Urea shortage: యూరియా కోసం నువ్వానేనా!
ABN , Publish Date - Aug 31 , 2025 | 04:20 AM
రైతులకు యూరియా కష్టాలు తీరేదెన్నడో గానీ తెల్లవారగానే క్యూలైన్లలో నిల్చోవడం వారికి తప్పడం లేదు. గంటల తరబడి నిరీక్షించినా సరిపడా బస్తాలు దొరక్కపోవడంతో నిరాశా తప్పడం లేదు.
నారాయణపేట జిల్లా తీలేరులో పోలీసులు, రైతుల మధ్య తోపులాట.. ఓ రైతును చెంపమీద కొట్టిన ఎస్సై
మహబూబాబాద్ జిల్లాలో రైతుల రాస్తారోకో
వాహనాల్లోంచి గాలి తీసేందుకు యత్నం
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): రైతులకు యూరియా కష్టాలు తీరేదెన్నడో గానీ తెల్లవారగానే క్యూలైన్లలో నిల్చోవడం వారికి తప్పడం లేదు. గంటల తరబడి నిరీక్షించినా సరిపడా బస్తాలు దొరక్కపోవడంతో నిరాశా తప్పడం లేదు. రైతుల్లో ఓపిక నశిస్తోంది. ఇప్పుడు యూరియా కేంద్రాల వద్ద తోపులాటలు, గొడవలూ జరుగుతున్నాయి. నారాయణపేట జిల్లా మరికల్ మండలం తీలేరు సింగిల్‌విండో కార్యాలయం దగ్గర శనివారం యూరియా పంపిణీ సందర్భంగా రభస జరిగింది. 600 బస్తాల యూరియా కోసం1200 మంది రైతులొచ్చారు. గుంపులు గుంపులుగా ఉన్న రైతులను పోలీసులు వరుసగా నిల్చోబెట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, రైతుల మద్య వాగ్వాదం జరిగింది. ఇది తోపులాటకు దారితీసింది. రైతులను అదుపుచేసే క్రమంలో ఎస్సై రాము సహనం కోల్పోయి మండలంలోని రాకొండకు చెందిన రైతు సత్యనారాయణరెడ్డి చెంపమీద కొట్టారు. ఈ ఘటన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.
తనను ఎస్సై ఉద్దేశపూర్వకంగా కొట్టారని ఆ రైతు ఆరోపిస్తే.. తన చేయి అనుకోకుండా ఆ రైతుకు తగిలిందని ఎస్పై పేర్కొన్నారు. కాగా రైతు పట్ల దురుసుగా ప్రవర్తించిన ఎస్సై రాముపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్, నర్సింహులపేట, గూడూరు మండలాల్లో రైతులు రాస్తారోకో చేశారు. ఆపై ఎమ్మెల్యే భూక్యా మురళిఽనాయక్ క్యాంపు ఆఫీసు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత గూడూరు మెయిన్‌రోడ్డుపై ధర్నా నిర్వహించడంతో 40 నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల టైర్ల నుంచి గాలి తీసేందుకు రైతుల్లో కొందరు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. నర్సింహులపేటలో మహిళా రైతు కళమ్మ, యూరియా ఇప్పించాలంటూ ఏవో వినయ్ కుమార్ కాళ్లు పట్టుకొని వేడుకుంది.