బి.రాఘవ, ఎస్‌.రాము గురువారం సీపీకి ఫిర్యాదు చేశారు. ‘బ్లాక్‌ మార్కెట్‌లో తెలంగాణ యూరియా.. దొడ్డిదారిన వేరే రాష్ట్రాలకు’ అంటూ కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ కథ నం క్లిప్పింగ్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ‘ఖమ్మం అంధజ్యోతి’ డేట్‌లైన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి యూరియా ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారని, ముఖ్యమంత్రితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి పతిష్టను దెబ్బతీసేలా ఈ కథనం ఉండటంతో సంబంధిత వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని, ఈ కథనం ‘ఆంధ్రజ్యోతి’ కథనంలా ప్రజలను నమ్మించే విధంగా ఉందని, సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు. స్పందించిన సీపీ విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలనిు ఖమ్మం సీపీని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. వాట్సాప్‌ గ్రూపుల్లో వైరల్‌ అవుతున్న ఈ కథనాన్ని ఎవరు పెట్టారు? ఎందుకు పెట్టారన్న దానిపై ఆరా తీయాలని, పూర్తి విచారణ చేయాలని ఆయన ఖమ్మం సీపీకి సూచించారు. కాగా తప్పుడు కథనం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Aug 22 , 2025 | 05:54 AM