Urea Shortage: యూరియా కొరత.. రైతన్న వెత
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:00 AM
రాష్ట్రంలో యూరియా కొరత సమస్య కొనసాగుతోంది. అక్కడక్కడా సరఫరా జరుగుతున్నా.. సరిపడా నిల్వలు అందుబాటులో లేక రైతుల అవసరం తీరడం లేదు.
దుకాణాలు, పీఏసీఎ్‌సల వద్ద అవే పడిగాపులు... పలు చోట్ల రైతుల రాస్తారోకోలు, ధర్నాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): రాష్ట్రంలో యూరియా కొరత సమస్య కొనసాగుతోంది. అక్కడక్కడా సరఫరా జరుగుతున్నా.. సరిపడా నిల్వలు అందుబాటులో లేక రైతుల అవసరం తీరడం లేదు. ఎరువుల దుకాణాలు, పీఎసీఎస్ కేంద్రాల వద్ద భారీ క్యూలైన్లు, తోపులాటలు కొనసాగుతున్నాయి. యూరియా కోసం పడిగాపులు పడుతున్న రైతులు చివరికి రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా, మెదక్ జిల్లాలోని పలు మండలాల్లోని ఎరువుల దుకాణాలు, పీఏసీఎస్ కేంద్రాల వద్ద శుక్రవారం తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. కొన్నిచోట్ల ఒక్కో బస్తా చొప్పున మాత్రమే పంపిణీ చేశారు. గజ్వేల్‌లో ఆందోళనకు దిగిన రైతులు వ్యవసాయాధికారి కాళ్లు మొక్కి యూరియా ఇవ్వాలని వేడుకున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం నిజాంపేట గ్రామంలోని పీఏసీఎస్ ఉపకేంద్రంలో తీవ్ర గందరగోళం మధ్య రైతులకు సుమారు 450 బస్తాల యూరియాను పంపిణీ చేశారు. ఇక, యూరియా కొరతకు నిరసనగా మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌లోని హైవేపై పెద్ద సంఖ్యలో రైతులు దాదాపు గంట సేపు బైఠాయించారు. వనపర్తి జిల్లా అమరచింత ఆగ్రో రైతు సేవా కేంద్రానికి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే రైతులు క్యూ కట్టారు. నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరులో ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద రైతులు గంటల తరబడి నిరీక్షించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం గుండ్లపల్లి వద్ద ఉన్న డీసీఎంఎస్ వద్ద గంటల తరబడి వేచి చూసిన రైతులు యూరియా రాదని అధికారులు చెప్పడంతో రాజీవ్‌రహదారిపై రాస్తారోకో చేశారు. రామడుగు మండలం గోపాల్‌రావుపేటలోని రైతు నేస్తం దుకాణంలో తోపులాట మధ్య రైతులకు యూరియా పంపిణీ జరిగింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం, జూలపల్లి. కాచాపూర్‌లో కొంతమేర యూరియా బస్తాల పంపిణీ జరగ్గా.. ఎరువులు దక్కని రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జూలపల్లిలోని ఎరువుల పంపిణీ ప్రాంతానికి సంఘం పరిధిలోకి రాని అబ్బాపూర్ రైతులు రావడంతో గందరగోళం నెలకొంది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి సహకార సంఘం కార్యాలయం ముందు యూరియా బస్తాల కోసం రైతులు ఆందోళన చేశారు.
ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి
మహబూబాబాద్‌లోని ఎమ్మెల్యే మురళీనాయక్ క్యాంపు కార్యాలయం ముట్టడికి రైతులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రహదారిపై బైఠాయించారు. మానుకోట మండల వ్యవసాయ అధికారి తిరుపతిరెడ్డి రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. వికారాబాద్ జిల్లా పరిగి ఆగ్రోస్ కేంద్రానికి వచ్చిన రైతులకు యూరియా లేదని చెప్పడంతో రోడ్డెక్కి నిరసనకు దిగారు. ఈ నిరసనకు బీఆర్‌ఎస్ శ్రేణులు మద్దతు పలకగా.. పోలీసుల రాకతో వాగ్వాదం జరిగింది. మాజీ ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా థారూర్‌లో పీఏసీఎస్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నేతలు దున్నపోతుతో వినూత్న నిరసన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో అన్నదాతలు ధర్నా చేశారు. తలకొండపల్లి పీఏసీఎ్‌స్ గోదాం వద్ద స్థానిక సీఐ నందీశ్వర్‌రెడ్డి రైతులతో కలిసి నిరసన తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..