Share News

Rainfall: కాల మే మారింది

ABN , Publish Date - Jun 09 , 2025 | 04:33 AM

మే.. అంటే వేసవి.. వేసవి అంటే మే నెల ఠక్కున గుర్తుకొస్తాయి! అయితే.. తీవ్రమైన ఎండలు, వడగాడ్పులతో నిప్పుల కుంపటి వాతావరణం నెలకొనాల్సిన మే నెలలో.. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిశాయి.

 Rainfall: కాల మే మారింది

124 ఏళ్లలో మే నెలలో అత్యధిక వర్షం.. 126.7 మి.మీ నమోదు

సగటు కంటే 106% అధికం

విశాఖపట్నం, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): మే.. అంటే వేసవి.. వేసవి అంటే మే నెల ఠక్కున గుర్తుకొస్తాయి! అయితే.. తీవ్రమైన ఎండలు, వడగాడ్పులతో నిప్పుల కుంపటి వాతావరణం నెలకొనాల్సిన మే నెలలో.. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈశాన్య భారతంలో పలు రాష్ట్రాల్లో, పడమర తీరంలో ముంబైలో వరదలు ముంచెత్తాయి. ఉత్తరాదిలో ఏడు వెస్ట్రన్‌ డిస్ట్రబెన్స్‌లు ప్రయాణించడం, వారం ముందుగానే నైరుతి రుతుపవనాలు దేశ భూభాగంలోకి ప్రవేశించడంతో మే నెలలో 126.7 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. ఇది దీర్ఘకాలిక సగటు కంటే 106 శాతం ఎక్కువ. ఈ విధంగా నమోదుకావడం గడచిన 124 సంవత్సరాల్లో (1901 నుంచి) ఇదే ప్రథమమని వాతావరణ శాఖ తెలిపింది. దేశంలో 36 వాతావరణ సబ్‌డివిజన్లకుగాను 25 సబ్‌డివిజన్లలో అత్యంత అధికం నుంచి అధిక వర్షపాతం, ఆరు సబ్‌ డివిజన్లలో సాధారణ వర్షపాతం నమోదైంది. ఈ మేరకు మే నెలకు సంబంధించి వర్షపాతం, ఉష్ణోగ్రతలపై బులెటిన్‌ విడుదల చేసింది. 50 ఏళ్ల దీర్ఘకాలిక సగటు ప్రకారం మే నెలలో 61.4మి.మీ.ల వర్షపాతం నమోదు కావాలి. ప్రాంతాలవారీగా చూస్తే దక్షిణ భారతంలో 199.7 మి.మీలు కురిసింది. ఇది 1901 తరువాత రెండో అత్యఽధికం.

దేశవ్యాప్తంగా అతిభారీ వర్షపాతం!

మరోవైపు రుతుపవనాలు ముందుగానే కేరళలో ప్రవేశించి పశ్చిమబెంగాల్‌, ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించడంతో వర్షాలు ముంచెత్తాయి. మే నెల ప్రారంభం నుంచి దేశంలో అనేక ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు తగ్గాయి. అనేకచోట్ల వడగాడ్పుల ప్రభావం లేదు. అయితే 1991 నుంచి 2020 వరకు 30 ఏళ్ల సగటు ఉష్ణోగ్రతల మేరకు మే నెలలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 36.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.17 డిగ్రీలుకాగా సగటు ఉష్ణోగ్రత 30.38గా నమోదుకావల్సి ఉంది. కానీ మే నెలలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 35.08, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.07, సగటు ఉష్ణోగ్రత 29.57 డిగ్రీలు నమోదైంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 1.52, కనిష్ఠ ఉష్ణోగ్రత 0.10, సగటు ఉష్ణోగ్రత 0.81 డిగ్రీలు తక్కువగా నమోదైంది. ఈ నేపథ్యంలో మే నెలలో ప్రజలు ఎండ నుంచి ఉపశమనం పొందారని వాతావరణ నిపుణులు విశ్లేషించారు. ఇంకా వర్షాలతో కృష్ణా బేసిన్‌లో వరద వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.


రాష్ట్రానికి వర్ష సూచన !

4 రోజుల పాటు తేలికపాటి వర్షాలు

హైదరాబాద్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వర్షసూచన చేసింది. సోమవారం నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా ఈదురుగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. మంగళవారం 20 జిల్లాలకు వర్షాలకు సంబంధించిన ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా రాష్ట్రంలో ఆదివారం గరిష్ఠంగా 38.2, కనిష్ఠంగా 25.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావారణ కేంద్రం వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

For Telangana News And Telugu News

Updated Date - Jun 09 , 2025 | 07:49 AM